జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి చేరిన వాళ్లంతా ఇప్పుడు అసంతృప్తితో పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ కోసం ప్రాణం ఇస్తామనే వారి సంఖ్య తగ్గిపోతోంది. అధినేతకు షాకులిచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. పార్టీలో రెబెల్ వ్యవహారాలు ఎక్కువవుతున్నాయని ఫ్యాన్ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతుండగా వైసీపీలో అసమ్మతి స్వరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చాటుమాటుగా కాకుండా నేతలంతా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
మూడున్నరేళ్లుగా జగన్ మాటే వేదవాక్కు అంటూ చెప్పుకొచ్చిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా నిరసన గళమెత్తుతున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకే భయపడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. 2019లో 151 సీట్లు వచ్చిన పార్టీయేనా ఇదీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాతే వైసీపీలో అగ్గి రాజుకుంది. ఒత్తిళ్లకు తలొగ్గి 11 మంది పాతవారినే మళ్లీ మంత్రులుగా కొనసాగించడంతో విభేదాలు రాజుకున్నాయి. అసలు అవకాశం రాని ఔత్సాహికులు, మంత్రి పదవి కోల్పోయిన వారు వీధిన పడి గోల చేయడం ప్రారంభించారు. అది ఇప్పుడు తారా స్థాయికి చేరింది. అసంతృప్తి, అసమ్మతి, ధిక్కార ధోరణి వైసీపీలో రోజువారీగా బయటపడుతున్నాయి.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు చాలా రోజులుగా పార్టీకి తలనొప్పిగా మారారు. మధ్యమధ్యలో డీఎల్ రవీంద్రారెడ్డి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాచమల్లు శివప్రసాద రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, వసంత కృష్ణప్రసాద్ ఇలా రోజుకొకరు జగన్ పాలనపై అసహనం వ్యక్తం చేస్తుండటం అధికార పార్టీని టెన్షన్ పెడుతోంది. వీళ్లు బయటకు వచ్చిన వాళ్లు మాత్రమే. బయటకు రాని వారు చాలా మంది ఉన్నారని అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు పెద్దారెడ్డిగా పేరున్న మాజీ మంత్రి ఆనం మంచి టైమింగ్‌తో సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫలితంగా అధిష్టానం వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డికి అప్పగించింది. అయినప్పటికీ తగ్గేదే లే అన్నట్టుగా ఆనం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొస్తే ఏడాదిలో ఇంటికెళ్లడం ఖాయమన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు నిరసనలు తెలిపి సీఎంను చికాకు పరిచారు. పెన్షన్ల కోత తేనె తుట్టెను కదిలించడంతో జగన్ ఆయనను పిలిపించాల్సి వచ్చింది. పైకి ఆల్ ఈజ్ వెల్ అని చెబుతున్నప్పటికీ కోటంరెడ్డి వ్యవహారం నివురు గప్పిన నిప్పేనని అంటున్నారు. కోటంరెడ్డి వెళ్లిపోతారా జగన్ పంపించేస్తారా అనేది ప్రస్తుత ప్రశ్న.
మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ వేలు పెట్టడంపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆ సమస్యను జగన్ స్వయంగా పరష్కరించినా వసంత అసంతృప్తి మాత్రం తగ్గలేదు. తాజాగా గుంటూరు ఘటనలో ప్రభుత్వం నిందితుడిగా భావిస్తున్న ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును వెనుకేసుకొచ్చారు. దీనితో కృష్ణప్రసాద్ ఇప్పుడు సామాజికవర్గం రాజకీయాలు చేస్తున్నారన్న వాదన భావిస్తున్నారు. ఎన్నికల నాటికి వసంత బయటకు వెళ్తారన్న టాక్ నడుస్తోంది. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి చాలా కాలంగా జగన్ కు దూరంగా ఉంటున్నారు. టీడీపీని, చంద్రబాబు నాయుడును పొగుడుతూ రోజూ సొంత పార్టీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శలతో వైసీపీ పరువు గంగలో కలుస్తోంది. జగన్ బటన్ నొక్కుడు వాలంటీర్ల వ్యవస్థ కారణంగా తమ గ్రాఫ్ పెరగడం లేదని మద్దిశెట్టి తన అసంతృప్తి వెళ్లగక్కారు.
ఇలా చెప్పుకుంటూ పోటే ప్రభుత్వ పనితీరుతో విసుగెత్తుతున్న వారి సంఖ్య వైసీపీలో రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మూడున్నరేళ్లుగా మౌనం వహించిన వారంతా ఉన్నట్టుండి తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. జగన్ వారిని ఎలా సమాధానపరుస్తారో చూడాలి.