ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చాలా కీలకమైనది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆంధ్ర ప్రదేశే ఆదుకుంది. ఎమర్జెన్సీ అనంతరం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడింది. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలకపాత్ర పోషించింది ఏపీయే. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ యూపీయే టూ సర్కార్ లో కీలక వాటా ఆంధ్ర ప్రదేశ్ దే.
అయితే అప్పటి కాంగ్రెస్ స్టార్ లీడర్ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. అకాల మరణంతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఆయన తనయుణ్ని సిఎం చేయాలంటూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి హైకమాండ్ కు పంపడం దాన్ని సోనియా గాంధీ తిరస్కరించి రోశయ్యను సిఎంని చేయడం జరిగింది. అంత వరకు బానే ఉంది కానీ ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టగా రెండు విడతల తర్వాత దాన్ని నిలిపివేయాలంటూ టెన్ జన్ పథ్ ఆదేశించింది. దాంతో జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టినట్లు హోంమంత్రి చిదంబరం చేత సోనియా ప్రకటన చేయించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
మొత్తానికి 2013 వరకు రాష్బ్ర విభజన అంశాన్ని నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ 2014 ఎన్నికలకు ముందు హడావిడిగా ఏపీ విభజన బిల్లును ఆమోదించేసింది. అది కూడా పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటు ప్రసారాలు నిలిపివేసిన తలుపులు మూసేసి ఏపీని రెండు ముక్కలు చేసింది. రాష్ట్రాన్ని విభజించేది ఏదో పద్ధతి ప్రకారం చేస్తే బానే ఉండేది కానీ ఆంధ్రుల మనోభావాలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా చేయడంతో ఆంధ్ర ప్రాంత ప్రజలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నాయకత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆ మంటలు 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ను కాల్చిపారేశాయి. ఒక ఎన్నిక తర్వాత ప్రజలు అంతా మర్చిపోతారని తర్వాతి ఎన్నికల నాటికి వారి కోపం కూడా మాసిపోతుందని కాంగ్రెస్ భావించింది.
అయితే 2019 ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కక్ష తీర్చుకున్నారు. రెండు వరుస ఎన్నికల్లో ఘోర పరాభవాలను పొందిన కాంగ్రెస్ ఆ తర్వాత గత మూడున్నరేళ్లలో ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన నేతలంతా ఇతర పార్టీలకు తరలిపోయారు. కాంగ్రెస్ లోనే ఉన్న కొద్ది మంది నేతలు సొంతంగా గెలవగలిగే సత్తా ఉన్నవాళ్లు కారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు నిండిపోయాయి. ఇక 2024 ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. విపక్షాలు వచ్చే ఎన్నికలకు ఎవరితో పోవాలా అని పొత్తుల ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ఏం చేయాలో పాలుపోక నిలబడిపోయింది. ఒక్కటి మాత్రం నిజం 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చేతులెత్తేస్తే ఏపీలో కాంగ్రెస్ చాప్టర్ ముగిసినట్లే.