ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం !

By KTV Telugu On 27 December, 2022
image

చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇటీవల జరిగిన మూడు రోజుల పర్యటనలో వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కడిగి పారేశారు. రాజాం, బొబ్బిలి, విజయ నగరం ఎక్కడ చూసినా జనం చంద్రబాబు ప్రసంగాలకు కేరింతలు కొట్టారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలన్న నినాదం జనంలోకి బాగానే వెళ్లింది. పనిలో పనిగా చంద్రబాబు మద్య నిషేధ ప్రస్తావన తెచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం పేరుతో అధికారానికి వచ్చిన జగన్ ఆ తర్వాత మాట మార్చేశారని చంద్రబాబు విమర్శించారు. పిచ్చి బ్రాండ్లు అమ్ముతున్నారని తాగితేనే డబ్బులు రావాలన్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పుకొచ్చారు. మద్యం ఆదాయాన్ని ముందే అమ్ముకుని పాతిక వేల కోట్లు అప్పు చేశారన్నారు.

చంద్రబాబు వ్యూహాత్మకంగానే మద్యనిషేధ ప్రస్తావన చేశారని నమ్ముతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ఎత్తేసిన మద్యనిషేధాన్ని మళ్లీ ఆమలు జరిపితే ఎలా ఉంటుందో ప్రజల నుంచి ఆయన సమాచారం తీసుకుంటున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ రెడ్డి అన్ని హామీలను తుంగలో తొక్కినట్లుగానే మద్య నిషేధ హామీకి కూడా నీళ్లొదిలేశారని చంద్రబాబు ఆరోపిస్తూ తనకు అధికారమిస్తే నిషేధాన్ని అమలు జరుపుతున్నారన్న సందేశం ఇస్తున్నారు. అమ్మ ఒడి లేకపోయినా నాన్న బుడ్డికి తక్కువేం లేదని అంటూ సెటైర్లు వేయడం ద్వారా చంద్రబాబు తన మనసులో మాట చెబుతున్నారు.

చంద్రబాబు ఆలోచనను అర్థం చేసుకున్న వైసీపీ తామే మద్య నిషేధాన్ని అమలు చేస్తే ఆ అవకాశాన్ని విపక్షాలకు ఇవ్వకుండా ప్రయోజనం పొందవచ్చని భావిస్తోంది. ఎన్నికలకు ముందే మద్యనిషేధాన్ని అమలు చేయాలన్న మాస్టర్ ప్లాన్ వారి మదిలో మెదులుతోంది. ఎన్ని షాపులు ఉన్నా మద్యనిషేధం విధిస్తే అన్నింటినీ మూసెయ్యాలని డిప్యూటీ సీఎం కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించడం ద్వారా నిషేధానికి రెడీ అవుతున్న సంకేతాలిచ్చారు. ప్రతీ ఏటా 20 శాతం షాపులను తగ్గిస్తామంటూ గతంలో జగన్ చేసిన ప్రకటనను ఇటీవల కొందరు గుర్తు చేయడంతో వైసీపీ వర్గాల్లో మద్యనిషేధంపై చర్చ జరుగుతోంది. మద్యం ఆదాయాన్ని పాతికేళ్లకు సరిపడా టాకట్టు పెట్టినప్పటికీ వేరు మార్గాల్లో ఆ డబ్బు చెల్లించి నిషేధాన్ని అమలు చేయాలని వైసీపీ భావిస్తోంది.

చంద్రబాబు అధికారంలోకి వస్తే తక్షణమే మద్య నిషేధం అమలు చేస్తారన్నది ఖాయంగా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మద్యం వ్యాపారం మొత్తం వైసీపీ వారి చేతిలో ఉంది. వారిని ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే నిషేధం విధించాలి. ఆ పనేదో తాము ముందే కానిచ్చేస్తే… ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చు. ఎన్నికల తర్వాత చంద్రబాబు గెలిచి మద్యనిషేధాన్ని ఎత్తేస్తే ఆయన ప్రభుత్వాన్ని తప్పు పట్టే అవకాశం ఉంది. తాము గెలిస్తే కొంతకాలం తర్వాత మద్యం పాలసీని సమీక్షించుకుని తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మద్యనిషేధం అమలుకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీలో మందుబాబులకు ఇబ్బంది తప్పదు.