జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మొదట్నుంచీ విషం చిమ్ముతూ వస్తున్నారు. తాజాగా ఓ పత్రికలో పవన్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా దుర్మార్గమైన రాతలు రాశారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ లోని బి.ఆర్.ఎస్.అధినేత వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారన్నది ఆ విష ప్రచారం. దీనిపై జనసైనికులు నిప్పులు చెరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త రకం రాజకీయాలు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయడానికే జనసేన పార్టీ పెట్టారు. దాన్ని నడిపించడానికి తన కష్టార్జితంపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఓ చేత్తో సినిమాలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని జనసేన నిర్వహణకు ఖర్చు చేస్తూ ప్రజల్లో ఆశలు కల్పిస్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే రాజకీయాలు పూర్తిగా మారాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన.
అయితే ఆయన ఎంట్రీతో కంగారు పడే కొన్ని శక్తులూ మొదట్నుంచీ పవన్ పై విష ప్రచారం చేస్తూ వస్తున్నాయి. లేదా ఆయన వ్యక్తిగత విషయాలను ఫోకస్ చేస్తున్నాయి. ఆయన పెళ్లిళ్ల గురించీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని అన్యాయంగా అవమానకరంగా అభివర్ణిస్తున్నారు. ఏపీలో పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు తరచుగా పవన్ పై ఇదే ఆరోపణ చేస్తున్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ టిడిపిని చంద్రబాబునీ ఎందుకు ప్రశ్నించరని వారు నిలదీస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడి నుండి ప్యాకేజీ వస్తోంది కాబట్టే పవన్ టిడిపిని నిలదీయడం లేదన్నది ఏపీ మంత్రుల ఆరోపణ. అయితే అందులో వాస్తవం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు చాలా ముందుగానే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై బహిరంగ సభలోనేనిప్పులు చెరిగారు. సాక్ష్యాత్తూ చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.
టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుక మాఫియాగా మారి భూమిని భోంచేస్తోంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని మండి పడ్డారు కూడా పవన్.
2019 ఎన్నికల్లో చంద్రబాబును దూరం పెట్టి కమ్యూనిస్టులు బి.ఎస్పీలతో కలిసి కూటమి కట్టారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల బాటలో ఆర్ధిక వనరులు లేకపోవడం పార్టీకి నిర్మాణం లేకపోవడం ఎన్నికల రాజకీయాల్లో అనుభవం లేకపోవడం మాయోపాయాలు తెలీకపోవడంతో జనసేన భారీగా ఓట్లు సంపాదించినప్పటికీ ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. కాకపోతే జనసేన బరిలో ఉండడం వల్లనే టిడిపి మెజారిటీ నియోజకవర్గాల్లో ఓటమి చెందింది. అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఆ అనుభవం నేర్పిన పాఠంతోనే ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు చీలడానికి వీల్లేదని పవన్ అంటున్నారు అందుకే గత ఎన్నికల్లో తాను దూరం పెట్టిన టిడిపితో పొత్తుకు ఇపుడు సిద్ధం అవుతున్నారు. దీన్ని కూడా హ్రస్వదృష్టితో చూస్తున్నారు కొందరు నేతలు. తాజాగా టిడిపికి అనుకూలంగా ఉండే ఓ దిన పత్రికలో బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ పవన్ కళ్యాణ్ కు ఓ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారని కథనం ప్రచురించారు.
వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని ఏపీలో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కు ఆఫర్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో ఏపీలో బి.ఆర్.ఎస్. తో పొత్తు కు సై అంటే ఎన్నికల ఖర్చు అంతా తామే భరిస్తామని కేసీయార్ తన దూతల ద్వారా పవన్ కు ఆఫర్ తెలియ జేసారని ఆ కథనంలో వండి వార్చారు. ఈ కథనం చదివిన వారికి ఎవరికైనా సరే ఇదో ఫేక్ వంటకం అని తెలిసిపోతుంది. ఇటువంటి కథనాన్ని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆ పత్రిక ప్రచురించగలదా అని రాజకీయ పండితులు సైతం నిలదీస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో టిడిపితో పొత్తుకు పవన్ సిద్ధమైన వేళ పవన్ ప్రతిష్ఠను మంటగలిపేలా ప్యాకేజీ కథనం రాయడం వెనుక పెద్ద కుట్రే ఉందని జనసైనికులు మండిపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని అవమాన పరిచేలా డిబేట్లు నడిపిన చరిత్ర కూడా ఇదే మీడియాకు ఉందని వారు గుర్తు చేస్తున్నారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పవన్ అండ లేనిదే టిడిపి ఎన్నికల్లో సత్తా చాటే పరిస్థితులు కూడా లేవు ప్రత్యేకించి 2019 తర్వాత టిడిపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇటువంటి తరుణంలో టిడిపికి పెద్ద దిక్కుగా పవనే కనిపించారు. దానికి ఆయన వెంటనే స్పందించారు. ఈ క్రమంలో తనకు పదవులు కావాలని కూడా పవన్ పట్టుబట్టలేదు. ముందుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆయన అనుకున్నారు. జనసైనికులు పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా ఆకాంక్షిస్తున్నాకూడా తనకు సిఎం పదవి ఇచ్చి తీరాలని పవన్ ఇంత వరకు పట్టుబట్టలేదు. అసలు ఏ పదవి ఇస్తారని కూడా అడగలేదు. తనకు పదవులు ముఖ్యం కాదని చాలా సందర్బాల్లో స్పష్టం చేసిన పవన్ దానికి కట్టుబడే విలువైన రాజకీయాలు చేస్తూ వచ్చారు. అయినా కూడా టిడిపి అనుకూల పత్రికలో ఈ విష కథనం రావడం వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా అని కాపు మేథావులు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండతోనే వచ్చే ఎన్నికల్లో టిడిపి మనుగడ సాగించాలి. ఈ నేపథ్యంలో పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జనసేన నేతలు పట్టుబట్టకుండా ఉండేందుకు పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడే ఈ వ్యూహాన్ని రచించి తన పత్రిక ద్వారా అమలు చేయిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి విద్యల్లో చంద్రబాబు ఛాంపియన్. ఎన్టీయార్ కు వ్యతిరేకంగానే ఈనాడు వంటి పత్రికలో కార్టూన్లు కథనాలు వేయించిన మాస్టర్ మైండ్ చంద్రబాబు. ఇపుడు పవన్ విషయంలోనూ దాన్నే అప్లై చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు జనసేన అభిమానులు. ఈ పత్రిక కథనం విషయంలో పవన్ కళ్యాణ్ మెతక్కా ఉండకూడదని వారు అంటున్నారు. దీని వెనక ఎవరున్నారో తేల్చుకోవలసిందేనని వారు అంటున్నారు. అవసరమైతే పత్రికపై పరువు నష్టం దావా వేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఇటువంటి కథనాలను మరిన్ని ప్రచురించే ప్రమాదం కూడా ఉందంటున్నారు వారు.