జేడీ లక్ష్మీనారాయణ వైసీపీకి దగ్గరవుతున్నారా?

By KTV Telugu On 19 January, 2023
image

గత ఎన్నిలకు ముందు తానే ఓ పార్టీని పెట్టిన లక్ష్మీనారాయణ చివరకు జనసేన అభ్యర్ధిగా విశాఖ లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిన మరుక్షణమే ఆయన జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత అడపా దడపా స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. తనకు తోచిన వ్యాఖ్యలతో వార్లల్లో ఉంటున్నారు. ఒక విధంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లున్నారు. ఇక ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటారా లేకపోతే వచ్చే ఎన్నికల్లో తనకు నచ్చిన పార్టీ తరపున టికెట్ సంపాదించి మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా. సోషల్ మీడియాలో లక్ష్మీ నారాయణ ఈ మధ్య వరుసగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను పథకాలను స్వాగతిస్తున్నారు.

విపక్షాలు రచ్చ రచ్చ చేస్తోన్న జీవో నంబర్ 1 ను కూడా జేడీ స్వాగతించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ప్రాణాలు కాపాడ్డానికి అటువంటి ఉత్తర్వులు అవసరమే అన్నారు కూడా. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న వాటిలో కొన్ని సంక్షేమ పథకాలనూ ఆయన మెచ్చుకుంటున్నారు. లక్ష్మీనారాయణ ఏంటి జగన్ మోహన్ రెడ్డిని మెచ్చుకోవడం ఏంటి అని విశ్లేషకులు బుర్రలు గోక్కుంటున్నారు. పొరపాటున కానీ ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

2009లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. హఠాన్మరణానంతరం ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించడం కొంత కాలం తర్వాత ఆ యాత్రను నిలిపివేయాల్సిందిగా కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీ పెట్టారు. ఆ వెంటనే ఆయనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకరరావు, టిడిపి నేత ఎర్రంనాయుడులు హైకోర్టులు పిటిషన్లు దాఖలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడ్డారన్నది అభియోగం. ఆ కేసును అప్పడి సీబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు.

జేడీ లక్ష్మీనారాయణపై ఇక్కడే ఓ ఆరోపణ కూడా ఉంది. చంద్రబాబు నాయుడిపై ఐ.ఎం.జి. భూముల కుంభకోణం వచ్చినపుడు హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఇదే లక్ష్మీనారాయణ తమ వద్ద సరిపడ సిబ్బంది లేరు కాబట్టి దర్యాప్తు వెంటనే మొదలు పెట్టలేం అన్నారట. దానికి న్యాయమూర్తి విస్తుపోతూ మాక్కూడా సరిపడ సంఖ్యలో జడ్జీలు లేరు అంత మాత్రాన కొత్త కేసులు స్వీకరించలేం అని మేం చెప్తామా అని ప్రశ్నించారు. సరే అది పాత కథం. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే జేడీ చేత జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వాళ్లు అంటారు. అందులో నిజం ఎంతో తెలీదు. కాకపోతే 2019 ఎన్నికల్లో దానికి ఊతం దొరికినట్లే అనిపించింది. ఎన్నికలకు ముందు సొంత పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణ టిడిపి తరపున బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. దాన్ని టిడిపి కూడా ఖండించలేదు.

అయితే జేడీకి టిడిపి టికెట్ ఇస్తే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని సీనియర్లు హెచ్చరించడంతో చంద్రబాబు నాయుడు జేడీని పిలిచి జనసేన తరపున పోటీ చేయండి నేను చెప్తా అన్నారట. బాబు ఆదేశాలతో జనసేనానిని కలిసేందుకు వెళ్లిన లక్ష్మీనారాయణకు మొదట్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయని సమాచారం. లక్ష్మీనారాయణకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోబెట్టేవారని అంటారు. ఆ తర్వాత బాబు చెప్పడంతో పవన్ కళ్యాణ్ జేడీ లక్ష్మీనారాయణకు విశాఖపట్నం లోక్ సభ స్థానాన్ని కేటాయించారన్నది జనసేన వర్గాల కథనం. ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ ఓడిపోవడంతో జనసేనలో ఉండలేనని వెంటనే బయటకు వచ్చేశారు. అప్పట్నుంచీ ఆయన యాక్టివ్ గా లేరు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో టిడిపి వర్గాల్లో ఆందోళన మొదలైంది.

జేడీ కానీ వైసీపీలో కానీ చేరిపోతారా ఏటి అని టిడిపి సీనియర్లు ప్రశ్నించుకుంటున్నారు. అయితే తనపై కాంగ్రెస్, టిడిపిలు అక్రమంగా కేసులు బనాయించారని చెబుతోన్న జగన్ మోహన్ రెడ్డి జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి చేర్చుకుంటారా అన్నది డౌటే అంటున్నారు రాజకీయ పండితులు. గత ఎన్నికల అనుభవంతో జీవితంలో పవన్ కళ్యాణ్ పార్టీతరపున పోటీ చేసే ప్రసక్తే లేదని లక్ష్మీనారాయణ తన సన్నిహిత వర్గాలతో అన్నారట. టిడిపి తరపున పోటీ చేయడానికి అభ్యంతరం లేకపోయినా టిడిపి బాగా బలహీనపడి ఉండడంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని తన సొంత సర్వేలు కూడా తేల్చి చెప్పడంతో లక్ష్మీనారాయణ సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. మరి లక్ష్మీనారాయణ గట్టిగా ఎఫర్ట్స్ పెడితే వైసీపీలో ఎంట్రీ దొరుకుతుందా. ఏమో రాజకీయాల్లో ఏమీ చెప్పలేం. ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ పండితులు.