దగ్గుబాటు పురంధేశ్వరీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చినా తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలామె. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండింటా రాజకీయ నేపథ్యం ఆమెకు బాగా పనికొచ్చింది. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసినా పరిస్థితులను బట్టి బీజేపీకి మారిన పురంధేశ్వరి ఇప్పుడు పూనరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ చౌరస్తాలో నిల్చున్న చిన్నమ్మ ఎటు వెళ్లాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారా లేక డిసైడైపోయారా అన్న చర్చ ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది.
ఎన్టీఆర్ కూతురిగా ఆయన వాగ్ధాటి పురంధేశ్వరికి వారసత్వంగా సంక్రమించింది. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ఉండటం మంత్రిగా చేయడంతో మెట్టినంట కూడా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. చంద్రబాబు, వెంకటేశ్వరరావు తోడలుళ్లు. తొలుత బాగానే ఉన్నా తర్వాత ఇద్దరికీ పడలేదు. చంద్రబాబును దెబ్బకొట్టేందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్నమ్మను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని చెప్పక తప్పదు. పిలిచిందుకు గౌరవించి ఎంపీ టికెటిచ్చారు. కేంద్రం మంత్రిని కూడా చేశారు. మంత్రిగా ఆమె మంచి పేరే తెచ్చుకున్నారు. మచ్చలేని నాయకురాలని అనిపించుకున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఢిల్లీ పెద్దలు ఆమెను బాగానే గౌరవిస్తారు. ఏపీ నాయకులే ఆమెను పట్టించుకోవడం లేదని ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏపీలో పార్టీ అధికారంలో లేదు. ఇప్పట్లో అధికారానికి వస్తుందన్న నమ్మకం లేదు. అయినా సుదూర తీరంలో ఉన్న అధికారాన్ని అందుకోవాలంటే మాత్రం పురంధేశ్వరి లాంటి నాయకులను ప్రోత్సహించాలి. అలాంటిది రాష్ట్ర నాయకత్వం గ్రుపులు కట్టి కొందరిని పక్కన పెట్టే ప్రయతంలో ఉంది. పురంధేశ్వరిపై కూడా అదే కుట్ర జరుగుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కలిసి నడుపుతున్న మంత్రాంగంలో భాగంగా పురంధేశ్వరిని కూడా పక్కకు తోయాలన్న ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జీవీఎల్ పేరు చెబితేనే మండిపోతున్న చిన్నమ్మ ఇప్పుడు ఆయనకు గట్టి కౌంటరిచ్చారు. తాజాగా వంగవీటి రంగాకు ఒక జిల్లా పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అన్నీ వాళ్లిద్దరి పేర్లేనా అని ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లను విమర్శించే విధంగా డైలాగులు వదిలారు. దానితో దుగ్గుబాటి పురంధేశ్వరికి చిర్రెత్తుకొట్టింది. గట్టిగానే కౌంటరిచ్చారు. ఆ ఇద్దరు కాదు ఆ మహానుభావులు అని ఆమె ట్వీట్ చేశారు. అలాగని ఆ ఒక్క చిన్న మాటతో ఆగలేదు. మరో ట్వీట్ ను కూడా జతచేశారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని ప్రస్తావించారు. దానితో ఇప్పడు గట్టిగా బుద్ధి చెప్పారంటూ బీజేపీలోనూ బయట జీవీఎల్ వ్యతిరేకులు సంతోష పడుతున్నారు.
పార్టీలో కొందరు తీరుపై పురంధేశ్వరి చాలా రోజులుగా అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఆమె అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఆ దిశగానే జీవీఎల్ కు గట్టి కౌంటరిచ్చారు. పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పటికే రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఆమె తనయుడు హితేష్ కూడా రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పేశారు. ఇప్పుడు పురంధేశ్వరి ఆలోచనలో పడ్డారు. తాను కూడా రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అన్న డౌట్ కొనసాగుతుండగా కుటుంబంలో ఒకరైనా పాలిటిక్స్ లో ఉండాలని వెంకటేశ్వరరావు సూచించారట. దానితో ఇప్పుడు బీజేపీని వదిలి వేరే పార్టీ వైపు వెళ్లాలని పురంధేశ్వరి భావిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లడం ఆమెకు అసలు ఇష్టం లేదు. మరి ఏ పార్టీ వైపు చూస్తారో ఇప్పుడే చెప్పలేమని రెండు మూడు నెలల్లో క్లారిటీ వస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి.