ఏపీ రాజకీయాలు ఇప్పుడు రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు ప్రధాన పార్టీల్లో అధ్యక్ష పదవులు ఆ రెండు కుటుంబాల పరమయ్యాయి. అంటే ఏపీ రాజకీయాన్ని నడిపేది ప్రస్తుతానికి ఆ రెండు కుటుంబాలేనని చెప్పక తప్పదు. ఆ ప్రక్రియ ఎలా జరిగింది. వాళ్లు ఎలా వచ్చి సెటిలయ్యారు….
ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడైన తర్వాత తెలుగు నేల పులకించిన మాట వాస్తవం. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలలకే ఉమ్మడి రాష్ట్ర జనం ఆయన చేతిలో అధికారాన్ని పెట్టి ఆనంద డోలికల్లో మునిగిపోయిన మాట నిజం. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు ప్రభజనం సృష్టిస్తే రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలతో తారకరాముడు ప్రజలకు అత్యంత చేరువయ్యారు. ఎన్టీఆర్ రాకతో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరుగా రాజకీయాలు వైపు మళ్లారు. 1990ల నాటి రాజకీయ సంక్షోభం కారణంగా ఎన్టీఆర్ దిగిపోయి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. కొద్ది రోజులకే ఎన్టీఆర్ చనిపోవడంతో చంద్రబాబుకు అధికారం సుస్థిరమైంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాలం సీఎంగానూ, ప్రతిపక్ష నేతగానూ సేవలందించిన ఘటన చంద్రబాబుదే..
చంద్రబాబు తర్వాత ఓ అర్థదశాబ్దం వైఎస్ జమానా మొదలైంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. ప్రజారంజక పాలకుడిగా, జనహృదయ నేతగా ఆయన అందరి మదిలో స్థిరపడిపోయారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయే వరకు ఆయన తిరుగులేని నాయకుడు. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ లాంటి చారిత్రక నిర్ణయాలతో వైఎస్ ప్రజల ప్రశంసలు పొందారు. పేద రైతులు, దీనజనులు ఆయన్ను దేవుడిగా కొలిచిన సందర్భమూ ఉంది. అదీ ఒక కోణం. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ గా మారింది. అంతర్గత కుమ్ములాటలతో కూనారిల్లింది. ఈ లోపే రాష్ట్ర విభజన జరగడంతో 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత తనకు సీఎం పదవి ఇవ్వలేదని అలిగి వైసీపీ పెట్టిన ఆయన కుమారుడు జగన్నోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయ్యారు. కాల చక్రంలో ఐదేళ్లు గిర్రున తిరిగిపోగా.. 2019లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్ కు దక్కింది. ఇప్పుడు మరోసారి ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ సోదరి షర్మిలా రెడ్డి అంటే వైఎఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ శాస్త్రి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు…
ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖాధ్యక్షురాలిగా ఉన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలయ్యారు. పురంధేశ్వరి రాజకీయాలకు కొత్త కాదు. షర్మిల మాత్రం నిస్సందేహంగా రాజకీయాలకు కొత్తే..పైగా రాజకీయాల్లో బలవంతులుగా ఉన్న తమ కుటుంబంలోని వారితోనే వాళ్లు పోటీ పడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు…
పురంధేశ్వరి కాంగ్రెస్ లో చేరి రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడిందని గ్రహించి….చల్లగా జారుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడంతో పాటు కుల సమీకరణాలను లెక్కగట్టుకుని ఆమెకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవినిచ్చారు. జగన్ పై అలిగి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. తొలుత తెలంగాణలో ఏదో చేయాలనుకున్నారు. దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రతో గ్రామీణ తెలంగాణ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఐతే తెలంగాణలో ఆమె అనుకున్నది సాధించలేకపోవడంతో కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ పై పోటీకి జగన్ కుటుంబ సభ్యుల అవసరం ఉండటంతో ఆమె చేర్చుకుని ఏకంగా ఏపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. పురంధేశ్వరి, షర్మిల ఇద్దరికీ 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కత్తి మీద సాము లాంటివే. వాళ్లు ప్రాతినిధ్యం వహించే రెండు పార్టీలకు రాష్ట్రం తరపున లోక్ సభలో ఒక ప్రతినిధీ లేరు. ఒక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు తమ తమ పార్టీలను గెలిపించే బాధ్యత వారిద్దరి మీద ఉంది. పైగా చంద్రబాబుతోనూ, జగన్ తోనూ పోటీ పడి రాజకీయాలు నడపాలి. మహిళలు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాష్ట్రంలో ఎలాంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు సొంత ఇమేజ్ మీద వాళ్లు పార్టీలను గెలిపించాల్సి ఉంటుంది. అదీ చాలా కష్టమైన పనేనని చెప్పాలి.
ఏదేమైనా నాలుగు కీలక పదవులు రెండు కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే పెద్ద నాయకులతో పోటీ పడే మహిళలు ఆచితూచి అడుగులు వేయాలి. పైగా షర్మిలకు నోటి దురుసుతనం ఎక్కువన్న చర్చ కూడా ఉంది. మాటల వాడుకలో ఆమె తగిన జాగ్రత్త వహించాల్సిందే. ఇక పురంధేశ్వరికి పూర్తి స్వేచ్ఛ లేదన్న వాదన కూడా ఉంది. అధిష్టానం ఏం చెప్పితే అది చేయాల్సిందేనట. ఐనా సొంత పరపతితో కొంత మేర పార్టీని ఆమె డెవలప్ చేశారు. ఎన్నికల్లో అది ఎలా ఉపయోగపడుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి