ఆ 50 సీట్లు ఎక్కడో…

By KTV Telugu On 7 February, 2024
image

KTV TELUGU :-

టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోంది. ఎన్ని చర్చలు జరిపినా పార్టీల పొత్తు ఎందుకు ముందుకు జరగడం లేదు. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం వచ్చిందంటూ లీకులు ఇస్తున్నా….అధికారిక ప్రకటన ఎందుకు రావడం లేదు.వరుస భేటీల్లో సాధించిందీ శూన్యమన్న అభిప్రాయం ఇరు పార్టీల కార్యకర్తల్లో ఎందుకు కలుగుతోంది…..

వేసవి మొదలు కాబోతోంది. రాజకీయ వేడి రగులుతోంది. దానికి ఎన్నికల భయం తోడవుతోంది. ఐనా సరే టీడీపీ – జనసేన అగ్రనేతలు మాత్రం ఎలాంటి  చీకుచింతా లేకుండా చల్లగా సేదదీరుతున్నారు. ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు టెన్షన్ తో బుర్ర వేడెక్కిపోతుంటే చంద్రబాబు, పవన్  కల్యాణ్  మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసి రెండేసి సీట్లు ప్రకటించిన న్యూటన్ మూడో సూత్రం కూడా మరుగునపడిపోయిన నేపథ్యంలో ఇంకా జాప్యం ఎన్నాళ్లూ అని క్షేత్రస్థాయి నేతలు ప్రశ్నించుకుంటున్నారు. ఐనా నేతల్లో మార్ప రాలేదా లేక అన్ని మాట్లాడుకుని  గంభనంగా ఉంటున్నారా అన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆదివారం మలి దఫా భేటీ అయిన తర్వాత కూడా సీట్లపై ఎలాంటి ప్రకటన రాలేదు. అంతా అయిపోయింది, అధికారిక ప్రకటనే తరువాయి అంటూ అనుకూల మీడియా కథనాలు వండివార్చుతోంది. కొన్ని స్థానాలకు అభ్యర్థులను మీడియా ప్రచారం చేస్తుందే తప్ప నేతలు నోరు మెదపడం లేదు…

పవన్ ఎలాగైనా ఈ సారి అసెంబ్లీలో అడుగు పెడదామనుకుంటున్నారు. చంద్రబాబు అయితే  ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ సైతం చేశారు. ఆ దిశగా అడుగులు  పడుతున్నాయా అంటే లేదనిపిస్తోంది. వైసీపీ ఒక పక్క విడతల వారీగా జాబితాలు ప్రకటిస్తుంటే…వాళ్లు తిరస్కరించిన తాలుకాయలను చేర్చుకోవడం మినహా ఆ రెండు పార్టీలు చేస్తున్నదేమిటో అర్థం కావడం లేదు.

ప్రత్యర్థులు ఏకం కాకూడదని ఏ పార్టీ  అయినా అనుకుంటుంది. వైసీపీ కూడా ఇప్పుడే అదే ధోరణిలో వెళ్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదరకూడదనే భావిస్తోంది. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదంటూ కవ్విస్తోంది. ఒంటరిగా పోటీ చేసి చూడాలంటూ  రెండు పార్టీలను సవాలు చేస్తోంది. ఐనా ఇరుపార్టీలు అలాంటి సవాళ్లను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని  పవన్ కల్యాణ్ స్పష్టంగానే చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఐతే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు. ఆ సంగతి ఎవరు, ఎప్పుడు చెబుతారు అన్నదే పెద్ద ప్రశ్న. జనసేనకు టీడీపీ  30 సీట్లు ఇస్తే గొప్ప అన్న చర్చ జరుగుతోంది. యాభై సీట్లకు తక్కువ తీసుకోకూడదని కొందరు  జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగినప్పుడు ఆశావహుల్లో చాలా మంది జనసేన నేతలకు టికెట్లు వస్తాయన్నది వారి ఆలోచన.ఆదివారం రెండు దఫాలుగా అగ్రనేతలు సమావేశమయ్యారు. చర్చించిన అంశాలపై అధికారిక ప్రకటన రాకపోయినా.. 20  నుంచి 30 అంటూనే..ఫైనల్ గా 27 దగ్గర ఆగుతుందని టీడీపీ అనుకూల మీడియాలో వాయు  వేగంతో కథనాలు వచ్చేశాయి. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల పేర్లు కూడా రాసేశారు. ఈ  నెల ఎనిమిది మరో సారి భేటీలో సీట్లు ఫైనలైజ్ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.అయితే యాభై సీట్లు వస్తేనే మంచిదన్నది జనసైనికుల మాట.  పైగా పోటీ చేసిన చోటల్లా గెలిచే అవకాశం లేదు కాబట్టి కనీసం 30కి పైగా గెలుస్తామన్నది మరో ఆశ. గెలిచిన స్థానాలు 30 దాటితేనే ఎన్నికల తర్వాత టీడీపీతో బేరమాడేందుకు కూడా ఛాన్సుంటుందని వారు లెక్కలేసుకుంటున్నారు. అప్పుడే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి కోరాలన్నా…అవకాశాన్ని బట్టి సగం  రోజులు సీఎం పదవి అడగాలన్న వీలుపడుతుందని ఎదురుచూస్తున్నారు. వారి ఆలోచన బాగానే ఉన్నా  సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వస్తేనే కార్యకర్తలకు  కూడా క్లారిటీ ఉంటుంది. జనసేన  డిమాండ్లను అర్థం  చేసుకునే టీడీపీ జాప్యం చేస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. బలం లేని చోట కూడా జనసేన టికెట్లు అడగడమే ఇప్పుడు  టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

జనసేన కోరినట్లుగా కోస్తాలో ఆ పార్టీకి 40 స్థానాలకు పైబడి ఇవ్వడం కుదరదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది.అదీ వాస్తవం కూడా. జనసేన మాత్రం  నౌ ఆర్ నెవ్వర్ అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు డిమాండ్ చేసి తీసుకోకపోతే తర్వాత నష్టపోతామన్న ఫీలింగ్ వారిలో ఉంది. ఈసారి ఓడిపోతే జనసేనకు కాపు సామాజికవర్గం బలం కూడా తగ్గిపోతుందన్న భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది.అందుకే పొత్తు ప్రకటన జాప్యమవుతుందని   చెప్పక తప్పదు.ఒక్కటి  మాత్రం నిజం ఈ దాగుడు మూతలు ఎక్కువ రోజులు సాగవు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి