లడ్డూ కావాలా నాయనా.. అనేది ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలో ఒక భాగం. దాన్ని జనం జోకుగా కూడా చెప్పుకునే వారు. ఇప్పుడు తిరుమల వ్యవహారంలో అదే సామెతను కొందరు వాడుతున్నారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూలో చేప నూనె, గొడ్డు మాంసం, పంది కొవ్వు వాడుతున్నారని ప్రస్తుత ఏపీ ప్రభుత్వ వాదిస్తోంది. దోషులు ఎంతవారైనా సరే వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన పట్టుబడితే నిజం నిగ్గు తేలే దాకా వదలరని కూడా అందరికీ తెలుసు. పైగా ఆధారాలు లేకుండా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడరన్నది ఒక వాదన. గుజరాత్ ల్యాబ్ లో లడ్డూను టెస్ట్ చేస్తే అందులో జంతువుల కొవ్వు బయటపడినట్లు ఎనక్చర్ వన్ పేరుతో ఒక నివేదిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజమెంత అన్నది విచారణలో తేలుతోంది. పైగా ఇప్పడు అటు జగన్ ను ఇటు చంద్రబాబును నమ్మే అవసరం లేకుండా లడ్డూలో కల్తీ నెయ్యిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరే వాళ్లూ ఉన్నారు. వైసీపీకి చెందిన టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక అడుగు ముందుకేసి తిరుపతి వెంకన్న పాదాల చెంత ప్రమాణం చేస్తానంటున్నారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని, తిరుమల లడ్డూలో ఎలాంటి మోసం జరగలేదని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబు కూడా తిరుమల వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. తమ హయాంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడామని, రాజస్థాన్లోని ఓ దాత రోజుకు 60 కిలోల నెయ్యి పంపారని, మూడేళ్ల పాటు పది కోట్ల రూపాయల వ్యయాన్ని ఆయనే భరించారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే లడ్డూలో నెయ్యిని వాడతారని,ఈ క్రమంలో నాణ్యత లేని పది ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. తిరుమలలో 500 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
రెండుమూడు రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారంపైనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గడిచిపోతున్నాయి. లడ్డూతో పాటు శ్రీవారి అన్నప్రసాదంలో నాణ్యతపైనా చర్చ మొదలైంది. వైసీపీ హయాంలో నాసిరకం బియ్యం వాడారని అందుకే అన్నం పలుకయ్యేదని,కొన్ని సార్లు సంకటి అయ్యేదని వాదన వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగా అన్నదాన సత్రంలో ఉద్యోగులతో భక్తులు గొడవ పడుతున్న వీడియోలు అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు లడ్డూ వ్యవహారం తెరమీదకు వచ్చింది. జగన్ ఇంతవరకూ నోరు విప్పలేదు. అతను మాట్లాడతాడని నమ్మడం కూడా కష్టమే. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా జగన్ చూసిచూడనట్లుగా ఊరుకున్నాడు. క్రమంగా దాన్ని జనం మరిచిపోయారు. ఇప్పుడు కూడా జనం మరిచిపోతారని జగన్ ఎదురుచూస్తుండొచ్చు. కాకపోతే ప్రతీసారి అదృష్టం పనిచేయదు. ప్రతీ సారి జనం ఊరుకోరు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు మొక్కుబడి ఆరోపణలు చేసి మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక పవిత్రత దెబ్బతింటున్నప్పుడు నోరు మూసుకుని ఉండటం భావ్యం కాదన్న ఫీలింగ్ తో బీజేపీపై జనం ఆగ్రహం చెందుతున్నారు. అప్పుడెప్పుడో రాజ్యసభలో జగన్ సపోర్టు చేశాడని ఇప్పుడు చూసీచూడనట్లుగా ఊరుకోవడం భావ్యం కాదన్నది ఒక వాదన. సమగ్ర విచారణ జరపాల్సిందే.. నిజంగా తప్పుజరిగితే దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఎందుకంటే తిరుపతి లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా ఒక పవిత్రమైన ప్రసాదంగా పేరుంది. కళ్లకు అద్దుకోకుండా ఎవరూ నోట్లో వేసుకోరు. అలాంటి లడ్డూలో బీఫ్ వాడటం ఏమిటి.. క్షమించరాని నేరం. దోషులను ఉరితీయాల్సిందే….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…