జనంలోకి మళ్లీ చిన్నబాబు

By KTV Telugu On 21 November, 2023
image

KTV TELUGU :-

ప్రత్యర్థుల నోళ్లు మూయించే సమయం వచ్చేసింది. లోకేష్ ఎక్కడ అంటూ ఎగతాళి పంచాంగాన్ని అందుకున్న వారికి సమాధానం రాబోతోంది. తానెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తానంటూ చెప్పుకునేందుకు ఆయన వస్తున్నారు. నారా వారబ్బాయి యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. వైసీపీ బ్యాచ్ కు ఆయన ద్వారానే గట్టి సమాధానం రాబోతోంది…..

చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబరు 9 రాజోలు నియోజకవర్గంలో లోకేష్ యువగళం ఆగింది. అంతవరకు విశేష ప్రజాదరణ పొందుతూ, అన్ని చోట్ల నీరాజనం అందుకున్న  యువగళాన్ని లోకేష్ అనివార్యంగా ఆపాల్సి వచ్చింది. ఢిల్లీ, రాజమండ్రి, హైదరాబాద్ తిరుగుతున్న కారణంగా లోకేష్ ఈ యాత్రపై  దృష్టి పెట్టలేకపోయారు. తండ్రి బెయిల్ వ్యవహారం, న్యాయవాదులతో చర్చల కారణంగా లోకేష్ బిజీ అయిపోయారు.మధ్యలో కొవ్వొత్తుల ఉద్యమాలు, గంట కొట్టే పనులతో టీడీపీ కార్యకర్తల్లో  మనోధైర్యాన్ని పంచారు. ఈ లోపే   లోకేష్ కు కూడా నోటీసులిచ్చిన సీఐడీ ఆయన్ను ప్రశ్నించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఐనా  అలాంటి  ఉడుత ఊపులకు భయపడేది లేదని లోకేష్ ప్రకటించారు. తన పని తాను చేసుకుపోతున్నారు…

టీడీపీ  వ్యతిరేక మీడియా లోకేష్ ను టార్గెట్ చేసింది. లోకేష్ ఎక్కడ అంటూ కథనాలు వండి వార్చింది. జ‌న‌సేన‌-టీడీపీల పొత్తు ప్ర‌క‌ట‌న‌, త‌ర్వాత‌.. సంయుక్త అజెండా రూప‌కల్పన‌, ఉమ్మ‌డి మేనిఫెస్టోపై చ‌ర్చ‌ల వంటి ముఖ్య కార్య‌క్ర‌మాల్లోనే నారా లోకేష్ పాల్గొన్న సంగతి మరిచిపోయి మరీ వాళ్లు ఇష్టానుసారం రాసేస్తున్నారు. ఎక్కడో దాక్కొని ట్విట్టర్ పోస్టులు మాత్రం పెడుతున్నారంటూ ఎగతాళి చేసేందుకు కూడా కొన్ని  మీడియాలు ప్రయత్నించాయి. అరెస్టు నుంచి  తప్పించుకునేందుకు జనంలో తిరగడం లేదని  ఆరోపీంచిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పేందుకే లోకేష్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

లోకేష్ రాజోల్ లో పాదయాత్ర ఆపారు. ఈ నెల 24న అక్కడే మళ్లీ ప్రారంభించబోతున్నారు.  ఆయన ఎక్కడిదాకా నడుస్తారనేదే ఇప్పుడు టీడీపీ కేడర్ లో ఉన్న ఆలోచన. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  విశాఖతో యాత్ర ఆపేస్తారా.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చివరకు వరకు వెళతారా అన్నది చూడాలి. ఒక వేళ విశాఖతో ఆపేస్తే పది పన్నెండు రోజులు మాత్రమే యువగళం సాగే అవకాశం ఉంది. తర్వాత  టీడీపీ – జనసేన సమన్వయానికి సంబంధించిన పనుల్లో లోకేష్ బిజీ అయిపోతారు. అంతవరకు బాగానే ఉంది.మరో పక్క చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఈ నెల 28తో ముగుస్తుంది. ఈ లోపు రెగ్యులర్ బెయిల్ రావడమో, లేక మధ్యంతర  బెయిల్ ను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం రావడమో జరగొచ్చు. అలా జరిగితే తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు లోకేష్ కు కొంత వెసులుబాటు కలుగుతుంది. లేనిపక్షంలో పార్టీలో అన్ని తానై నిర్వహించాల్సిన అనివార్యత  ఏర్పడుతుంది. అన్నింటినీ ఆలోచించుకుని లోకేష్  ఈ నాలుగైదు నెలల కాలంలో తన షెడ్యూల్ ను  రూపొందించుకోవాల్సి ఉంటుంది.

లోకేష్ ను చక్రబంధంలో పెట్టి ఇబ్బందులు సృష్టించేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఐనా కేడర్ బలమున్న పార్టీగా టీడీపీ అలాంటి వాటిని  పట్టించుకోవడం మానేసింది. అడ్డుకుంటే దండయాత్రేనని లోకేష్ ప్రకటించి చాలా రోజులైంది. అధికార పార్టీ చర్యలకు భయపడకుండా, ప్రతీ కార్యక్రమంలోనూ దూకుడు పెంచుతూ లోకేష్ ముందుకు సాగుతున్న సందర్భంగా డిసెంబర్ నేల టీడీపీకి కీలకం కాబోతోంది . అప్పుడు పార్టీ కార్యక్రమాలు వేగం పెరుగుతాయి. చంద్రబాబుపై ఉన్న కేసులూ ఒక కొలిక్కి వస్తాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి