శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందంటారు చూశారూ కడప జిల్లాలో ఆ పెద్దాయనది కూడా అదే వరస. అప్పుడెప్పుడో రాజకీయంగా ఓ ఊపు ఊపేశానంటారు. కానీ ఇప్పుడు ఓపికలేక గడపదాటటంలేదు. అసలాయన రాజకీయాల్లో ఉన్నారో లేదో కూడా ఎవరికీ పట్టటం లేదు. అందుకే నేనొకడిని ఉన్నానని పదిమందికీ తెలియడానికే ఏదో ఒక సంచలనానికి ప్రయత్నిస్తుంటారు. ఆయనే డీఎల్ రవీంద్రారెడ్డి. మైదుకూరునుంచి రాజకీయం నడిపిన సీనియర్ మోస్ట్ లీడర్. చాన్నాళ్లుగా కడుపుబ్బరం ఉందేమో వైసీపీపై, సీఎం జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎల్ రవీంద్రారెడ్డి సాంకేతికంగా వైసీపీలోనే ఉన్నారు. కానీ ఆయన కాడినెప్పుడో పక్కనపడేశారు. పార్టీ నాయకుడిగా ఆయన ఎప్పుడూ ఎవరికీ కనిపించిందే లేదు. మళ్లీ ఏడాదిలో ఎన్నికలు. అందుకే డీఎల్ పడక్కుర్చీలోంచి లేచినట్లున్నారు. వైసీపీలో ఉన్నందుకు తనమీద తనకే అసహ్యంగా ఉందంటూ విచిత్రమైన వ్యాఖ్యలుచేశారు. నచ్చకపోతే చిరుద్యోగి కూడా ఆ ఉద్యోగంలో ఉండడు. అలాంటిది అంత అసహ్యంగా ఉన్న చోట డీఎల్ రవీంద్రారెడ్డి ఎందుకు ఉంటున్నారన్నదే ప్రశ్న. ఆయన లేకపోతే నష్టమని పార్టీ ఎప్పుడూ అనుకోలేదు. ఉండాలని బుజ్జగించలేదు. వేరే ఎక్కడా చోటులేక డీఎల్ ఫ్యాన్ పార్టీకింద సేదదీరుతున్నారు. ఇప్పుడేమో అచ్చం రఘురామకృష్ణంరాజులా ప్లేట్ ఫిరాయించేస్తున్నారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి డీఎల్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 2009లో చివరిసారిగా ఆయన అక్కడినుంచి గెలిచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కినా నోటిదురుసుతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఇప్పుడేమో రాజకీయం మారిపోయింది. డీఎల్‌ని ఎవరూ దేకటం లేదు. ఆయనకేమో ఇంకో టర్మ్ పరిగెత్తే ఓపికుందని ఆరాటం. కానీ టికెట్ మీద ఎలాంటి భరోసా లేదు. అందుకే ఆ బెంగతో ఏదేదో మాట్లాడేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన మెడలో పచ్చకండువా ఉంది. 2019లో వైసీపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడాయన ఏ పార్టీలో ఉన్నారో కడప జనానికే తెలీదు. కాకపోతే టీడీపీ వాయిస్‌ని తన గొంతుతో వినిపిస్తూ వార్తాల్లో ఉండాలని తాపత్రయపడుతుంటారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్పంటూ చిలకజోస్యం చెబుతున్నారు డీఎల్ రవీంద్రారెడ్డి. ఏపీని చంద్రబాబునాయుడు తప్ప ఇంకెవరూ కాపాడలేరంటూ తన ఎజెండా ఏమిటో చెప్పకనే చెప్పారు. పవన్‌కల్యాణ్ నిజాయితీపరుడంటూ జనసేనానికి డబ్బా కొట్టేశారు. ఎవరో ఒకరు ఓ టికెట్ పడేయకపోతారా అన్న ఆశ. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేశారు. మంచిపాలన అందిస్తారనే నమ్మకంతోనే తాను వైసీపీలోకి వచ్చానంటున్నారు. వైసీపీలోనే ఉన్నానంటూ వచ్చే ఎన్నికల్లో గుర్తింపు ఉన్న పార్టీనుంచే పోటీచేస్తానంటున్నారు. ఆయనెప్పుడూ ఓ కార్యక్రమానికి వచ్చింది లేదు. కండువాతో కనిపించింది లేదు. ఆయన నాలుగురాళ్లేస్తే ఎవరూ పట్టించుకోరంటున్నారు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్.