ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఎర్రకాలర్ ఎగరేసుకు తిరిగాయి. అయితే కమ్యూనిస్టు పార్టీలో చీలికల అనంతరం అవి బలహీనపడుతూ వచ్చాయి. కమ్యూనిస్టులు బలంగా లేరు కాబట్టే కాంగ్రెస్ పాలన పట్ల విసిగెత్తిపోయి ఉన్న తెలుగు ప్రజలు 1983లో కొత్త పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఎన్టీయార్ ను ఆశీర్వదించారు. కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి ఉంటే టిడిపి స్థానంలో కామ్చేడ్లే రాజ్యాధికారం చేజిక్కించుకుని ఉండేవారు. ఇక ఆ తర్వాత కమ్యూనిస్టులు మరింతగా దిగజారుతూ వచ్చారు. ఓట్లు సీట్లు రాబట్టుకోవడమే వారి సిద్దాంతం అయిపోయింది. వాటికోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడమే వారి అజెండా అయిపోయింది. ఓసారి టిడిపితో మరోసారి కాంగ్రెస్ తో మార్చిమార్చి పొత్తులు పెట్టుకుంటూ కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలుగా ఉండిపోయాయి. టిడిపిలో మొదటి సారి వెన్నుపోటు ఘటన జరిగినపుడు నాదెండ్లకు వ్యతిరేకంగా ఎన్టీయార్ కు మద్దతుగా జరిగిన ప్రజా ఉద్యమానికి కామ్చేడ్లు కూడా మద్దతుగా నిలిచారు.
కానీ 1995లో రెండోసారి వెన్నుపోటు ఘటన చోటు చేసుకున్నప్పుడు కమ్యూనిస్టులు చాలా చిత్రంగా తమ సిద్ధాంతాలను నిలువులోతు గోతిలా పాతేసి చంద్రబాబు నాయుడికి జై కొట్టారు. లక్ష్మీ పార్వతిని దుష్టశక్తిగా వర్ణిస్తూ చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తే దానికి వంత పాడి పురుషాహంకారానికి కూడా కామ్రేడ్లు సై అన్నారు. లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు కాబట్టే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి 1984 నుండి 1989 వరకు చంద్రబాబు నాయుడు కూడా రాజ్యాంగేతర శక్తిగానే వ్యవహరించారు. దానిపై కమ్యూనిస్టు పార్టీలు ఏ నాడూ అభ్యంతరాలు చెప్పలేదు. ఆరోపణలు చేయలేదు. మౌనంగా బెల్లంకొట్టిన రాయిలా ఉండిపోయారు. ఓసారి టిడిపితో పొత్తు మరో ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు. ఓ సిద్ధాంతమంటూ లేదా అని నిలదీస్తే టిడిపి గద్దె దించడానికి కాంగ్రెస్ తో జట్టు కట్టామంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను గద్దె దింపడానికే టిడిపితో పొత్తు పెట్టుకున్నామని నమ్మబలుకుతారు. నిజానికి ఈ రెండూ నిజాలు కావు. ఏ పార్టీ గెలుస్తుందో గమనించి దాంతో జట్టుకడితే నాలుగు సీట్లు గెలుచుకుని చట్ట సభలో ఎంట్రీ ఇవ్వచ్చన్న రాజకీయ వ్యూహం తప్ప కమ్యూనిస్టు పార్టీలకు వేరే సిద్ధాంతమే లేదంటున్నారు మేథావులు. ఇలాంటి సీట్ల రాజకీయాలు చేశాయి కాబట్టి అవి పలచన అయిపోయాయి. జనానికి దూరం అయ్యాయి. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్క కామ్రేడ్ కూడా ప్రాతినిథ్యం వహించడం లేదు. దరిదాపుల్లో కమ్యూనిస్టులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితులూ కనిపించడం లేదు. దీనికి కారణం స్వయంకృతాపరాథమే అంటున్నారు వామపక్ష మేథావులు.
కుల మతాలకతీతంగా ఉండాల్సిన కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఓ సామాజిక వర్గం ఆధిపత్యమే చెలామణీలో ఉంది. దానికోసమే వారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి పల్లకి మోయడానికి పోటీలు పడుతూ ఉంటారన్న విమర్శలూ ఉన్నాయి. అయితే కొన్ని ఘటనలు చూసినపుడు అవి నిజమేనేమో అనిపించేలానే ఉంటున్నాయి. ఉదాహరణకు విభజిత ఏపీలో రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. భూములు కేటాయించడంతో పాటు పంపిణీకి రంగం సిద్ధం చేస్తోన్న వేళ రాజధాని ప్రాంతంలో దళితులకు భూములు ఇస్తే డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని టిడిపి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే దళితులు అక్కడ ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వారి ఉద్దేశం అన్నమాట. ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే రాజధానిలో అగ్ర కులాలు ఉండే చోట దళితులు ఉండరాదన్నమాట. ఇంత దుర్మార్గమైన పిటిషన్ దాఖలు కావడం ఈ కారణంతోనే ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే విధించడం జరిగిపోయాయి. ఇంత జరుగుతోంటే కమ్యూనిస్టు పార్టీల నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇదేం పిటిషన్ అని కానీ ఇదెక్కడి అన్యాయమని కానీ ప్రశ్నించలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దళితుల తరపున పోరాటాలూ చేయలేదు. ఈ ఘటనతోనే అసలు ఏపీలో కమ్యూనిస్టులు ఉన్నారా లేరా అన్న అనుమానాలు బలపడ్డాయంటున్నారు రాజకీయ పండితులు.
అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటున్నారు చంద్రబాబు. దానిపైనే లక్షకోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు చంద్రబాబు. ఒకే ప్రాంతంపై అంత పెద్ద మొత్తంలో ఖర్చుచేయలేం అంటోంది వైసీపీ. మూడు ప్రాంతాలకూ అభివృద్ధిని సమానంగా పంచడమే తమ సిద్దాంతమంటోంది. అందుకే మూడు రాజధానులుండాలని నిర్ణయించింది. అయితే కమ్యూనిస్టులు మాత్రం చంద్రబాబు నాయుడికే అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంపై చేయాలనుకున్న విమర్శలను సిపిఐ చేస్తూ ఉంటుంది. అందుకోసం పార్టీ అగ్రేనేతలు నారాయణ రామకృష్ణలు సదా సిద్ధంగా ఉంటున్నారు. టిడిపి హయాంలో దేని గురించీ నోరు మెదపని ఈ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిత్యం యుద్ధం చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా సిపిఐ నారాయణ ఓ ఆరోపణ చేశారు. వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను దారి మళ్లించడానికే జగన్ మోహన్ రెడ్డితో బిజెపి ప్రభుత్వం ఓ అవగాహనకు వచ్చిందన్నది ఆ ఆరోపణ.
కర్నాటక ఎన్నికల్లో బిజెపిని 100 స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై పెట్టారని కూడా నారాయణ అనేశారు. ఈ ఆరోపణలకు ఏదైనా ఆధారం ఉందా సాక్ష్యాలు ఉన్నాయా ఉంటే వాటిని బహిరంగం చేసి విమర్శలు చేయచ్చు కదా లేదా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేయచ్చు కదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏ ఆధారమూ లేకుండానే నారాయణ ఈ ఆరోపణలు చేసి ఉంటే మిగతా రాజకీయ పార్టీలకూ కమ్యూనిస్టులకు తేడా ఏంటని వారు అడుగుతున్నారు.
విషయం ఏంటంటే కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకపోవడంతో అధికారానికి దూరంగా ఉండడంతో వాళ్లకి ఏమీ తోచడం లేదంటున్నారు వైసీపీ నేతలు. వచ్చే 2024 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బోణీ కొట్టే పరిస్థితులు లేవు కాబట్టే రెండు సీట్లు అయినా గెలుచుకోవాలంటే టిడిపితో పొత్తు పెట్టుకుంటే బెటరని నారాయణ అండ్ కో భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే బయట పెట్టుకున్నారు కూడా. వైసీపీని ఓడించాలంటే టిడిపి పెద్దన్న పాత్ర పోషించి మిగతా విపక్షాలను కలుపుకుపోవాలని నారాయణ అన్నారు. అలా తమని కూడా కలుపుకుని ఓ రెండు సీట్లు భిక్షం పడేస్తే చాలునని ఆయన ఉద్దేశం కావచ్చునంటున్నారు వామపక్ష మేథావులు. అర్జంట్ గా వైసీపీని ఎందుకు ఓడించాలి పోనీ వైసీపీని ఓడిస్తే కమ్యూనిస్టుల రాజ్యం వస్తుందా పోనీ జనసేన అధికారంలోకి వస్తుందా రావు కదా అంటే వైసీపీని ఓడించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్నదే నారాయణ పంతంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడి హయాంలో అవినీతి తారాస్థాయికి చేరడం వల్ల ప్రజలను పట్టించుకోకపోవడం వల్లనే కదా 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీని ఓడించింది. మరి ఇపుడా పార్టీని అధికారంలోకి తెచ్చి పెట్టే బాధ్యతను కామ్రేడ్ నారాయణ ఎందుకు భుజాలకెత్తుకుంటోన్నట్లో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇక సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు కూడా డిటో. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను విచారణకు పిలవడాన్ని దృష్టిలో పెట్టుకుని రాఘవులు ఏమన్నారంటే ఏపీలో అవినీతి మీకు కనపడ్డం లేదా అని నిలదీశారు రాఘవులు. ఇదే రాఘవులు 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో అవినీతి గురించి ఏ నాడూ ఆరోపణలు చేయలేదు. అప్పటి ఏపీలో అవినీతిపైనా కేంద్రాన్ని నిలదీయలేదు. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీలో వైసీపీ ఎంపీ తనయుణ్ని కూడా ఈడీ విచారించింది. మరి రాఘవులుకు ఇంకేం కావాలో అర్ధం కావడం లేదంటున్నారు వైసీపీ నేతలు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పావలా పెరిగితే చాలు దేశ వ్యాప్తంగా కామ్రేడ్లు వీధులకెక్కి ఉద్యమాలు ఉధృతం చేసేవారు. ఇపుడు మోడీ తొమ్మిదేళ్ల పాలనలో పదుల రూపాయల్లో పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతోంటో కమ్యూనిస్టులు త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుని మరీ తమాషా చూస్తున్నారు తప్ప ఎలాంటి ఉద్యమాలూ చేయడం లేదు. అంటే నారాయణ భాషలో బిజెపితో కమ్యూనిస్టులు రహస్య అవగాహన కుదుర్చుకున్నారని అనుకోవాలా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు. తమ వాడైతే ఒకలాగ తమ ప్రత్యర్ధి అనుకున్నవాడు అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించడం మిగతా బూర్జువా పార్టీలకు సహజం కావచ్చు. కానీ కమ్యూనిస్టులే అంతకన్నా దుర్మార్గంగా దిగజారిపోతే ఏమనాలి చివరకు ఇలా మిగిలారు అని పెదవి విరవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. ఆఖరికి నారాయణ రాఘవులు కూడా.