రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. తెలంగాణాలో బోణీ అయినా కొట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం విభజన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేదు. 2014,2019 ఎన్నికల్లో కామ్రేడ్ల అడ్రస్ గల్లంతు అయ్యింది. 2024 ఎన్నికల్లో అయినా తమ పరువు కాపాడుకోవాలని కమ్యూనిస్టులు పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పండితులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. అయితే రాను రాను వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఓ సారి కాంగ్రెస్ తో మరోసారి టిడిపితో పొత్తులు పెట్టుకుని సీట్లు పంచుకున్న కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణా లో ఒకటి రెండు సీట్లు అయినా గెలుచుకుని మేం ఉన్నామని చాటుకున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అస్తిత్వం కోసం పాకులాడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. పొత్తులు పెట్టుకుందామంటే బలమైన పార్టీలు దొరకలేదు. అందుకే 2014,2019 ఎన్నికల్లో కామ్రేడ్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014 లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరి పోరాటానికి సిద్ధం అయ్యింది. టిడిపితో పొత్తు పెట్టుకుందామని అనుకుంటే టిడిపి-బిజెపితో జట్టు కట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ఆంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేకపోయింది. దాంతో సిపిఐ, సిపిఎం పార్టీలు రెండూ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాయి. అసలు డిపాజిట్లే సంపాదించలేక చతికిల పడ్డాయి.
అయిదేళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కమ్యూనిస్టులు ఆశించారు. ఆ ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. వరుసగా రెండో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పట్ల జనం వ్యతిరేకతతోనే ఉన్నారు. ఆ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు లాభం లేకపోయింది. 201 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని టిడిపిని చిత్తుగా ఓడించింది.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి స్తబ్ధుగా ఉండిపోయింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పై నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు .ఈ క్రమంలో సిపిఐ నాయకులు టిడిపితో కలిసి రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోంటే వాటిని కోర్టులకెక్కి అడ్డుకున్న టిడిపితో కలిసి సిపిఐ కూడా విశాఖలో పేదలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇదంతా కూడా 2024 ఎన్నికల్లో టిడిపితో పొత్తు కుదురుతుందన్న ఆశతోనే. అయితే చంద్రబబు నాయుడు అయిదేళ్ల పాటు కమ్యూనిస్టులతో కలిసి ఉండి సరిగ్గా ఎన్నికల ముందు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.
టిడిపి-జనసేనలు రెండూ బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండక తప్పలేదు కామ్రేడ్లకు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో ఎన్నికల్లోనూ ఒంటరి పోరుకు సిద్ధమైపోయింది. కమ్యూనిస్టులకు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అర్ధం కాలేదు. ఈ తరుణంలో ఏపీ కాంగ్రెస్ కు షర్మిల చీఫ్ అయ్యారు. ఆమె చొరవతో ఇపుడు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో అవగాహన కుదుర్చుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ సారి కూడా కమ్యూనిస్టులు బోణీ కొట్టే పరిస్థితి కనపడ్డం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీయే బోణీ కొట్టే అవకాశాలు లేవంటున్నారు. మరి కామ్రేడ్లు చట్టసభలో అడుగు పెట్టాలంటే 2029 ఎన్నికల వరకు ఆగాలేమో అంటున్నారు మేథావులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…