ఆంధ్ర ప్రదేశ్ లో విపక్ష కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో దివంగత వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదని వై.ఎస్.ఆర్. కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిలతో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసును ఉద్దేశ పూర్వకంగా విపక్ష కూటమి నేతలంతా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో విపక్షాలన్నీ కూడా వై.ఎస్.వివేకా హత్య కేసు చుట్టూనే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందరూ కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తున్నారు. వివేకా హత్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగితే ఇపుడా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారిస్తోంది. అయితే టిడిపి, జనసేన, ఏపీ కాంగ్రెస్ , ఏపీ బిజెపిలతో పాటు వివేకా తనయ కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డే హంతకుడని ఆరోపిస్తూ హంతకుణ్ని ముఖ్యమంత్రి కాపాడుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు.ప్రత్యేకించి వై.ఎస్.వివేకానంద రెడ్డి కి చెందిన వై.ఎస్.ఆర్. జిల్లా ఎన్నికల ప్రచారంలో దీన్ని అందరూ హైలెట్ చేస్తున్నారు. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాబు కడప జిల్లా కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ ను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం ఎవ్వరూ కూడా ఇకపై ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ పిసిసి చీఫ్ షర్మిల, వివేకా తనయ సునీతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో విపక్ష కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రజాసమస్యలన్నీ వదిలేసి వివేకా హత్యకేసునే అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేయాలనుకున్న చంద్రబాబు అండ్ కో కి ఈ ఆదేశాలు కోలుకోలేని షాకే అంటున్నారు నిపుణులు.
2019 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు నాయుడు వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసునే ప్రధాన అజెండాగా పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రచారం చేశారు. వివేకా హత్య జరిగినపుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. హంతకులను ఆయనే తప్పించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అప్పట్లోనే ఆరోపించింది. వాటికి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు తమపై విష ప్రచారం చేయడంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పుడు కూడా న్యాయస్థానం వివేకా హత్య కేసు గురించి మాట్లాడ్డానికి వీల్లేదని చంద్రబాబుతో సహా ప్రతీ ఒక్కరికీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో చంద్రబాబు నోటికి తాళాలు పడ్డాయి.
2019ఎన్నికల్లో వివేకా హత్య కేసుపై విష ప్రచారం ద్వారా లబ్ధి పొందవచ్చని అనుకున్న చంద్రబాబు ఆశలు గల్లంతయ్యాయి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడి పార్టీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక మూడేళ్లుగా మళ్లీ వివేకా హత్య కేసుపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపైనా జగన్ మోహన్ రెడ్డిపైనా చంద్రబాబు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు జనసేన నాయకుడు పవన్ కల్యాన్ కూడా చీటికీ మాటికీ సొంత బాబాయ్ నే గొడ్డలితో నరికి చంపారంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఎన్నికలకు నగారా మోగిన తర్వాత మరోసారి వివేకా హత్య కేసును అస్త్రంగా మలుచుకోడానికి చంద్రబాబు సిద్ధం అయిపోయారు. తాను తమ పార్టీ నేతల చేత వివేకా హత్య కేసు నేరాన్ని అవినాష్ రెడ్డికి ఆపాదిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి హంతకుణ్ని రక్షిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు. బాబుతో పాటే పవన్ కల్యాణ్ కూడా ఇపుడు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. వివేకా హత్య జరిగి అయిదేళ్లయ్యింది. అయిదేళ్ల పాటు ఏమీ మాట్లాడని ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఇప్పుడే నిద్రలేచినట్లు వివేకా హత్య పై చంద్రబాబు చేసిన ఆరోపణలనే చేస్తున్నారు. వివేకా కూతురు సునీత కూడా అవినాషే హంతకుడని తీర్పు ఇచ్చేయడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డి ఆ హంతకుని కాపుడుకొస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో దీంతోనే పాలక పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు పన్నిన వ్యూహం ఇపుడు కడప కోర్టు ఆదేశాలతో బెడిసి కొట్టినట్లయ్యిందంటున్నారు న్యాయ రంగ నిపుణులు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…