ప్రభుత్వం మారినట్లా..లేనట్లా…

By KTV Telugu On 6 August, 2024
image

KTV TELUGU :-

ఎవరొచ్చినా కొందరికి  కష్టాలు తప్పవు.  వారి జీవితాల్లో మార్పులు కనిపించవు. ప్రభుత్వం మారింది కదా అని సంబరాలు చేసుకుంటే అది వాళ్లకే నష్టం, ఎందుకంటే కొత్త కష్టాలు వారిని వెంటాడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పరిస్థితి కూడా అంతే. 2019లో జగన్ గెలవడంతో కీలక పాత్ర వహించిన పంతుళ్లే.. ఈ సారి చంద్రబాబు గెలిపించుకున్నామని చెబుతారు. ఐనా సరే తమను   వేటాడటం మానలేదని అంటూ తాజాగా కొన్ని ఉదాహరణలు కూడా ఏకరవు పెడుతున్నారు..

కొత్త ప్రభుత్వ పాలనలో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సెలవు రోజైన ఆదివారం  కూడా తమను వదిలి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. మనం కొత్త ప్రభుత్వంలో ఉన్నామా, పాత్ర ప్రభుత్వమే కొనసాగుతుందా అని ప్రశ్నిస్తూ ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వాపోతున్నారు.  ఏపీలో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. అంటే TIS అనే వ్యవస్థ ఒకటి ఉంది. దానికి సంబంధించిన సమాచారం కోసం ఆదివారం కూడా పరిగెత్తించారని  టీచర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా  హెడ్మాస్టర్లను, ఎంఈఓలను ఆదివారం పనిచేయించారని ఆరోపిస్తున్నారు. నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా చేసే అవకాశం ఉన్న పనులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదివారం మాత్రమే ఎందుకు వెంటబడుతోందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి  పాఠశాల యాజమాన్య  కమిటీ ఎన్నికలయ్యే వరకు ఎవరూ కదలడానికి వీల్లేదు. ఐనా సరే ఆదివారమే ఎందుకు ఏడిపిస్తున్నారని టీచర్లు  ప్రశ్నిస్తున్నారు.

జగన్ ప్రభుత్వంలో  ఉపాధ్యాయులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. ఒక దశలో వారితో బ్రాందీ  షాపుల దగ్గర కూడా డ్యూటీ చేయించారు. బోధనేతర పనులకు టీచర్లను వాడుకుని  పనిచేయలేదంటూ కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అప్పట్లో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. టీచర్లను వేపుకు తిన్నారు. అర్థరాత్రి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎందుకు రిప్లై ఇవ్వలేదంటూ మందలించే వారు. పనిగంటలంతా  క్లాసులు తీసుకున్నా సరే ఇంకా ఏమీ  చేయలేదంటూ  వేధించేవారు. మీడియా కెమెరాల సాక్షిగా వారిని  తిట్టిపోస్టుంటే ఉపాధ్యాయులు బక్కచిక్కిపోయిన సందర్భాలుండేవి. ఒకరిద్దరు టీచర్లు ఎదురుతిరిగితే వారికి వేధింపుల  మోతాదు పెరిగేది.  ప్రభుత్వం మారిన తర్వాత  ప్రవీణ్ ప్రకాష్ పీడ విరగడైందనుకుంటే..ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదో ధోరణి పాటిస్తోందని   టీచర్లు అనుమానిస్తున్నారు..

1995 నాటి చంద్రబాబును  మళ్లీ చూస్తారంటూ  ఏపీ సీఎం ఇటీవలే ప్రభుత్వోద్యోగులను హెచ్చరించారు. అప్పట్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు   చేస్తూ, ఫైళ్లన్నీ పరిశీలిస్తూ అందరికీ సింహస్వప్నంగా ఉండేవారు. గంటలు గంటలు మీటింగు పెట్టేవారు. ఇప్పుడు కూడా అదే ధరణిలో వెళ్తారనేందుకు ఒకటి రెండు మీటింగులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చంద్రబాబును గెలిపించుకున్నామన్న సంతోషం టీచర్లలో నిలవదేమో అనిపిస్తోంది.టీ.ఐ.ఎస్ అంటూ వారిని ఇరకాటంలో పెడుతున్నారు.  ఆదివారం  కూడా సెలవు తీసుకోకుండా తమను  వేధిస్తున్నారని వారంటున్నారు.

టీఐఎస్ అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఇన్సర్ట్ చేయడం  వారి వల్ల కావడం లేదు. సాంకేతిక నిపుణులకే కుదరని పని  తాము ఎలా చేయగలమని  వారు ప్రశ్నిస్తున్నారు. అసలే బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇంతవరకు డీఎస్సీ పెట్టి కొత్త వారిని తీసుకోలేదు. అన్ని పీరియడ్స్ క్లాసులు తీసుకున్నా  సమయానికి  సిలబస్ పూర్తవుతుందన్న విశ్వాసం లేదు. పైగా ఇప్పుడు బోధనేతర పనులతో తమను  వేధిస్తున్నారని టీచర్లు ఆగ్రహం చెందుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి