ముందస్తుకు ముహూర్తం కుదిరిందా? ప్రధానితో జగన్ భేటీ..

By KTV Telugu On 30 December, 2022
image

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్‌పై రకరకాల ప్రచారం జరుగుతోంది. విభజనహామీలపై చర్చించారని కొందరు ఏపీకి రుణాలు తీసుకొచ్చేందుకు వెళ్లారని మరికొన్ని మీడియా సంస్థలు వండి వార్చాయి. అయితే అన్నింటికీ మించి ముందస్తు ఎన్నికల ప్లాన్‌తోనే జగన్ ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారన్న వార్త హైలెట్ అవుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు మాట తరచూ వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే ఎన్నికలు ముందే వస్తాయంటూ కేడర్‌ను సంసిద్ధం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను అధికార పార్టీ కొట్టివేస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తోంది. తాజాగా జగన్ హస్తిన పర్యటన ముగించుకొని వచ్చిన వేళ మరోసారి ముందస్తు రాగం వినిపిస్తోంది.

మూడున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చే ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం బాట పట్టింది. ఈ పరిణామాలను గమనించిన విపక్షాలు ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అనేలా ఈ పరిణామాలున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నిఘా వర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు సమాచారం. బయటకు అలాంటిదేమీ లేదని చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. అప్పటికే బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు ముందస్తు సంకేతాలను ముందనుంచి గమనిస్తూ ఓ అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్లే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. కొంతకాలంగా ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తోన్న పవన్ కళ్యాణ్ కూడా వారాహితో యాత్ర మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.