బుగ్గన పసిపిల్లాడేం కాదు. చిట్టాపద్దుల లెక్కలన్నీ తేల్చే ఆర్థికశాఖకు మంత్రి. అనుభవజ్ఞుడు. ఆయన ఏదో చెప్పబోయి మరేదో చెప్పేశారనుకుంటే అమాయకత్వమే. ఆయనేదో చెబితే జనం మరేదో అర్ధంచేసుకున్నారనడం అవివేకమే. అమరావతిని వ్యతిరేకించే క్రమంలో అధికారపార్టీ నేతల అత్యుత్సాహం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఓ పక్క అధికార వికేంద్రీకరణకోసమే ఏపీలో మూడు రాజధానులంటోంది వైసీపీ ప్రభుత్వం. అమరావతి శాసన రాజధాని అని విశాఖ పాలనా రాజధాని అని కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని విడమర్చి చెబుతోంది. అలాంటప్పుడు మూడు రాజధానులు తూచ్ అని బాధ్యతాయుతమైన మంత్రి వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి.
విశాఖ మాత్రమే రాజధానిగా ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పామరులకు కూడా అర్ధమయ్యేలా చెప్పారు. ఏపీకి మూడు రాజధానులన్నది అవాస్తవమని రీసౌండ్ వచ్చేలా చెప్పారు. కర్నాటక మాదిరి అసెంబ్లీ సమావేశాల్లో ఓ సెషన్ గుంటూరులో నిర్వహిస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంత క్లారిటీ ఇచ్చాక ఆయన మాటల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే వాదన ఎందుకు నిలుస్తుంది. ఆయన ఉద్దేశం అదికాదనీ తప్పుగా అర్ధంచేసుకున్నారని నేతలు ఎవరు చెప్పినా అది జనాన్ని పిచ్చోళ్లని చేయడమే. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి బుగ్గన మాటల్లో తప్పేం లేదంటున్నారు.
కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారనేది సజ్జల మాట. కొత్తగా మరో గందరగోళం సృష్టించిందే వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి. ఆయన ఉద్దేశమేంటో విశాఖ మాత్రమే రాజధాని అన్న మాట ఆయన నోట ఎలా వచ్చిందో అంతర్గతంగా తేల్చుకుని ఆయనతోనే వివరణ ఇప్పించాలి. బయటివాళ్లెవరో వచ్చి అపోహలు సృష్టించలేదు. బుగ్గన తప్పేమీ మాట్లాడలేదంటూనే మళ్లీ మూడు రాజధానులు ఉంటాయని, త్రీ కేపిటల్స్ అనే పిలుస్తామని సెలవిస్తున్నారు సజ్జల. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారయినా రాజధాని విషయంలో మాట్లాడొద్దని రూలింగ్ పెడితే పోయేదానికి ఎందుకీ దోబూచులాట?
ఓపక్క అమరావతి రైతులు రగిలిపోతున్నారు. కేంద్రం అమరావతినే అప్పట్లో రాజధానిగా గుర్తించామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇలాంటి సమయంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఒకే స్టాండ్‌మీద ఉండాల్సింది పోయి పూటకోమాటతో ప్రజలను గందరగోళంలో ఎందుకు పడేస్తున్నట్లు అమరావతి రైతుల పుండుమీద కారం చల్లడమే కాదు కర్నూలులో హైకోర్టు ఉత్తిమాటన్నట్లు అదే జిల్లాకు చెందిన మంత్రి బుగ్గన చెప్పడం సీమలోనూ చిచ్చుపెట్టినట్లు కాదా. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి తొమ్మిదేళ్లుదాటినా ఏది రాజధానో చెప్పుకోలేని దుస్థితిలో ఏపీ ఉంది. రాజధాని అంశం న్యాయస్థానంలో నలుగుతోంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అధికారపార్టీ పెద్దలే నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రం నవ్వులపాలవుతుంది.