ఏపీలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుల మధ్య ఆసక్తికర యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఇద్దరు నేతలు. అయితే బాబు తెలంగాణ రాజకీయ వ్యూహాన్ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టింది. సీఎం జగన్ లేటెస్ట్‌గా తన సొంతగడ్డ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా కమలాపురం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన జగన్ చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని తాను అనడంలేదని తెలిపారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను చెప్పడం లేదంటూ సెటైర్లు వేశారు. ఇదే నా రాష్ట్రం ఇక్కడే నివాసం, ఇక్కడే నా మమకారం, ఐదు కోట్ల ఆంధ్రుల సంతోషమే తనకు ముఖ్యమంటూ తాను ఏపీలో మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చారు జగన్.
కడప గడ్డ నుంచి జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బొబ్బిలి బహిరంగ సభలో బాబు గర్జించారు. తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటానంటూ సినిమాలో డైలాగ్ మాదిరి తెలుగు జాతి ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానన్నారు చంద్రబాబు. తెలుగువారు అమెరికాలో ఉన్నా తమిళనాడులో ఉన్నా తెలంగాణలో ఉన్నా వాళ్లతోనే ఉంటానన్నారు. ఎక్కడ తెలుగు వాళ్లు ఉంటే అక్కడ ఉంటా ఇదే జగన్‌కు తన సమాధానం అన్నారు. జగన్ రెడ్డి బొబ్బిలి కోటలో చూడు ప్రజల హృదయాల్లో ఉంటా వాళ్ల మనసుల్లో ఉంటానంటూ బావమరిది బాలయ్య మాదిరి డైలాగులు పేలుస్తూ జగన్‌పై అటాక్ చేశారు బాబు. జగన్ రాజకీయం చేస్తే తానూ రాజకీయం చేస్తానన్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు చంద్రబాబు. తెలంగాణలో ఏపీ కన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. దాంట్లో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే బీజేపీతో పొత్తు కోసమే బాబు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణలో బాబు ఆటలు సాగవని హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో బాబు తెలంగాణ పాలిటిక్స్‌ను వైసీపీ కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. తాము ఏపీకే పరిమితమని చెప్పడం ద్వారా స్థానిక ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగనే ప్రయత్నం చేస్తోంది. కడపలో జగన్ కామెంట్స్ దాంట్లో భాగమేనని తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బాబు ఖమ్మం టూర్‌నుద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ఇల్లే కాదు ఓటుకూడా తెలంగాణలోనే ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌తో అంటకాగిన బాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసమే తెలంగాణలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బాబుది రెండు కళ్ల సిద్ధాంతమని పగలు ఒకమాట, రాత్రికి ఒక మాట, ఆ పార్టీ వద్ద ఒక మాట, ఈ పార్టీ వద్ద ఒకమాట మాట్లాడుతూ ఉన్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చే సమయానికి వ్యాపారం చేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య అని విమర్శించారు. అయితే తెలుగువారికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలుగుజాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చంద్రబాబు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అక్కడ మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే జగన్ సోదరి షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి అక్కడ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ అక్కడ రాజకీయం చేసే పరిస్థితి లేదు. దాంతో ఏపీకే పరిమితమవుతోంది జగన్ పార్టీ. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను నియమించారు. ఈనేపథ్యంలో ఆంధ్రా ప్రజలే తమ కుటుంబమంటోన్న వైసీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిన తమ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లు సాధిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం అందివచ్చే అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మల్చుకుంటోంది.