అప్పుడే పవన్‌పై టీడీపీ గేమ్ మొదలెట్టేసిందా?

By KTV Telugu On 1 August, 2024
image

KTV TELUGU :-

అసలు విషయంలోకి వెళ్ళేముందు.. పార్లమెంట్‌లో జరిగిన తాజా పరిణామం గురించి చెప్పుకుందాం. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయ్. తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలని ఓ ఎంపీ ఉన్నారు. ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌పై కేంద్రాన్ని ఓ ప్రశ్న అడిగారు. దానికి.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. 2019 నుంచి 2023 మధ్య 44 వేల 685 మంది మహిళలు మిస్ అయ్యారు. వీరిలో.. 44 వేల 22 మంది మహిళలు, బాలికల ఆచూకీ దొరికిందని.. కేంద్రం సమాధానం చెప్పింది. అంటే.. ఆచూకీ దొరకాల్సిన మహిళల సంఖ్య.. మరో 663 మాత్రమే!

ఈ లెక్కలన్నీ ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆంధ్రాలో 30 వేల మందికి పైగా మహిళలు మిస్ అయ్యారని.. మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆయన ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా.. ఇదే మాట వినిపించారు. చాలా మంది ఏపీ జనం కూడా దీనిని నమ్మారు. అయితే.. ఎన్నికలైపోయాయ్. కూటమి సర్కార్ ఏర్పడింది. ఈ మిస్సింగ్ ఇష్యూ.. ఇక్కడితో అయిపోయిందనుకుంటే.. ఇదే అంశాన్ని ప్రశ్న రూపంలో పార్లమెంటు దాకా తెచ్చింది టీడీపీ. లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుతో అడిగించింది. ఈ ప్రశ్నపై తలెత్తుతున్న అసలు ప్రశ్నేమిటంటే.. టీడీపీ ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తెరమీదికి తెచ్చిందని? అంత అవసరం ఏమొచ్చింది?

వైసీపీని మరింత బ్యాడ్ చేయాలనే ఆలోచనతోనే ఇలా చేసిందా? లేక.. పార్లమెంట్ సాక్షిగా పవన్ చెప్పింది అబద్ధమని నిరూపించాలనుకుందా? పార్లమెంటులో ఈ ప్రశ్న అడగడం వల్ల.. తెలుగుదేశం పార్టీకి ఒరిగే మేలు ఏమిటి? లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. నిజానికి.. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి విజయంపై అనేక రకాల అభిప్రాయాలు వినిపించాయ్. అందులో ప్రధానమైనది.. జనసేన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది.. లేకపోతే బాబు పనైపోయేది అనే విశ్లేషణలు వచ్చాయ్. పవన్ వల్లే.. తెలుగుదేశం బతికి బట్ట కట్టిందని.. అతని జత లేకపోతే.. మళ్లీ వైసీపీయే అధికారం దక్కించుకునేదన్న చర్చ జరిగింది. అందువల్ల.. బాబు ముందే అలర్ట్ అయి.. ఎప్పటికైనా ఏపీ రాజకీయాల్లో టీడీపీకి.. జనసేన నుంచే ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాకు వచ్చారా? ఇప్పటి నుంచే ఆ పార్టీకి, దాని అధినేత పవన్ కల్యాణ్‌కు.. పెద్దగా స్కోప్ దక్కకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే.. పార్లమెంటులో మహిళల అదృశ్యం అంశాన్ని ప్రస్తావనకు తెప్పించారా? అనే.. రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి