ఒకప్పుడు చక్రాలు తిప్పారు.. ఇపుడు ఏమైపోయారు?

By KTV Telugu On 10 February, 2023
image

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోనూ ప్రభుత్వాల్లోనూ చక్రాలు తిప్పారు. వందిమాగధులు మందీ మార్బలాలతో దర్జాలు ఒలకబోశారు. అటువంటి నేతలు ఇపుడు ఏమైపోయారు ఏం చేస్తున్నారు. ఓడలు బళ్లు కావడం ఓకే కానీ మొత్తానికే మాయం కావడం విషాదమే అంటున్నారు రాజకీయ పండితులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు చాలా వైభవంతో మెరిశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడంతా కాంగ్రెస్ సీనియర్లకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చాలా మంది సీనియర్లు వై.ఎస్.ఆర్.కాంగ్రస్ పార్టీలో చేరి కీలక పదవులు అనుభవిస్తున్నారు.

తమ కన్నా వయసులో చిన్నవాడైన జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరడమేంటని చాలా మంది ఆగిపోయారు. వారు ఎటూ వెళ్లలేక అజ్ఞాత వాసులైపోయారు. అటువంటి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. ఇక రాయలసీమకే చెందిన మరో సీనియర్ నేత రఘువీరా రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు అనుభవించిన రఘువీరా రెడ్డి సీనియర్ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడి ముద్ర పడ్డారు. దివంగత వై.ఎస్.ఆర్.తోనూ సన్నిహిత సంబంధాలున్న రఘువీరా రెడ్డి ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి తో ఇమడలేమనుకుని వైసీపీలో చేరకుండా ఉండిపోయారు. మొత్తానికి రాజకీయాలే వదిలేసుకుని వ్యవసాయం చేసుకుంటూ మనవలతో ఆడుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక వై.ఎస్.ఆర్. హయాంలో కాంగ్రెస్ వ్యవహారాల్లో చక్రం తిప్పిన కె.వి.పి. రామచంద్రరావు 2014 ఎన్నికల తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. రాజకీయ వ్యూహాల్లో జీనియస్ అయిన కే.వి.పి. ని వై.ఎస్.ఆర్ కు ఆత్మగా చెబుతారు.

తండ్రితో ఆత్మబంధువులా ఉన్న కేవీపీ ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా తాను కాంగ్రెస్ లోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఏదైనా పుస్తకాల ఆవిష్కరణ సభలు జరిగితే ఆయనకు సన్నిహితులైన వారు పిలిస్తేనే వెళ్తున్నారు. అంతకు మించి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడానికి స్కోప్ లేకుండా పోయింది. ఇక వై.ఎస్.ఆర్.కు కె.వి.పి.కి సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ 2014 ఎన్నికల నుండే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వివిధ ప్రజాసమస్యలపైనా అంశాలపైనా మీడియా ముందుకు రావడం తప్పితే రాజకీయాలు మాత్రం చేయడం లేదు ఉండవల్లి.

ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్స్, ఫైనాన్స్ కంపెనీల్లో నిధులు దారి మళ్లించారంటూ కోర్టుకెక్కిన ఉండవల్లి ఇప్పటికీ ఆ కేసు విషయంలో సుప్రీం కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ లో పాత తరం నేతలో ఒకరైన కావూరి సాంబశివరావు ఇపుడు ఏం చేస్తున్నారో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పారు. ఇపుడు తిప్పడానికి చక్రాలు లేక తిప్పే ఓపికా లేక మౌనంగా కాలక్షేపం చేసేస్తున్నారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ వంటి మాజీ ఎంపీలంతా కూడా చాలా ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో లేరు. వాళ్ల నియోజకవర్గాల్లో కొత్త తరం నేతలు పుట్టుకురావడం కాంగ్రెస్ పార్టీ అతీ గతీ లేకుండా పోవడం తాము బిజెపిలో చేరలేకపోవడం వంటి కారణాల వల్ల ఈ నేతలంతా అస్త్ర సన్యాసులైపోయారు.