తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ లక్షలామంది భక్తులు వస్తుంటారు. ఒక్క క్షణం పాటు లభించే శ్రీనివాసుడి దర్శనం కోసం ఎన్నో పరితపిస్తారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో చేసే పనులు తిరుమల ఆలయ పవిత్రకు భంగం కలిగించేలా ఉంటాయి. తాజాగా తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన వీడియో కలకలం రేపుతోంది. డ్రోన్ కెమెరాతో ఆలయ పరిసరాలను చిత్రీకరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు. విమానాలు సైతం తిరుమల మీదుగా వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అలాంటి అత్యంత భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై శ్రీవారి ఆలయంపైన నిరంతరం సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉంటుంది. మరోవైపు తిరుమలలో అడుగడుగునా సుమారు 1600 సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ డ్రోన్‌ను సెక్యూరిటీ గార్డులు గుర్తించకపోవడం సీసీ కెమెరాలతో కూడా పనిగట్టలేకపోవడం భద్రతా వైఫల్యమే అని మండిపడుతున్నారు భక్తులు. ఈ వీడియోపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. అసలు ఆ వీడియో నిజమైనదేనా కాదా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందు పెడతామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు ఈ వీడియో తీశారని తెలుస్తోంది. ఐకాన్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్ లోడ్ అయినట్టు గుర్తించారు.