పవన్ కు జోగయ్య బహిరంగ లేఖ

By KTV Telugu On 7 February, 2024
image

KTV TELUGU :-

జగన్ మోహన్ రెడ్డిని  గద్దె దించడమే తన లక్ష్యమన్న  పవన్ కళ్యాణ్  చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేయడమే తన అజెండాగా భావిస్తున్నారని సీనియర్ కాపు నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అంటున్నారు. దాని వల్ల పవన్ కళ్యాణ్ కలలు కంటోన్న  ప్రయోజనాలు  నెరవేరవని ఆయన స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 25 శాతం మేరకు ఉన్న కాపులు రాజ్యాధికారం వస్తుందన్న ఆశతోనే పవన్ కళ్యాణ్ వెంట నడవాలని అనుకుంటున్నారని..కానీ పవన్ మాత్రం మొత్తం అధికారాన్ని చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టడానికి సిద్ధం అయిపోయారని జోగయ్య  వ్యాఖ్యానించారు. టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్ల  పాటు ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ కు ఇస్తామని చంద్రబాబు నాయుడి చేత చెప్పించాలంటున్నారు జోగయ్య. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే  ఏదీ వర్కవుట్ కాదని ఆయన హెచ్చరిస్తున్నారు.

జనసేనకు నైతికంగా మద్దతు ఇస్తోన్న చేగొండి హరిరామ జోగయ్య కొద్ది రోజుల క్రితమే పవన్ తో భేటీ అయ్యారు. అప్పట్లోనే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కనీసం 60 స్థానాల్లో  పోటీచేయాలని ఆయన సూచించారు. దానికి స్పందనగా పవన్ కనీసం 50 స్థానాలు తగ్గకుండా చూసుకుంటామని మాటిచ్చారని జోగయ్య మీడియా  సాక్షిగా వివరించారు. తాజాగా చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ లు  సుదీర్ఘంగా భేటీ కావడంతో రక రకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. జనసేనకు 27 స్థానాలు మాత్రమే ఇస్తారని ఓ పత్రికలో రావడాన్ని  ప్రస్తావిస్తూ చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు ఓ  బహిరంగ లేఖ రాశారు. అందులో  చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు జోగయ్య. ఎల్లో మీడియా  పనిగట్టుకుని జనసేనకు 27 స్థానాలే ఇస్తారని  వార్త రాయడాన్ని  ఆయన తప్పుబట్టారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ 50 సీట్లకు తక్కువ కాకుండా జనసేన సీట్లు సంపాదించుకోవాలన్నారు ఆయన. రాయలసీమలో పెద్ద సంఖ్యలో ఉన్న  బలిజలు, ఉత్తరాంధ్రలో సత్తా చాటే స్థితిలో ఉన్న తూర్పు కాపులు, గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లో ఆధిపత్యం చెలాయించగల సంఖ్యలో ఉన్న కాపులకు

ఎన్ని స్థానాలు కేటాయిస్తారో తేల్చుకోవాలని సూచించారు జోగయ్య. 2019 ఎన్నికల్లో  అన్ని పార్టీలకు చెందిన మొత్తం 31 మంది కాపులు ఎమ్మెల్యేలు అయ్యారని జోగయ్య వివరించారు.25 శాతం జనాభా ఉన్న  కాపులు.. 60శాతంమేరకు ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సిఎంలు కాకుండా కేవలం కమ్మ, రెడ్డి కులాలకు చెందిన వారే ముఖ్యమంత్రులు అవుతున్నారని ఆయన వివరించారు.కాపులకు రాజ్యాధికారం దక్కాలన్న పట్టుదలతోనే పవన్ కళ్యాణ్ పై కాపులు నమ్మకం పెట్టుకుంటే ఆయన మొత్తం అధికారాన్ని తీసుకెళ్లి చంద్రబాబు చేతుల్లో పెడతానంటున్నారని జోగయ్య సెటైర్ వేశారు.

చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తే అన్నే సీట్లు తీసుకుని పోటీ చేస్తే  రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని జోగయ్య హెచ్చరిస్తున్నారు. అపుడు మొదటికే మోసం వస్తుందని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలని ఆయన సూచిస్తున్నారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగితేనే పవన్ అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి తప్ప  పాతిక..ముప్ఫై సీట్లతో సరిపెట్టుకుని బరిలోకి దిగితే కాపులు కూడా  అండగా నిలిచే పరిస్థితులు ఉండవని తన లేఖలో  అభిప్రాయ పడ్డారు జోగయ్య. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకుండా చేయడమంటే  బేషరతుగా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టెబెట్టమని కాదంటున్నారు జోగయ్య. ఈ విషయంలో పవన్ కు క్లారిటీ ఉండాలని ఆయన హితవు పలికారు.

జనసేన పొత్తు లేకుండా టిడిపి ఎన్నికల్లో  విజయాలు సాధించలేదని 2019 ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు జోగయ్య. ఆరు శాతం ఉన్న రెడ్లు..నాలుగు శాతం ఉన్న కమ్మలు వరుసగా ముఖ్యమంత్రులు అవుతోంటే 80 శాతం మేరకు ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీల నుంచి ఒక్క దామోదరం సంజీవయ్య ఒక్కరే ముఖ్యమంత్రి కాగలిగారని జోగయ్య గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారాలను బడుగులు కోరుకుంటున్నారని ఆయన అంటున్నారు.  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఢీకొట్టాలంటే జనసేనకు కూడా టిడిపితో పొత్తు పెట్టుకోవడం అనివార్యమే అన్నారాయన. అయితే  పొత్తు పెట్టుకున్నప్పుడు మన అధికారాలూ హక్కులూ అన్నింటినీ పట్టుకెళ్లి చంద్రబాబు చేతుల్లో పెడితే ఎవరూ హర్షించరన్నారు.

175 నియోజక వర్గాలున్న ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం మూడో వంతు సీట్లయినా జనసేనకు ఇవ్వకపోతే ఎలాగా? అని ఆయన నిలదీశారు. సీట్ల సర్దుబాటు కోసం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో పవన్  దీనిపై దృష్టి సారించి ఉండాలన్నారు. మూడో వంతు సీట్లలో జనసేన పోటీ చేస్తే పూర్తిగా రాజ్యాధికారం రాకపోయినా పాక్షికంగానైనా కాపులకు అధికారం హస్తగతమవుతుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ తన చేతిలో అధికారం లేకపోతే ఆ ప్రయోజనాలు కాపాడ్డం సాధ్యం కాదని తెలుసుకోవాలన్నారు చేగొండి హరిరామ జోగయ్య. ఈ లేఖపై టిడిపి కానీ జనసేన అధినేత కానీ ఇంత వరకు స్పందించలేదు. టిడిపి జనసేనల మధ్య సీట్ల పంపకం తేలితే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి