ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అన్నాడు ఓ సినీకవి. ఆడువారే కాదు రాజకీయాలు ఆడువారి మాటలకు అర్ధాలు వేరే అంటున్నారు రాజకీయ కవులు. దివంగత ఎన్టీఆర్ రెండో అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తోడల్లుడు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని కట్టుకున్న భర్త ఒకప్పుడు మాజీ మంత్రి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయాలంటే మాసెడ్డ సికాకొచ్చేసింది. ఛస్ ఇక ఈ రాజకీయాల్లో నేను కానీ మా అబ్బాయి హితైషి కానీ కొనసాగితే రాజకీయాలపై ఒట్టు అని బల్లగుద్దేశారు దగ్గుబాటి. ఆయనకు నిజంగానే రాజకీయ వైరాగ్యం వచ్చిందా. రాజకీయాలంటే అసహ్యం వేసిందా.. లేక ఇంకేమన్నా కారణాలతోనే రాజకీయాలకు ఓ దండం పెట్టారా అని రాజకీయ పండితులు తెగ ఆలోచిస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొత్తలో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ కు చంద్రబాబు కన్నా ముందుగానే అల్లుడి పోస్టులోకి వచ్చిన వారు కూడా. అయితే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కాబట్టి చంద్రబాబు నాయుడు పదునైన కొమ్ములతో ఎన్టీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను అదే ఊపులో తన తోడల్లుడు దగ్గుబాటినీ కుమ్మేశారు కానీ లేదంటే దగ్గుబాటి ఎక్కడో ఉండాల్సిన వారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు దగ్గుబాటి మామగారి పార్టీలో చేరిపోయారు. 1983. 1985, 1989, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991లో లోక్ సభకు ఎన్నికైనా దగ్గుబాటి 1996లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పర్చూరు నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన దగ్గుబాటి ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పర్చూరు నుంచే పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేనని కక్షసాధింపు రాజకీయాలు చేసే ఓపిక లేదని ధన రాజకీయాలూ కష్టమని చెప్పిన దగ్గుబాటి ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించారు.
తనతో పాటు తన కుమారుడు హితైషి కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సెలవిచ్చారు. చిత్రం ఏంటంటే ఇంత విలువలు లేని రాజకీయాల్లో తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగరని మాత్రం వెంకటేశ్వరరావు చెప్పలేదు. అంటే తండ్రీ కొడుకులు మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉండి పురంధేశ్వరి రాజకీయాల్లోనే కొనసాగుతారని అనుకోవాలా.
మరి ఆమె కొనసాగే రాజకీయాలు కలుషితం కాకుండా బానే ఉన్నట్లా అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.
పురంధేశ్వరి ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి 2024 ఎన్నికల్లోనూ గెలిస్తే పురంధేశ్వరికి ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న లెక్కలతోనే రాజకీయాలకు దూరంగా ఉండే జాబితాలో పురంధేశ్వరి పేరు చేర్చలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్గుబాటికి నిజంగానే రాజకీయాలంటే విరక్తి పుట్టిందా లేక వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలోనూ తనకు స్పేస్ లేదని గమనించి ఆయనే ఆస్త్ర సన్యాసం చేస్తున్నారా. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం వీచినపుడే గెలవలేకపోయారు. 2024 ఎన్నికల్లో ఆయనకు మరోసారి పాలక పక్షం టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువే. పోనీ తన పూర్వాశ్రమం అయిన టిడిపిలో చేరదామా అంటే అది ఇప్పటికీ బలహీన పడిపోయి ఉంది. రేపటి ఎన్నికల్లో టిడిపికి మరోసారి ఘోర పరాజయం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టిడిపిలో చేరడం వల్ల లాభం ఉండదు. ఇక మిగిలింది బిజెపి. బిజెపికి ఏపీలో ఎలాంటి ప్రాభవం లేదన్నది కఠోర సత్యం. అంచేత బిజెపిలో చేరినా ఎన్నికల్లో గెలిచే అవకాశాలుండవు. ఏ పార్టీలోనూ అవకాశం లేదు కాబట్టే దగ్గుబాటి తన వయసును కూడా దృష్టిలో పెట్టుకునే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే తప్ప విలువగల రాజకీయాలు కోసం అయితే కాదని వారంటున్నారు. ఎందుకంటే 1983లో ఎన్టీఆర్ దగ్గుబాటిని పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అటువంటి ఎన్టీఆర్ కు చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెడీ అయితే ఆ కుట్రలో దగ్గుబాటి దంపతులు కూడా వాటాదార్లే. అందరూ కలిసే పాపం పెద్దాయన్ను పదవి నుంచి తప్పించి ఒక విధంగా ఆయన మరణానికి కారకులయ్యారు. అలా వెన్నుపోటుకు సహకరించినందుకు గానూ దగ్గుబాటికి డిప్యూటీ సిఎం పదవిని ఇస్తామని చంద్రబాబు డీల్ కుదుర్చుకున్నారు.
కాకపోతే ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండడం తన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని గ్రహించిన చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే దగ్గుబాటికి ఓ మంత్రి పదవిని మాత్రమే ఇచ్చి డిప్యూటీ సిఎం పదవిని ఇవ్వలేదు. చంద్రబాబు మాంచి కుచ్చుటోపీ పెట్టేశారని ఆలస్యంగా తెలుసుకున్న దగ్గుబాటి అక్కడ్నుంచీ మళ్లీ ఎన్టీఆర్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బిజెపి కాంగ్రెస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు మారుతు రాజకీయ కోతి కొమ్మచ్చి ఆట ఆడేశారు.
ఇవన్నీ కూడా వెన్నుపోటు రాజకీయాలే. నమ్మిన పెద్ద మనిషిని నట్టేట ముంచిన ద్రోహాలే. ఇటువంటి రాజకీయాల్లో హ్యాపీగా కొనసాగిన దగ్గుబాటికి ఇపుడు హఠాత్తుగా రాజకీయాలంటే అంత అసహ్యం వేయడానికి కారణం తనకు అందులో చోటు లేకపోవడం వల్లనే కావచ్చునంటున్నారు రాజకీయ పండితులు. నిజంగానే ఇప్పటి రాజకీయాలు మరీ అంత ఛండాలంగా ఉంటే తన భార్యను కూడా ఆ రాజకీయాల నుండి దూరంగా తీసుకుపోవాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
దీనికి డాక్టర్ గారు ఏమంటారో మరి.