ఆయన అలా..ఈయన ఇలా.

By KTV Telugu On 13 September, 2023
image

KTV TELUGU :-

భోళా శంకరుడు ఏం చేయబోతున్నారు. యంగ్ టైగర్ రూటు ఎటు.. చంద్రబాబు అరెస్టుపై వారి స్పందన ఏమిటి. తెలుగుదేశం కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారు. బాలయ్య రాజకీయం పండిస్తారా. ప్రస్తుత సీన్లోకి జూయిన్ ఎంటర్ అవుతారా… ఇవీ సగటు తెలుగుదేశం అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు…

అవసరం వచ్చినప్పుడు స్పందించిన వాడే నిజమైన మిత్రుడు, బంధువు అంటారు. కష్టకాలంలో వెంట నడిచిన వాళ్లే సరైన కేడర్ అంటారు. ఇప్పుడు వాళ్లిద్దరు కేడరే కాదు., బంధువులు.. అన్నీను. పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా, తెలుగువారందరిలోనూ వారికి ఒక ఇమేజ్ ఉంది. అందుకే ఇప్పుడు బాలయ్య, జూనియర్ అయ్యా ఏమి చెబుతారోనని జనం ఎదురు చూస్తున్నారు…

చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసిన వెంటనే బావమరిది నందమూరి బాలకృష్ణ… స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ విజయవాడ వెళ్లారు. జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఏ అంశానికైనా స్పాంటేనియస్ గా స్పందించడం బాలయ్యకు అలవాటే. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పుడు అన్నీ తానై వైద్య సేవలకు ఏర్పాటు చేసినది కూడా నందమూరి బాలకృష్ణే. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు అరెస్టును ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నారు. బిజీ షెడ్యుల్ ఉన్నప్పటికీ బాలయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ నేతలను పిలిపించుకుని భవిష్యత్తు కార్యాచరణను చర్చించారు. చంద్రబాబు కుటుంబానికి ప్రతీ ఒక్కరు అండగా నిలబడేలా…చంద్రబాబు సేవా కార్యక్రమాలను, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను జనంలోకి తీసుకెళ్లేలా అందరూ పనిచేయాలని బాలయ్య సూచించారు. చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా.. ఇప్పుడు బాలయ్య జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు. బాదుడే బాదుడు లాంటి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి చంద్రబాబు తరహాలో ఊరూరా తిరగాలనుకుంటున్నారు. ఇందుకోసం బ్లూ ప్రింట్ సిద్దం చేయాలని, షెడ్యూల్ రెడీ అయితే తాను వస్తానని పార్టీ నేతల వద్ద ఆయన ప్రస్తావించారు.అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లో ఉండటమే ఉత్తమమైన మార్గమని బాలయ్య డిసైడయ్యారు. మరో పక్క చంద్రబాబు అరెస్టుతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలను పరామర్శిస్తానని బాలయ్య ప్రకటించారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సైనికుల్లా ప్రతీ ఒక్కరూ తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు.

కట్ చేసి చూస్తే జూనియర్ ఎన్టీయార్ పరిస్తితి వేరుగా ఉంది. చంద్రబాబు పట్ల, ఆయన కుటుంబం పట్ల జూనియర్ కు సానుభూతి ఉన్నప్పటికీ ఇప్పటికప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించి జనంలోకి రాలేని స్థితి ఉంది. సినిమాల్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సక్సెస్ ఫుల్ యంగా యాక్టర్ కూడా అని చెప్పక తప్పదు. ఆయన అభిమానులు వైసీపీలో కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయారు. తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్లు.. వెంటనే జూనియర్ స్పందించాలని కోరుకుంటున్నారు.ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. వేరే గ్రూపులు మాత్రం మనకెందుకులే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీ కేడర్ ఇప్పుడు జూనియర్ పట్ల కోపంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం లేస్తే సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి కష్టమొస్తే స్పందించరా అని వాళ్లు స్పందిస్తున్నారు. జూనియర్ మదిలో ఏముందో కానీ ఇంకా గట్టి స్టెప్ మాత్రం తీసుకోలేదు. అది నిజం.

బాలయ్య వేరు, జూనియర్ వేరు. బాలయ్యకు ఇప్పుడు సినిమా కంటే రాజకీయం ముఖ్యం. తన బావను త్వరగా బయటకు తీసుకురావడం ఆయనకు అత్యంత అవశ్యకం. పైగా బాలయ్య దూకుడు ఎక్కువగా ఉన్న నటుడు, నాయకుడు. జూనియర్ అలా కాదు. ఆయనకు సినిమా కెరీర్ చాలానే ఉంది. ఎవరితోనూ పగను పెంచుకోలేని సినీ నాయకుడు ఆయన. పైగా టీడీపీలోనూ జూనియర్ కు సముచిత స్థానం కల్పించలేదు. అందుకు కారణాలు వేరుగా ఉన్నాయనుకోండి. ఏదేమైనా రెండు భిన్న ధృవాలనే చెప్పాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి