మోడీతో జగన్ భేటీ అందుకేనా?

By KTV Telugu On 27 December, 2022
image

మోడీతో బంధం ప్రత్యేకమైనదని ఏపీ సీఎం చెబుతున్నారు. కేంద్రంతో సఖ్యతగా మెలుగుతున్నారు. కానీ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదు. మొండిచేయి చూపిస్తున్నారు. విభజన హామీలను సాధించాల్సిన అధికార వైసీపీ గట్టిగా అడగడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాంతో కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేకహోదా లేదని కేంద్రం తేల్చేసింది. హోదా ఉనికిలోలేని అంశమని అంటోంది. అంతేకాదు పోలవరం ఇప్పట్లో పూర్తికాదని చెప్పింది. ఇప్పటికే చాలా ఇచ్చాం. ఇవ్వాల్సింది కొంతేనని కుండబద్దలు కొట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు రూ.6,461.88 కోట్లు విడుదల చేసినట్లు ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇంకా చెల్లించాల్సింది రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని తెలిపారు.

ఇటీవల కేంద్రం విప్పిన రాష్ట్రాల అప్పుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చిట్టా పెద్దగానే ఉంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్‌ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3,98,903 కోట్లకు చేరినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా తెలిపారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ప్రతీ ఏడాది అప్పులు పెంచుకుంటూ పోతోందని మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో చూపించిన అప్పుల కంటే ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను కూడా భారీగా చేస్తోందని కేంద్రం మొట్టికాయలు వేసింది. అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన అప్పుల కోసం తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఇక ఆయన వల్ల కాకపోవడంతో ఇప్పుడు సీఎం నేరుగా రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.

ఒకటో తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఉద్యోగులకే కాదు ప్రభుత్వానికీ టెన్షన్ తప్పడం లేదు. నవంబర్ నెల జీతాలు డిసెంబర్ 22వ తారీఖుకు అందరికీ ఇవ్వగలిగారు. ఇప్పుడు మళ్లీ నెల వచ్చేస్తోంది. సామాజిక పెన్షన్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి వాటికి కలిపి కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఓడీలోనే ఉందన్న ప్రచారం జరుగుతోంది. తప్పనిసరిగా అప్పు పుట్టకపోతే సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వలేరు. పైగా ఈ నెల 250 రూపాయలు పెంచుతున్నారు. అందుకే ముందస్తుగా అప్పుల కోసం జగన్ ప్రధాని మోడీ వద్దకు వెళ్తున్నారని అంటున్నారు. ఇటీవల పార్లమెంట్‌ లో ఓ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. అది ఏపీని ఉద్దేశించేనని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు అప్పులకు అనుమతి రావాలంటే నేరుగా సీఎం రంగంలోకి దిగాల్సిందేనని భావించి జగన్ మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా చెబుతున్నారు.

ఇక విభజన హామీల విషయంలో కేంద్రంపై వైసీపీ సర్కార్ పెట్టుకున్న ఆశల్నీ ఆవిరవుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కీలక సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగబోతోందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ అవుతారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు ఇతరత్రా అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చిస్తారని సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. ఐదు వేల కోట్ల వరకూ నిధులు మంజూరు చేస్తారని వైసీపీ సర్కార్ ఆశలు పెట్టుకుంది. కానీ వాటి విషయంలోనూ కేంద్రం కోతలేస్తోందన్న సమాచారం రావడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇవన్నీ ప్రధానితో భేటీలో జగన్ చర్చించే అవకాశం ఉందంటున్నారు.

సీఎం జగన్ పర్యటనలో రాజకీయ అంశాలేవీ లేవని చెబుతున్నా తెరవెనక ఈ చర్చ కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే మార్చి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోతే అసెంబ్లీని రద్దు చేయడం ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. ఈ దిశగా కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. చాలా బిల్లులు అంశాల విషయంలో బయటి నుంచి మద్దతు ఇస్తోంది. తద్వారా కేంద్రంతో ఎలాంటి సమస్యలూ లేకుండా చూసుకుంటున్నారు సీఎం జగన్. డిసెంబర్ మొదటి వారంలో ఓసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని సారథ్యంలో జరిగిన G20 సన్నాహక సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇదే అంశంపై ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో కూడా పాల్గొన్నారు. ఆ మధ్య ప్రధాని వైజాగ్ వచ్చినప్పుడు కూడా సీఎం జగన్ ఆయనతో కలిసి స్టేజీని పంచుకున్నారు.