మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారా? లేక మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారా? అనేది అర్థం కాని విధంగా మారింది. గంటా వైసీపీలో చేరబోతున్నారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా దీనిపై స్పందించిన ఆయన తన ప్రమేయం లేకుండానే పార్టీ మారతాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకు డేటు టైం కూడా ఫిక్స్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎవరు ఏం రాసుకున్నా, ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. అవసరమైన సందర్భంలో తానే ఏం చెప్పాలో అది చెబుతాను అంటున్నారు. అదే సమయంలో ఇక్కడ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే కాదు చాలా పార్టీలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు గంటా. అంటే గంటా వైసీపీలోకి కాకుండా మరో పార్టీలో చేరతారా అనే ఊహగానాలు మొదలయ్యాయి.
ఈ నెల 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కాపునాడు మహాసభ పోస్టర్‌ను గంటా ఆవిష్కరించారు. కాపునాడు రీ ఆర్గనైజేషన్ ఒక ఆశయం కోసం పని చేస్తోందని అదేంటో సరైన సమయంలో తెలుస్తుందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపులంతా హాజరవుతారని పేర్కొన్నారు. కాపు నాడు ఫ్లెక్సీలో రంగాతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను హైలెట్ చేశారు. గంటా జనసేనలోకి వెళ్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంట్లో భాగంగానే కాపునాడు సభను నిర్వహిస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల పవన్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు గంటా రహస్యంగా కలిశారనే టాక్ వినిపించింది. అదే సమయంలో ఇటీవల కాలంలో చిరంజీవితో గంటా తరచూ టచ్‌లో ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన చూపు జనసేన వైపు మళ్లిందనే వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.
గంటాను వైసీపీలోకి తీసుకొచ్చే విషయంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వైసీపీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. తనతో పాటు ఇద్దరు ముగ్గుర్ని పార్టీలో చేర్చుకొని వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట గంటా. అయితే పార్టీలో చేర్చుకోవడం వరకు ఒకే కానీ? టిక్కెట్ మాత్రం డౌట్ అంటున్నాయట వైసీపీ వర్గాలు. అంతేకాదు జిల్లాలో తనకు కీలక బాధ్యతలు అప్పగించాలని గంటా కోరినట్లు తెలిసింది. జిల్లాలో మాజీ మంత్రి అవంతి గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సీఎం జగన్ గంటాను పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో సానుకూలంగా ఉండడంతో ఆ దిశగా చర్చలు జరుపుతున్నారని వినికిడి. కొన్ని కండీషన్స్ కారణంగా వైసీపీలో గంటా చేరిక ఆలస్యమవుతుందని అంటున్నారు. పార్టీలో చేరడం పక్కా అని చెబుతున్నారు. అయితే అటు జనసేన కూడా గంటాను పార్టీలోకి ఆహ్వానిస్తోందని తెలుస్తోంది. అయితే శ్రీనివాసరావు మాత్రం అలాంటి వార్తలను కొట్టిపారేస్తున్నారు.