ఉత్తరాంధ్ర వైసీపీ నేత మంత్రి ధర్మాన ప్రసాదరావు మానసిక స్థితి బాగానే ఉందా. అర్జెంట్‌గా ఓసారి మైండ్ చెక్ చేయించుకుంటే మంచిదా? ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలట. ఏమన్నా తెలివున్న మాటలేనా? రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. రెండురాష్ట్రాలు కలిస్తే తప్పేంటన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జలలాంటివాళ్లు సంకేతాలిస్తున్నారు. ఇలాంటి టైంలో ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అన్నమాట ఎందుకొచ్చినట్లు? ఆవేశంతో అన్నారా. అమరావతికి వ్యతిరేక వాదనను మరింత పెంచేందుకు అధినాయకత్వం సంకేతాలతోనే ఇలా మాట్లాడారా?
విశాఖను పాలనా రాజధాని చేయాలనేది ధర్మాన ప్రసాదరావు డిమాండ్. ఆయన డిమాండ్ చేయాల్సిన పన్లేదు. ప్రభుత్వం అదే పనిలో ఉంది. ఆయన మంత్రివర్గ సహచరుడు గుడివాడ అమర్నాథే వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పాలన మొదలవుతుందని చెబుతున్నారు. మరిప్పుడు ధర్మాన అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పాలనా రాజధానిగా విశాఖ సాధ్యంకాకపోతే ప్రత్యేక రాష్ట్రం చేయాలట. తామే పాలించుకుంటామంటున్నారు ధర్మాన ప్రసాదరావు. ఓ చిన్న ముక్కయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని పగటిపూట కలేమన్నా వచ్చిందేమో!
అమరావతి రాజధాని నినాదాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. పాలనా వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టంచేసింది. మూడు రాజధానుల వాదనకే కట్టుబడి ఆ దిశగా అడుగులేస్తోంది. ఈమధ్య సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ చర్యలను సమర్థించటంతో విశాఖ కేంద్రంగా త్వరలో పాలనకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకరాష్ట్రం అన్నమాట ధర్మాన ప్రసాదరావు లాంటి తలపండిన నాయకుడి నోట రావడం ఆశ్చర్యపరుస్తోంది. మూడు జిల్లాలున్న ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయడం సాధ్యమా? అంత అనాలోచితంగా ధర్మాన ఎలా మాట్లాడినట్లు?
ఉత్తరాంధ్రవాసుల్లో సెంటిమెంట్ రేపటమే ధర్మాన వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా పాలనవిషయంలో భావోద్వేగాలు పెద్దగా లేకపోవటంతో ఎన్నికలముందు రగిలించాలన్నదే సీనియర్ లీడర్ ఉద్దేశమై ఉండాలి.
ప్రత్యేకరాష్ట్రం వాదన తేలిపోతుందని తెలుసు. అదే సమయంలో విశాఖ రాజధానికి మరింత మద్దతు కూడగట్టడమే వైసీపీ నేత ఆలోచనై ఉండాలి. కానీ ఆయన లక్ష్యమేదయినా తేనెతుట్టెని కదిపారు. ప్రత్యేక రాయలసీమలాంటి నినాదాలు తెరపైకొస్తే అది ప్రభుత్వానికి ఇబ్బంది కాదా? ప్రతిపక్షాలను సంకటంలో పడేయడానికి ఈ ఎత్తుగడ సరైనదేనా? ధర్మానకు అప్పుడే స్ట్రాంగ్ కౌంటర్లు మొదలయ్యాయి. ధర్మాన మంత్రి పదవికి అనర్హుడన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి డిమాండ్ చేశారు. ధర్మాన వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా? తప్పుపడుతుందా? ఏదోలా ఉత్తరాంధ్ర చర్చల్లో ఉంటేనే మంచిదనుకుంటుందా?