గన్నవరం సరే గుడివాడ మాటేమిటి ?

By KTV Telugu On 28 August, 2023
image

KTV TELUGU :-

ఎన్నికలకు ఆరు నెలల ముందే సవాళ్ల పర్వం తారా స్థాయికి చేరుకుంది. యువగళం పాదయాత్రలో గుడివాడ వైపు చూడని నారా లోకేష్ గన్నవరంపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. గన్నవరం వెళ్లి వల్లభనేని వంశీని తీవ్ర ఒత్తిడికి లోను చేశారు. లోకేష్ ఇచ్చిన షాకుల మీద షాకులకు అసలు వంశీ ఉన్నాడా లేదా అన్న డౌటు వచ్చింది కాకపోతే వంశీ కోసం పోరాడేందుకు ఒకరిద్దరు నేతలు మాత్రం ముందుకు వచ్చారు.

నారా లోకేష్ ఒక మాట అంటే…వైసీపీ నేతలు రెండు మాటలు అంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నా కాస్త డిఫరెంట్ గా గేమ్ నడుస్తోంది. వంశీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దానికి బదులుగా లోకేష్ కు కొడాలి నాని, పేర్ని నాని కౌంటరిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే వారి ప్రవర్తనలో మునుపటి వేగం లేదంతే….

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వచ్చినట్లు అనిపిస్తోంది. నారా లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరిపై అసెంబ్లీలో కామెంట్స్ వ్యవహారం బూమరాంగ్ అయిన తర్వాత వంశీ సాధ్యమైనంత….. లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఒక దశలో చంద్రబాబు కుటుంబానికి సారీ కూడా చెప్పి రాజకీయాల్లో తన దూకుడును పూర్తిగా తగ్గించేశారు. టీడీపీ వాళ్లను బూతులతో సత్కరించే వల్లభనేని….ఇప్పుడు మాత్రం ఎంత గోల జరుగుతున్నా బయట కనిపించేందుకు ఇష్ట పడటం లేదు. లోకేష్ పాదయాత్ర గన్నవరంలో హల్ చల్ చేసినా సరే వంశీ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. దానికీ కారణాలు లేకపోలేదు. జగన్ కు తనపై కోపం వచ్చిందని అర్థం చేసుకున్న వంశీ ప్రస్తుతానికి మౌనంగా ఉండాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత వంశీ హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చినా బయట కనిపించేందుకు ఇష్ట పడలేదు. గన్నవరం మండలం నున్నా గ్రామం వార్డు ఉప ఎన్నికల్లో వంశీ నిలబెట్టిన వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంతో జగన్ కు బాగా కోపం వచ్చిందని చెబుతున్నారు. సాధారణంగా అక్కడ వైసీపీ గెలుస్తుందని ఈ సారి మాత్రం టీడీపీ గెలవడం వంశీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పైగా యార్లగడ్డ వెంకట్రావు పట్ల వంశీ ప్రవర్తించిన తీరే ఆయన టీడీపీలోకి వెళ్లిపోయేందుకు కారణమవుతోందని జగన్ నమ్ముతున్నారట.అందుకే వంశీ కలత చెందారని అంటున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే డిఫెన్స్ లో ఉన్నప్పుడే లోకేష్ ఆయన నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఆట ఆడుకున్నారు. పార్టీ అంటే ఇష్టం లేని వ్యక్తి సిగ్గులేకుండా రెండో సారి బీ ఫార్మ్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆయన్ను పిల్ల సైకోగా సంబోధిస్తూ విరుచుకపడ్డారు. పెద్ద సైకో, పిల్ల సైకోను ఒకే సారి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దానితో వంశీ మౌనంగా ఉన్నా కొడాలి నాని, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని మాత్రం గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. దమ్ముంటే లోకేష్ వచ్చి గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసి గెలవాలని పేర్ని నాని సవాలు విసిరారు. పైగా చంద్రబాబుకు తన కొడుకుని పెంచడం చేతకాలేదని విమర్శించారు. లోకేష్ యాత్ర యువగళం కాదని యువ గంగాళమని ఆయన సెటైర్లు కూడా వేశారు. వంశీని పశువుల డాక్టర్ అని పిలిచే టీడీపీ వాళ్లు.. ఆయన పచ్చ పార్టీలో ఉన్నప్పుడు ఏ డాక్టర్ గా పరిగణించారో చెప్పాలన్నారు.

లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఐనా తను అక్కడ నుంచే పోటీ చేస్తానని గన్నవరంలో సైతం ప్రకటించారు. మంగళగిరి తన అడ్డా అని అక్కడి ప్రజల కోసం ఎంతో చేశానని, భవిష్యత్తులో కూడా ఎంతో చేస్తానని లోకేష్ చెప్పుకున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని చేసిన సవాలును ఆయన స్వీకరిస్తారో లేదో చూడాలి. గుడివాడలో పోటీకి లోకేష్ సిద్ధపడతారో లేదో తెలుసుకోవాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లే లోకేష్ కూడా మంగళగిరి, గుడివాడ బరిలో ఉంటారో లేదో ఆయనే చెప్పాలి. అదే కనుక జరిగితే ఏపీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి