ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో అప్పుడే టికెట్ల వార్ మొదలైంది. పల్నాడు టీడీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే సత్తెనపల్లిలో తమ్ముళ్ల మధ్య పంచాయతీ గరగరంగా నడుస్తోంది. ఇప్పుడు నరసరావుపేట వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నరసారావుపేట తన అడ్డా అంటున్నారు. నరసరావుపేట ఎంపీ సీటు వేరే వాళ్లకు ఇస్తే ఊరుకునేది లేదని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి అక్కడ కడప వాళ్లకిస్తే ఓడిస్తామని వారికి తమ వర్గం సహకరించదని కుండబద్దలు కొట్టారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో నరసారావుపేటలో కష్టపడ్డానంటోన్న రాయపాటి. ఆ ఏరియాను డెవలప్ చేశానని చెబుతున్నారు. తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తాము కష్టపడతాం తమకు సీటు ఇవ్వాలి అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు తన కుమారుడికి ఇవ్వాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. రెండు నెలల క్రితం వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. ఇంఛార్జ్‌లు లేనిచోట కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారు. అక్కడ 2009, 2014లో టీడీపీ విజయం సాధించగా 2019లో మాత్రం ఓటమి ఎదురైంది. ఈసారి ఎలాగైనా అక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పెద్దగా యాక్టివ్‌గా లేరు. దాంతో వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరపున ఎవరు బరిలో ఉంటారనే చర్చ మొదలైంది. నరసరావుపేటలో ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మైదుకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్‌ను నరసరావుపేట లోక్‌సభ స్థానానికి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయట. అలా కూడా టీడీపీకి కలిసొస్తుందని బాబు మహేష్ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. మహేష్ కూడా కొంతకాలంగా పల్నాడు జిల్లా టీడీపీ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు. దీంతో ఆయన నరసరావుపేట వెళ్లడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన పేరు దాదాపు ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. దాంతో అలర్ట్ అయిన రాయపాటి తన నియోజకవర్గాన్ని కడప వ్యక్తులకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు గతంలో గుంటూరు ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన సాంబశివరావు తమ వారసులకు మాత్రం టికెట్ కావాలని కోరుతున్నారు.
తన రాజకీయ వారసుడ్ని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి కుదరని పక్షంలో నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు రాయపాటి. గతంలో కూడా టీడీపీ అధిష్టానం దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలోనూ తన కుమార్తె కుమారుడి కోసం టీడీపీ అధిష్టానాన్ని రెండు సీట్లు అడిగానంటున్న సాంబశివరావు అధిష్టానం ఇంకా తమ నిర్ణయం చెప్పలేదంటున్నారు. పార్టీని నమ్ముకున్నవాళ్లకు సీట్లు ఇవ్వాలని తమను కాదని మరొకరిని దింపితే పార్టీకి ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు సీటు ఎక్కడ ఇస్తే అక్కడ తన కుమారుడు రాయపాటి శ్రీనివాస్ పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే గుంటూరు జిల్లాలోని తాడికొండ సీటు తోకల రాజవర్దన్ రావుకేనని రాయపాటి వ్యాఖ్యానించారు. ఆయన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని కూడా జోస్యం చెప్పారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని అందుకే చాలామంది సీట్లు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు రాయపాటి.