ఆయన తన గురించి ఏదేదో అనుకున్నారు. జగన్ కు చాలా క్లోజయ్యాను, ఇక తిరుగులేదని అనుచరులకు చెప్పుకున్నారు. కొద్ది రోజుల్లోనే డెవలప్ అయిపోయాను, ఇక ఎక్కడమే గానీ దిగడం లేదని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా బొత్స ఎంట్రీ ఇచ్చి విశాఖను ఎగరేసుకుపోవడంతో ఆ గుడ్డు మంత్రికి దిక్కు తోచడం లేదు. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో దాదాపుగా సైడై పోతున్నారు. సత్తిబాబుకు విశాఖ ఎమ్మెల్సీ రావడంతో గుడివాడ అమర్నాథ్ అనుచరులు కూడా డీలా పడిపోతున్నారని సమాచారం..
ఆయనకు గుడ్డు మంత్రి అని పేరు ఉంది. మంత్రిగా ఒక కోడి గుడ్డు కథ చెప్పినందువల్ల అలా వచ్చేసిందనేది వేరే విషయం. సాగర నగరం విశాఖలో తనకు తిరుగులేదని గుడివాడ అమర్నాథ్ అనుకున్నారు. కార్పొరేటర్ నుంచి మంత్రిగా ఎదిగి ఇక అన్ని సాధించడమే అనుకున్న తరుణంలో సీన్ సితారై ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్నికల ముందు, తర్వాత విశాఖ తనదేనని ఆనందపడిపోయిన మాజీ మంత్రికి ఇప్పుడు ఎవరూ, ఏమిటి, ఎక్కడ అనే పరిస్థితి వచ్చింది.ఓడిపోయినా సరే విశాఖలో తానే చక్రం తిప్పుతానని సంబరపడిపోయిన గుడివాడకు సత్తిబాబు రూపంలో సమస్య వచ్చేసింది. అనుకోకుండా సైడైపోవాల్సిన అనివార్యత ఏర్పడింది. విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేసి జగన్ రెడ్డి కేబినెట్లో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతల చేపట్టిన ఆనందం ఇప్పుడు ఆయనలో లేదు. గుడివాడ బ్యాచ్ ఉనికికే పెద్ద ప్రమాదం ఏర్పడింది..
బొత్స మాస్టర్ మానిపులేటర్. ఎవ్వరితోనైనా కలిసి పోతారు. ఎవరినైనా దెబ్బకొట్టగలరు. ఆ క్రమంలో గుడివాడను దెబ్బకొట్టి ఆయన విశాఖ ఎమ్మెల్సీ పదవి లాగేసుకున్నారు. జగన్ రెడ్డి కూడా తన శిష్యుడిని పక్కన పెట్టి మరీ బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. దానితో ఇప్పుడు బొత్స ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో కింగ్ పిన్ అయిపోయారన్న ఫీలింగ్ వచ్చేసింది.
రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీచేసినా గుడివాడ ఘోరంగా ఓడిపోతారని పలు సర్వేలు స్పష్టం చేయడంతో అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఒక దశలో తీవ్ర ఒత్తిడికి లోనయై..ఆయన కంట తడి పెట్టుకున్నారు. అయితే జగన్ తో సత్సబంధాలు ఉండడంతో…గాజువాక అసెంబ్లీ టికెట్ సాధించుకున్నారు. అధినేతను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి టికెట్ సాధించుకున్నారని ఫ్యాన్ పార్టీలో ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు. ఏది అయితే ఏమి? టికెట్ రాదని సమయంలో …గాజువాక అసెంబ్లీ అభ్యర్ధిగా జగన్ ప్రకటించడంతో…ఆయనపై ఎప్పటికప్పుడు విధేయుత ప్రకటిస్తూ వస్తున్నారు. అందరి తల రాతలు బ్రహ్మ రాస్తే…నా తల రాత జగన్ రాస్తారని గుడివాడ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి అధినేతను బుట్టలో వేసుకున్నారు. గాజువాక టికెట్ అయితే, తెచ్చుకున్నారు కానీ ఈ ఎన్నికల్లో గుడివాడ అమర్ నాధ్ ఘోర పరాజయం పాలైయ్యారు. తన సమీప కూటమి అభ్యర్ధి, ప్రసుత్త ఏపి టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఏపిలో అత్యధిక మెజార్టీతో ఓడి అపఖ్యాతిని గుడివాడ అమర్ నాధ్ తన పేరట తానే స్వయంగా రాసుకున్నారు. ఘోరంగా ఓడినా, ఆయన ఎక్కడా అదరలేదు, బెదరలేదు. పార్టీ ఓడిందని చాలా మంది విశాఖ వైసీపీ నేతలు గడపదాటని పరిస్థితిలో కూడా …గుడివాడ …విశాఖలో వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఉనికిలో ఉండేవారు. గెలుపు ఓటములు రాజకీయాలలో సహజమే అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడేవారు. ఇంతలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో….ఈ ఎన్నికల్లో పోటీ చేసి శాసన మండలిలో అడుగు పెట్టాలని గుడివాడ అమర్ నాథ్ తీయ్యని కలలు కన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తొలుత ఆయన్నే రంగంలోకి దించాలని కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని కూడా వార్తలు వచ్చాయి..దీంతో గుడివాడ వర్గం పండగ చేసుకుంది. అయితే ఈ ఆనందం గుడివాడ వర్గానికి ఎన్నో రోజులు లేవు. అమర్ నాధ్ అశలపై పార్టీ సినియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నీళ్లు జల్లారు. బొత్స ఎవరూ ఊహించని విధంగా చక్రం తిప్పి…విశాఖ రాజకీయాలలో ఎంట్రీకి పక్కా స్కెచ్ వేశారు. బొత్స స్కెచ్ కి గుడివాడ అమర్ నాధ్ చిత్తు అయ్యారు.బొత్స ముందు నుంచే విశాఖపై కన్నేశారని గుడివాడ వర్గం అర్థం చేసుకోలేకపోవడం పెద్ద అవివేకమే అవుతుంది. బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే కాకుండా మండలిలో పార్టీ నేతగా కేబినెట్ హోదా పొందారు. దీనితో ఇప్పుడు బొత్సను కాదని విశాఖలో గుడివాడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. స్వతంత్రంగా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. ప్రెస్ మీట్స్ అనే మాట ఆయన నోటి నుంచి రావడం లేదు. దానితో ఆయన అనుచరులకు కూడా దిక్కు తోచడం లేదు.
బొత్స ఒకప్పుడు విజయనగరం నేత. ఇప్పుడు విశాఖలో ఎంట్రీతో మొత్తం ఉత్తరాంధ్రకే వైసీపీ లీడరైపోయారు. పైగా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి సైడైపోయిన తర్వాత ఇప్పుడు సత్తిబాబు ఎంట్రీ ఇచ్చారు. అంతా తన చేతిలో ఉంటుందనుకున్న గుడివాడ అమర్నాథ్ కు ఒట్టి చేయి మిగిలింది. ఏం చేస్తాడో పాపం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…