చంద్రబాబు నాయుడి అరెస్ట్ వెనుక కుట్ర ఎవరిది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత వై. ఎస్.జగనే రాజకీయ కక్ష సాధింపుకోసం చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారని టిడిపి ఆరోపిస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అయితే చంద్రబాబు నాయుడి అరెస్ట్ మోదీ -అమిత్ షాల పనే అని ఆరోపిస్తున్నాయి. తాజాగా తెలంగాణా కాంగ్రెస్ నేత ఒకరు చంద్రబాబు నాయుడి అరెస్ట్ కు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయారే కుట్ర చేశారని అంటున్నారు.అందుకే ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిందని ఆయన అంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడితో పాటు అటు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దెబ్బతీసేందుకే ఓటుకు నోటు కేసు తెచ్చారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
బిజెపితో చీకటి స్నేహం చేస్తోన్న కేసీయార్ సీక్రెట్ ఆపరేషన్ కారణంగానే చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంతో పాటు ఫైబర్ నెట్ స్కాం లోనూ విచారణ చేయాలని ఏపీ సిఐడీ పోలీసులు పీటీ వారంట్లతో సిద్ధంగా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు తరుముకు వస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే కొన్నేళ్ల క్రితం నాటి ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసు పై సుప్రీం కోర్టు అక్టోబరు 4న విచారణ చేపట్టనుంది. చాలా కాలంగా అతీ గతీ లేకుండా పోయిన ఓటుకు నోటు కేసు ఇపుడు పైకి రావడం వెనుక కేసీయార్ హస్తం ఉందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు కొందరు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కోసం టిడిపి నేత రేవంత్ రెడ్డి ద్వారా ప్రలోభ పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గెలవడానికి అవసరమైన బలం టిడిపికి లేదు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్ధిని పోటీలో పెట్టారు. తమకు పూర్తి బలం లేదు కాబట్టి ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఓట్లు సంపాదించడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగా స్టీఫెన్ సన్ ఇంటికి నాటి చంద్రబాబు నాయుడి కుడి భుజం అయిన రేవంత్ రెడ్డి వెళ్లారు. 50 లక్షల రూపాయల నగదును సూట్ కేసులో తీసుకెళ్లి స్టీఫెన్ సన్ కు ఆఫర్ ఇచ్చారు. టిడిపి అభ్యర్ధిని గెలిపిస్తే మీకు ఏం కావాలంటే అది చంద్రబాబు చూసుకుటారని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మొత్తం ఘటనను తెలంగాణా ఏసీబీ పోలీసులు సీక్రెట్ గా చిత్రీకరించడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
డబ్బులతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోగా.. స్టీఫెన్ సన్ తో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు నాయుడు బ్రదర్ మా వాళ్లు బ్రీఫ్డ్ మీ …అంతా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఈ ఫోను సంభాషణ కూడా పోలీసులు రికార్డు చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిన వీడియో..చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియో రెండూ మీడియాలో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టాయి. అయితే ఆ తర్వాత ఈ కేసు మందగమనంతో నడిచిందన్న విమర్శలూ వచ్చాయి. ఈ కేసుపైనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లోనే సుప్రీం కోర్టు తాజాగా ఓటుకు నోటు కేసును విచారించనుంది.
ఓటుకు నోటు కేసు అప్పట్లో ఫిక్స్ చేసిందే కేసీయార్ ప్రభుత్వ అజమాయిషీలోని తెలంగాణా ఏసీబీ. అందుకే ఇపుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఈ కేసును తిరగతోడ్డం వెనుక కేసీయార్ హస్తం ఉందన్నది కాంగ్రెస్ నేత జడ్సన్ అనుమానం. దీని ద్వారా చంద్రబాబు నాయుడిపై పాత కక్షలు ఉంటే అవి తీర్చుకోవడంతో పాటు.. తెలంగాణాలో జోష్ తో దూసుకుపోతోన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పేందుకే పిసిసి అధ్యక్షుణ్ని ఇబ్బంది పెట్టడానికి కూడా ఈ కేసు పనికొస్తుందని కేసీయార్ భావించి ఉంటారని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలో పివి నరసింహారావు ప్రభుత్వానికి అండగా నిలిచిన జార్ఖ్ండ్ ముక్తి మోర్ఛా ఎంపీలకు ముడుపులు అందాయన్న కేసు సంచలనం సృష్టించింది. అది ఎంత సీరియస్ కేసో చంద్రబాబు నాయుడి ఓటుకు నోటు కేసు కూడా అంతే తీవ్రమైనదని న్యాయరంగ నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు 23 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన పై అభియోగాలు నిరూపితం అయితే జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. స్కిల్ కేసులో బెయిల్ దొరికి బయటకు వచ్చినా.. ఓటుకు నోటు కేసులో మళ్లీ జైలుకు వెళ్లాల్సి రావచ్చునంటున్నారు. అటు రేవంత్ రెడ్డి మెడపైనా జైలు శిక్ష కత్తి వేలాడుతూ ఉంటుందంటున్నారు. మరి సుప్రీం కోర్టులో ప్రాసెస్ ప్రకారమే ఓటుకు నోటు కేసు ఇపుడు విచారణకు వచ్చిందా లేక కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్నట్లు నిజంగానే కేసీయార్ కేంద్రంలోని బిజెపి పెద్దలతో కలిసి కుట్ర పన్ని దాన్ని తెరపైకి తెప్పించారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…