గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరుగానే చెప్పాలి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గంట కొడతారని కూడా చెబుతుండేవారు. పదవులను ఆయన వెదుక్కుంటూ వెళతారా పదవులు ఆయన్ను వెదుక్కుంటూ వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం ఓడిపోయిన టీడీపీలో ఆయన ఉండిపోయారు. అధికార పార్టీలో ఉండటానికి అలవాటు పడిపోయిన గంటా వైసీపీలో చేరతారని చాలా రోజుల పాటు ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన కూడా కొంతకాలం టీడీపీలో క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కొందరైతే గంటాపై నేరుగానే ఆరోపణలు చేశారు. ఎవరేమన్నా గంటా మౌనం వహించారు. త్వరలోనే చెబుతాను కదా అంటూ మాట దాటవేసే వారు.
మూడు నాలుగు నెలల క్రితం గంటా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. తనపై వస్తున్న ప్రచారాలను వివరిస్తూ హార్ట్ కోర్ టీడీపీ నాయకుడినని చెప్పుకున్నారు. అలాంటప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి కదా అని లోకేష్ ప్రశ్నిస్తే ఇకపై దూకుడుగానే ఉంటానని చెప్పారు. కరోనా కారణంగానూ వ్యక్తిగత కారణాలతోనూ కొంచెం దూరంగా ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. లోకేష్ కు హామీ ఇచ్చినట్లుగానే గంటా పార్టీలో యమ యాక్టివ్ అయిపోయారు. గంటా తన సత్తాను చాటేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకున్నారు. తొలి వ్యూహంగా వైసీపీ సర్కారుపై ట్వీట్ల వర్షం కురుపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా గంటా శ్రీనివాసరావు సర్కార్కు 20 ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవి రావు తరపున విస్తృతంగా పనిచేశారు. విశాఖలో పలు ప్రాంతాలు కాలేజీలకు వెళ్లి పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించారు. అంతే కాదు నగరంలో పలు చోట్ల చిరంజీవి రావు తరపున ప్రచారం బాధ్యతను తీసుకున్నారు. తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి ఉద్యోగ ఉపాధ్యాయులతో మాట్లాడారు. గంటా రంగంలోకి దిగడంతో బలమైన కాపు సామాజిక ఓటర్లు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇలా ఎంతో వ్యూహత్మంగా గంటా ప్రచారం చేశారు.
నిజానికి చిరంజీవిరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో గంటా కీలక పాత్ర పోషించినట్లే చెప్పుకోవాలి. పార్టీ అధినేత చంద్రబాబు తొలుత బీసీ మహిళ చిన్ని లక్ష్మీ కుమారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వెంటనే గంటా రంగంలోకి దిగి ఉత్తరాంధ్రలో విజయావకాశాలను ఆయనకు వివరించి చిరంజీవిరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు. బలమైన కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయని గంటా వివరించారు. చిరంజీవిరావును నిలబెడితే జనసేన కూడా మద్దతిస్తుందని గంటా చెప్పిన మాటకు చంద్రబాబు ఇంప్రెస్ అయ్యారు. దీనితో అధికార వైసీపి మొదట్లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. చిరంజీవిరావు తరపున గంటా చేసిన విస్తృత ప్రచారం బాగానే పనిచేసింది తన అనుచరులను ఇంటింటికి పంపారు. ఓటర్లను బతిమాలి అయినా టీడీపీకి అనుకూలంగా మార్చాలని ఆదేశించారు. అందుకే ఇప్పుడు చిరంజీవిరావు గెలుపును గంటా అనుచరులు ఆయన ఖాతాలో వేస్తున్నారు. ఇంతకాలం గంటా పట్ల అసంతృప్తిగా ఉన్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆయన్ను పోగొట్టుకున్నామన్న ఆందోళన వైసీపీలో మొదలైందని అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇతర అంశాల్లోనూ గంటా ఇప్పుడు స్పీడ్ పెంచారు. అధికార పార్టీపై ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కేసులకు భయపడి గంటా ఇంత కాలం మౌనం వహించారన్న వాదన ప్రచారంలో ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన వైసీపి తప్పిదాలను ఎండగడుతున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ మళ్లీ విశాఖలో తన సత్తా చాటాలనుకునే గంటా రంగంలోకి దిగారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా గంటా వ్యూహాల్లో దిట్ట అని చెబుతారు ఇకపై ఆయన ఏం చేస్తారో చూడాలి.