ఆ మాజీ మంత్రికి చావంటే ఇష్టం

By KTV Telugu On 17 December, 2022
image

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. వినూత్నంగా ఆలోచించే పాలేటి రామారావు ఈసారి తన పుట్టిన రోజుని కాస్తా డెత్ డేగా మార్చారు. భర్త్ డే కేక్ కి బదులు డెత్ డే కేక్ ని కట్ చేసి నలుగురికీ పంచిపెట్టారు. దీంతో మాజీ మంత్రి పాలేటి రామారావు బాపట్ల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో పాలేటి రామారావు ఒక సారి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం చీరాలలో వైసీపీ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. 1959 డిసెంబర్ 17న పాలేటి రామారావు జన్మించారు. ఇప్పటికి 63 సంవత్సరాల వయస్సు ఆయనకి వచ్చింది. అయితే అందరిలా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే ఏముందిలే అనుకున్నారో ఏమో పుట్టిన రోజు నాడు డెత్ డే వేడుకలు చేసుకున్నారు. పాలేటి రామారావుకి ఇప్పటికి 63 ఏళ్ళ వయస్సు రాగా మరో 12 సంవత్సరాలు ఆయన బతికి ఉండాలని కోరుకుంటున్నారు.

అంటే 75 ఏళ్లకు చనిపోవాలని పాలేటి రామారావు ఫిక్స్ చేసుకున్నారు. దీంతో పుట్టిన రోజు వేడుకలకు బదులు రాబోయే 12 ఏళ్లు డెత్ డే వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇవాళ పుట్టిన రోజు వేడుకలకు బదులు 12వ మరణదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం కోసం ప్రత్యేకంగా ఆహ్వాన కార్డులు కూడా తయారు చేయించి బంధువులు, స్నేహితులు, తన అనుచరులకు పంచిపెట్టారు. చీరాలలోని ఐఎంఏ హాల్ లో జరిగే తన మరణ దినోత్సవ వేడుకలకు అందరూ రావాలంటూ ఆహ్వానించారు. వెరైటీగా ఉన్న ఈ మరణ దినోత్సవ వేడుకలు చూసేందుకు పాలేటి రామారావు అనుచరులు భారీగానే తరలివచ్చారు. అందరి సమక్షంలో భర్త్ డే కేక్ కి బదులు డెత్ డే కేక్ కట్ చేసి పంచిపెట్టారు. మరణం అనే భయం లేకుండా ప్రతి ఒక్కరూ డెత్ డే వేడుకలు చేసుకోవాలని పాలేటి రామారావు పిలుపునిచ్చారు.