అన్నిదారులూ జనసేనవైపేనా..మరి టీడీపీనో….

By KTV Telugu On 1 October, 2024
image

KTV TELUGU :-

వందరోజుల్లో రాజకీయం మారిపోవడం ఆంధ్రప్రదేశ్లోనే జరిగి ఉండొచ్చు. పూర్తిగా బబ్బుంది అనుకున్న వైసీపీని లేచి నిలబెడుతున్న ఘనత కూడా కూటమి సర్కారుకే దక్కుతుంది. ఒక పక్క కేసుల వేగం,మరోప్కక తిరుమల లడ్డూ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. వైసీపీ నేతల్లో పట్టుదలను పెంచి, వారిలో పోరాట పటిమను బయటకు తీసుకు వస్తున్నాయి. ఎవరికి వారు బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ వివాదాలు ఊతమిస్తున్నాయి. అయితే కూటమిలోని పార్టీలే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తుండగా ఆ దిశగా కొన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి.పైగా టీడీపీ ఒక వైపు, జనసేన-బీజేపీ మరోవైపు సంఘర్షణ తప్పదన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి.

కూటమిలో మైనర్ భాగస్వాములు ఒక ప్రశ్న వేసుకుంటున్నాయి. ఆ ప్రశ్న అమరావతిలో అధిష్టానికి చేరిందో లేదో కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రీసౌండ్ వస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పోటీ చేయాలనుకున్నప్పటికీ.. గత గణాంకాల ఆధారంగా టీడీపీ తీసుకున్న సీట్లకు తాము అభ్యంతరం చెప్పలేదని ఆ రెండు పార్టీలు అంటున్నాయి..ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో తమకు సింహభాగం ఎందుకివ్వరని క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎల్లప్పుడూ టీడీపీ విదిల్చిన ఆరేడు శాతం సీట్లతో సరిపెట్టుకోవాలా అని రెండు పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు తమకు ఎక్కువ నామినేటెడ్ పదవులు రావాలన్నది వారి వాదన..

టీడీపీని దారికి తెచ్చేందుకు జనసేన, బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలుకు తీసుకువచ్చాయనే చెప్పాలి. వైసీపీలో అసంతృప్తిపరులైన కొందరు నేతలకు జనసేన తన తలుపులను బార్లా తెరిచింది. దానితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వచ్చి చేరారు. టీడీపీలో చేరడం ప్రస్తుతానికి చాలా మందికి కష్టం. ఎందుకంటే జగన్ తో అంటకాగిన వారిని చేర్చుకునేది లేదని టీడీపీ అగ్రనాయకత్వం ఇంతకాలం చెబుతూ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కిన పరాజయానికి, ఆ పార్టీలో ఓటమి తర్వాత కూడా మారకుండా ఉన్న అధినాయకుడు జగన్ వైఖరికి విసిగిపోయిన వారు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఓటమికి కారణమైన కోటరీ మీదనే ఇప్పటికీ ఆధారపడి జగన్ రాజకీయాలు చేస్తుండడం వలన.. పార్టీలోని నాయకులకు విసుగు పుడుతోంది. ఆయన తీరు మారకుంటే కష్టం అని వెళ్లిపోతున్నవారు రాజకీయాల్లో కొనసాగదలచుకుంటే.. వారికి మెరుగైన ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే అన్న ఫీలింగును తీసుకురాగలిగారు. దానితో ఇప్పుడు టీడీపీ నేతలు సూప్ లో పడినట్లయ్యింది. ఎందుకంటే బాలినేని రావడమంటే… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న జనసేనకు పూర్తి బలం వచ్చినట్లే అనుకోవాలి. ఉదయభాను, రోశయ్య లాంటి నేతల రాక… కొన్ని సామాజిక వర్గాల్లో ఆశలు చిగురిస్తోంది. అందుకే ఇప్పుడు టీడీపీ కళ్లు తెరవాల్సిన అనివార్యత ఏర్పడింది. మడికట్టుకు కూర్చునే రోజులకు కాలం చెల్లిందని టీడీపీ అధినాయకత్వం గుర్తించాలి. కీలక నేతలు జనసేన వైపో, బీజేపీ వైపుకో వెళ్లిపోకుండా చూడాలంటే.. టీడీపీ వైఖరి మారాలి. తాజా పరిస్థితిని యువ నాయకుడైన నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. ఊరికే రెడ్ బుక్స్, బ్లాక్ బుక్స్ అని చెప్పుకుంటూ తిరిగే కంటే.. వైసీపీ నుంచి రావాలనుకున్న వారిలో తమకు పనికొచ్చే నేతలెవ్వరో గుర్తించాలి. వారికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించాలి. అప్పుడే కూటమిలో అంతర్గతంగా ఉన్న ప్రత్యర్థులకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి…. ఆ సంగతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మించిది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి