ఏపీలో మరో వినూత్న కార్యక్రమం.. ఫ్యామిలీ డాక్టర్‌

By KTV Telugu On 8 March, 2023
image

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి పేదల బతుకులు మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో మరో కొత్త ప్రోగ్రాం మొదలు పెడుతున్నారు. ఈ కార్యక్రమం మార్చి 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు కాబోతోంది. రాష్ట్ర వ్యాపంగా ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టుకు రూపకల్పన చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌ 21 నుంచి ఈ కార్యక్రమం ట్రయల్‌ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 45,90,086 మందికి వైద్య సేవలు అందించామని చెబుతున్నారు అధికారులు. ఫామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా 1142 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించారు. ఎవరైనా సెలవుపై వెళ్లినప్పుడు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా 175 మంది డాక్టర్లను అదనంగా నియమించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అంది‌స్తారు. సాధారణ జబ్బులు, సీజనల్‌ వ్యాధులు, గర్భవతులు, చిన్నారులు, పాఠశాల పిల్లల ఆరోగ్యం పరిరక్షణపై ఈ వైద్యులు దృష్టి పెడతారు. మంచానికి పరిమితమైన రోగులకు ఇంటివద్దే వైద్యం అందిస్తారు. అంతేకాదు కాదు పంచాయితీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్యం నిర్వహణపై పర్యవేక్షణ చేస్తారు. రక్తపోటు, రక్తహీనత, డయాబెటిస్‌ తో బాధపడేవారి డేటా సేకరిస్తారు. ఇలాంటివారికి ఫాలోఅప్‌ వైద్యసేవలు అందించేందుకు ఈ డేటాను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో ఒక్కో చోట ఒక కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ముగ్గురు లేదా నలుగురు ఆశా వర్కర్లు ఉంటారు. విలేజ్ క్లినిక్స్‌తోపాటు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లలో మందుల సంఖ్యను 67 నుంచి 105కు పెంచారు. విలేజ్‌ క్లినిక్‌లలో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచారు. ఈ ఫామిటీ డాక్టర్‌ కార్యక్రమం విజయవంతం అయితే మారుమూల ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ఇతర జబ్బులతో బాధపడే నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది అనడంలో సందేహం లేదు.