సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలు బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థాయిలో సీట్లు సాధించింది బిజెపి. కానీ ఈ సారి బిజెపి మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. 272 స్థానాలు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయగల పరిస్థితి ఉండేది. బిజెపి 240 స్థానాల దగ్గర ఆగిపోయింది.ఈ సారి కూడా కేంద్రంలో బిజెపి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అయితే అవకాశం ఉంది .కాకపోతే మిత్ర పక్షాల మద్దతు బిజెపికి చాలా కీలకం. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని టిడిపి బిహార్ లోని నితిష్ కుమార్ పార్టీ జేడీయూ లు చాలా కీలకం అవుతున్నాయి.
కేంద్రంలో వరుసగా మూడో సారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది కానీ బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని సొంతం చేసుకోలేకపోయింది. 2014 లో బిజెపి సొంతంగా 282 స్థానాలు గెలుచుకుంది. అయితే ముందస్తు పొత్తుల ను గౌరవించి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అయితే బిజెపి ఒక్కటే 303 స్థానాలు గెలిచించి అప్పుడు కూడా మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అయ్యింది.
ఈ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బిజెపికి ఏకంగా 63 స్థానాలు తగ్గాయి. సొంతంగా 370 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బిజెపి చివరకు 240 స్థానాలు మాత్రమే గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు కావాలి. ఎన్డీయే మిత్ర పక్షాల సీట్లతో కలుపుకున్నా ఎన్డీయేకి ఈ సారి మూడు వందల సీట్లు రాలేదు. బొటా బొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ లోని జేడీయూ ఏపీలోని తెలుగుదేశం పార్టీలు చాలా కీలకంగా మారాయి.
తమ మద్దతు బిజెపికి ఎంత అవసరమో గుర్తించిన చంద్రబాబు నాయుడు, నితిష్ కుమార్ లు ఈసారి తమ రాష్ట్రాలకు కావల్సినవి సాధించుకోడానికి ఆస్కారం చిక్కినట్లయ్యిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల ముందు ఏపీని విభజించిన నాటి యూపీయే ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని విభజన హామీలు ఇచ్చింది.దానికి బిజెపి కూడా మద్దతు ఇచ్చింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వకూడదని నిర్ణయించుకుని దాన్ని పక్కన పెట్టేసింది.
2014లోనూ 2019లోనూ కూడా ఎన్డీయే కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండడంతో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ గట్టిగా అడగలేకపోయారు. ఈ సారి మాత్రం మా హోదా మాకు ఇవ్వాల్సిందే అని అడగడానికి అవకాశం అయితే ఉందంటున్నారు రాజకీయ పండితులు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే బిజెపికి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని వారంటున్నారు. ప్రత్యేక హోదాయే కాదు ఏపీకి ఇస్తామన్న విశాఖ రైల్వే జోన్ , కడప ఉక్కు కర్మాగారం, పెట్రో కారిడార్ వంటి విభజన హామీలకూ మోక్షం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది ఏపీకి చాలా శుభ తరుణమే అంటున్నారు వారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లగాయితు బిహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితిష్ కుమార్ పట్టు బడుతున్నారు. తాజాగా ఈ ఎన్నికల అనంతరం ఎన్డీయేలో ఉన్న నితిస్ కుమార్ ఈ సారి తమకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు. అదే విధంగా దేశంలో కులగణన జరపాలని ఆయన కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బిజెపి కులగణనను వ్యతిరేకిస్తోంది. అయితే నితిష్ డిమాండ్ ను ఇపుడు పట్టించుకోక తప్పదంటున్నారు. అదే విధంగా ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీర్ పద్ధతిని నితిష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. విపక్ష కూటమి కూడా అగ్నివీర్ ను వ్యతిరేకిస్తోంది. దానిపై పునరాలోచన చేయాలని అప్పుడే నితిష్ కుమార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి తమ అవసరం బిజెపికి ఉండడంతో బాబు, నితిష్ లు తమకి కావల్సినవి సాధించుకోడానికి రెడీ అవుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…