ప్రధాని మోదీ కోసం ఏపీ ఎదురు చూస్తోంది. కూటమికి జాతీయ నాయకుడిగా రాష్ట్రానికి ఆయన ఇవ్వబోయే వరాలు, హామీలు ఏమిటోనని ఉత్కంఠగా ఉంది.జగన్ ఓటమి ఖాయమని, కూటమి గెలుపు తథ్యమని సర్వేలు నిగ్గు తేల్చిన నేపథ్యంలో ఆ గెలుపుతో ప్రజలకు ఒరిగేదేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దానికి మోదీనే సమాధానం చెబితే బావుంటుందని జనంలో చర్చ మొదలైంది. కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి అసాధ్యమని తేల్చేసిన నేపథ్యంలో మోదీ వైఖరేమిటోనని జనం ప్రశ్నిస్తున్నారు. రెండు మూడు అంశాల్లో ఆయన స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు…..
నిజానికి ప్రధాని మోదీ రెండు నెలల క్రితమే విశాఖ రావాలి. ఏ కారణంతోనే అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మోదీ రెండు రోజుల టూర్ ఖరారైంది. ఆరు, ఎనిమిది తేదీల్లో ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటిస్తారు. అందులో భాగంగా విజయవాడలో భారీ రోడ్ షో కూడా ఉంటుంది. మోదీ వెంట చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండే విధంగా షెడ్యూల్, సెక్యూరిటీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరో తేదీన ఆయన అనకాపల్లిలో చేసే ప్రసంగంపైనే అందరి దృష్టీ పడింది. రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తన పరపతిని వినియోగించి మోదీ సభను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయించారు. అయితే మోదీ ఏం చెప్పబోతున్నారు…తమ ఆకాంక్షలను బట్టి ఆయన ప్రసంగం ఉంటుందా అని ఉత్తరాంధ్ర జనం ఎదురుచూస్తున్నారు. అసలే అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు లాంటివి అటకెక్కి చాలా రోజులైంది. వాటిని పూర్తి చేసే విషయంలో తాము అనుకూలమని స్థానిక బీజేపీ నేతలు అంటున్నా..మోదీ నోట ఆ మాట చెబితేనే శంఖంలో పోసిన తీర్థమవుతుందని ఏపీ ప్రజల విశ్వాసం. పైగా జగన్ రెడ్డి అమరావతికి చేసిన అన్యాయాన్ని మోదీ ఖండించకుండా వదిలేశారన్న అసంతృప్తి కూడా జనంలో ఉంది…
ఉత్తరాంధ్ర సమస్యలపై మోదీ ఏం చెప్పబోతున్నారు..ఆయన ఏం చెప్పాలి అన్నది ఇప్పుడు ప్రజల్లో వస్తున్న చర్చ. మోదీ కొత్తగా చేసే ప్రకటనలు సంగతి ఎలా ఉన్నా…రెండు అపరిష్కృత సమస్యలపై మాత్రం ఆయన పెదవి విప్పాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ రెండింటి విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తోందని కూడా విశాఖ జనం గుర్రుగా ఉన్నారు….
ప్రధానిగా మోదీ విపక్షాలపై విరుచుకుపడటం ఖాయం. ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీని తిడితే ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసో లేదో. ఏపీలో చచ్చిపోయిన పార్టీ ప్రస్తావన వల్ల సమయం వృథా అవుతుందని గుర్తిస్తే చాలు. దాని బదలు జగన్ రెడ్డి తప్పిదాలను ప్రస్తావిస్తే బావుంటుంది. పనిలో పనిగా రెండు ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారంలో టైమ్ లైన్ ప్రకటిస్తే అంతకంటే బావుంటుంది. అందులో మొదటిది రైల్వే జోన్…. ఇదిగో రైల్వే జోన్ వచ్చేసిందని ఐదేళ్ల క్రితమే మోదీ మహాశయుడు స్వయంగా ప్రకటించారు. తీరా చూస్తే అదిగో ఇదిగో అంటున్నారే తప్ప పని జరగడం లేదు.జీవోలకు పరిమితమైన రైల్వే జోన్ ను ముందుకు కదిలిస్తే బావుంటుందని జనం ఆశపడుతున్నారు. అదే విధంగా స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని మూడేళ్ళ క్రితం ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిందని ఆనాటి నుంచి ఉద్యమిస్తున్నా కనీసంగా కూడా ఈ విషయం పట్టించుకోలేదని వారు అంటున్నారు. పైపెచ్చు స్టీల్ ప్లాంట్ ని మరింతగా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ఈ అంశంపై విశాఖ వాసులకు హామీ ఇవ్వకపోతే మాత్రం జనాగ్రహానికి గురయ్యే అవకాశాలున్నాయి..
మోదీ మంచి మాటకారి. అనేక అంశాల మీద జనరంజకమైన ఉపన్యాసం చేస్తారు కానీ జనాలకు పనికి వచ్చే ఈ రెండు విషయాల మీద మాట్లాడితే బాగుంటుందని అది విశాఖ ప్రగతికి దోహదపడుతుంది.అప్పుడే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో ప్రయోజనం శూన్యం. రావడం పోవడం కాళ్లతిప్పటే అవుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…