ఎప్పుడూ ఒకటే నియోజక వర్గం అంటే బోరు కొట్టేస్తుంది కాబోలు. నియోజక వర్గాలతో పాటు పార్టీలు కూడా మారుస్తూ ఉంటే హుషారు వస్తుంది కావచ్చు. అందుకే టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎంతో లాఘవంగా పార్టీలు, నియోజక వర్గాలూ మారుస్తూ పదవులు పదిలంగా చూసుకుంటున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఖాయమనుకుంటోన్న గంటా జనసేన లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పట్నుంచే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గంటాకు ప్రతిసారీ నియోజకవర్గం, పార్టీ మార్చడం అలవాటుగా మారింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం పార్టీ మారలేదు. టిడిపి అధికారం కోల్పోయిన తర్వాత అధికార పార్టీలోకి జంప్ చేద్దామనకున్నారు కానీ ఎందుకో ఎక్కడో అది వర్కవుట్ కాలేదు. ఎప్పటికప్పుడు పార్టీలు, నియోజక వర్గాలు మార్చే ఈ నేతకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దొరకడం కష్టంగా మారిందట. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా అతి కష్టం మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను గెలిచిన పచ్చ పార్టీ అధికారం కోల్పోవడంతో.. నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి.
గతంలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎంపీగా, చోడవరం, అనకాపల్లి, భీమిలీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనను చట్టసభకు పంపించిన ఆ నియోజకవర్గాలకు ఆయన చేసిందేమీ లేదని ఆయన ప్రత్యర్ధులు అంటారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా తాను గెలిచిన నియోజకవర్గాలు అభివృద్ధిపై ఆయన పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. తన రాజకీయ అవసరాల కోసమే నియోజకవర్గాలను, పార్టీలను మార్చేవారు తప్ప ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదని టిడిపిలోనే ఆయన ప్రత్యర్ధులు గుర్రుమంటున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన నేతనని చెప్పుకునే గంటా శ్రీనివాసరావు..కులం పేరు చెప్పుకుని వారి ఓట్లు దండుకోవడమే గాని కనీసం తన సామాజికవర్గానికి చేసింది కూడా శూన్యం. తన అవసరాల కోసమే కాపు నేతలను కలిసేవారు తప్ప కాపు సమస్యల మీద ఎన్నడూ స్పందించలేదు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిసారి లాగే ఈసారి కూడా కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో గంటా నిమగ్నమయ్యారు. ఇటీవల నార్త్ నియోజకవర్గ టిడిపి నేతల సమావేశంలో ఇకపై నేను మీ ఎమ్మెల్యేను కాదని, మళ్లీ నేను నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని వారికి స్పష్టం చేశారు. ఇప్పుడు గంటా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గం కరువైంది.
అయితే భీమిలి, చోడవరం, పెందుర్తి, ఎలమంచిలి వంటి నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నారు. కాని టీడీపీకి జనసేనతో పొత్తు కుదిరే పరిస్థితుల్లో ఈ నాలుగు నియోజకవర్గాలను జనసేన కోరుతోంది. అందువల్ల ఈ నాలుగింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ భజన గంటాకు తప్పని సరైంది. జనసేన ఆశిస్తున్న సీట్లలో తాను ఒక దాన్ని పొందడం కోసం…పవన్ కళ్యాణ్ భజన ప్రారంభించారు. అందుకే ఆయన తప్పులను సైతం సమర్ధిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కారు. పవన్ వ్యాఖ్యలపై జనసేన నేతల కంటే ముందుగానే గంటా స్పందించారు. పవన్ కి మద్దతుగా ట్వీట్ చేశారు.
టిడిపి ప్రతిపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్లు ఏనాడు గంటా తనను గెలిపించిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చంద్రబాబుకు మద్దతుగా ఏనాడు వ్యవహరించలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. చంద్రబాబు, లోకేష్ విశాఖ వచ్చిన సందర్భాల్లో సైతం మొహం చాటేసేవారు. ఒక సందర్భంలో గంటా పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది.రంగులు మార్చడంలో ఆరితేరిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తన అవసరాల కోసం సొంత పార్టీ అధ్యక్షుడి కంటే జనసేన అధ్యక్షుడి జపంఎక్కువగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అవసరం అయితే జనసేనలో చేరి పోటీ చేసినా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.