తోకపార్టీలని ప్రత్యర్థుల విమర్శించినా తక్కువచేసి మాట్లాడినా ఎర్రజెండాలు ఎప్పుడూ మొహం ముడుచుకోవు. అదృష్టం కలిసొచ్చి నాలుగు సీట్లు దక్కితే ఆనందం. రాకపోయినా ఫీలింగ్స్ పెద్దగా ఏమీ మారవు. మేం ఉన్నది పదవులకోసం కాదు పోరాటాలకోసం అని చెప్పుకుంటారు. అధికారంకోసం ఆరాటపడేవాళ్లం కాదని మైకుల మోత మోగిస్తారు. ఒకప్పుడు తెలుగురాష్ట్రాల్లో అంతో ఇంతో ఎర్రజెండాల సందడి కనిపించేది. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం ఉండేది. కానీ రాన్రానూ వామపక్షాలకు మద్దతుగా పిడికిలి బిగించేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది.
ఒక్క బీజేపీతో తప్ప ఎవరితోనైనా పొత్తుకు కామ్రేడ్లు రెడీ. పొత్తు ప్రయోగాలు వికటించినా ఫలితాలు ఇవ్వకపోయినా పెద్దగా ఫీలయ్యేదేమీ లేదు. కొండకు వెంట్రుకేస్తున్నాం. వస్తే కొండ లేదంటే వెంట్రుక అన్న పాజిటివ్ దృక్పథాన్ని బాగానే అలవర్చుకున్నారు కాబట్టే సీట్లు లేవనే లోటు ఎప్పుడూ లేదు. కానీ అలాగని కాడి వదిలేయలేరు కదా. మానవప్రయత్నం చేయాల్సిందే. తెలంగాణలో మొన్న మునుగోడు రూపంలో వామపక్షాలకు కాలం కలిసొచ్చింది. కూడబలుక్కుని కేసీఆర్‌కి జైకొట్టారు. మునుగోడులో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవటంతో వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో కేసీఆర్ పార్టీతో అవగాహన కుదిరేలా ఉంది. ఎన్ని సీట్లు ఇస్తారు అందులో ఎన్ని గెలుస్తామన్నది తర్వాత. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంతే.
ఏపీలో మొదట్లో పవన్‌కళ్యాణ్‌లో వామపక్షాలకు కరడుగట్టిన కామ్రేడ్ కనిపించాడు. అంతా కలిసి కొన్నాళ్లు జనంలో తిరిగారు. కానీ పవన్‌ది ఎంత చపలచిత్తమో కమ్యూనిస్టు పార్టీలకు త్వరగానే తెలిసొచ్చింది. పవన్‌కళ్యాణ్ బీజేపీతో అంటకాగేసరికి వామపక్షాలు ఆయనకు దూరంగా జరిగాయి. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ బీజేపీకి దూరం. టీడీపీతో పొత్తు పెట్టుకునేలా ఉన్నారు. దీంతో వామపక్షాలు మళ్లీ సైకిల్‌పార్టీ చక్రాలను సవరించే పనిలో పడ్డాయి. చంద్రబాబుని ప్రసన్నంచేసుకునేందుకు పాట్లు పడుతున్నాయి. జీవోనెంబర్ 1 తీసుకొచ్చిందే చంద్రబాబుని కట్టడిచేసేందుకు. ఆయన సభల్లో తొక్కిసలాటతో కొన్ని ప్రాణాలు పోవటంతో ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇప్పుడా జీవోకి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేస్తామంటున్నాయి వామపక్షాలు. ఈ వంకతో టీడీపీకి దగ్గరైతే ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వకపోతారా అన్న ఆశ.
చంద్రబాబేమో పవన్‌కళ్యాణ్‌ని దువ్వుతూనే బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. మళ్లీ కమలంతో కలిసేందుకు సిద్ధమనే సంకేతాలిస్తున్నారు. కానీ బీజేపీ చంద్రబాబును దరి చేరనివ్వడం లేదు. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ని దూరం చేసుకోవడం కమలంపార్టీకి ఇష్టంలేదు. ఈ కన్‌ఫ్యూజన్ సమయంలో బీజేపీ మనసును నొప్పించే పనులు చేయడానికి చంద్రబాబు సాహసించకపోవచ్చు. బీజేపీ మీద ప్రధానిమీద యుద్ధం ప్రకటించిన వామపక్షాలను దగ్గరికి తీసుకుంటే కమలం కన్నెర్ర చేస్తుందన్న సంశయం టీడీపీ అధినేతలో ఉంది. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు వాటి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కూడా కాదంటే వామపక్షాలకున్న మరో ఆప్షన్ బీఆర్‌ఎస్. ఎలాగూ తెలంగాణలో పొత్తు కుదిరేలా ఉంది కాబట్టి ఆంధ్రాలో కూడా దాన్నే ఫాలో అయిపోతే ఏ గొడవా ఉండదు. అందుకే గులాబీపార్టీని కూడా ఫైనల్ ఆప్షన్‌గా పెట్టుకున్నట్లున్నారు కామ్రేడ్లు.