కురువృద్ధుడు హరిరామ జోగయ్య టీడీపీ -జనసేన కూటమికి పెద్ద తలనొప్పిగా మారారు. పవన్ తరపున లేని పెత్తనం అందుకుని ఆయన ఇబ్బందిపెడుతున్నారు. ఏవేవో డిమాండ్లు తెరమీదకు తెచ్చి పవన్ కు లేని కోరికలు కలిగిస్తున్నారన్న అనుమానమూ తలెత్తుతోంది. జనసేనాని సర్దుకుపోయేందుకు సిద్ధమైనా.. జోగయ్య లాంటి వారు అడ్డు తగులుతున్నారని ఇరు పార్టీల వర్గాల్లో వినిపిస్తున్న మాట…
టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలకు అసంతృప్త నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కొందరు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు చేగొండి హరి రామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.కూటమిలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? అందులో పవన్ పాత్ర ఏమిటో చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పకుండా ముందుకు సాగడానికి వీల్లేదని కూడా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ కు గౌరవప్రదమైన హోదా ఇవ్వాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా సర్వాధికారాలతో ఆ హోదా ఉండాలని హరిరామజోగయ్య మరీమరీ చెప్పారు.
పవన్ కు రాజగురువుగా ఉండాలన్నది హరిరామజోగయ్య ఆలోచన.రాజకీయంగా తాను సాధించలేనిది పవన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలన్న తపనలో తప్పులేకపోవచ్చు. కాకపోతే ఆయన పవన్ పై వత్తిడి తెస్తున్న తీరు మాత్రమే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది…
కాపు సామాజికవర్గం వాళ్లు జోగయ్యను పెద్దాయనగానే పరిగణిస్తారు. అపార రాజకీయ అనుభవాన్ని తమకు వినియోగించాలని కోరుకుంటారు. కాకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్ప నాయకుడన్న సంగతిని జోగయ్య మరిచిపోతున్నారు. పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయాల్లోనే భిన్న కోణాలున్నాయి. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పవన్ ప్రధాన ఉద్దేశంగా ఆయనే అనేక మార్లు ప్రకటించారు. అలాంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో కలిసిపోయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పవన్ కొనసాగిస్తున్నారు. టీడీపీ తమకు కేటాయించిన 24 స్థానాలకంటే జగన్ ను రాజకీయ యవనికపై లేకుండా చూసుకోవడం ముఖ్యమన్నది పవన్ ప్రధాన ధ్యేయం. అంత రాజకీయ అనుభవం ఉండి కూడా జోగయ్యకు ఇలాంటి అంశాలు బోధపడకపోవడం విడ్డూరంగానే ఉన్నాయి. పైగా పవన్ ను రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని చేస్తానన్న రేంజ్ లో ఆయన మాట్లాడేస్తుంటారు. ఎవరూ అడగకపోయినా పవన్ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేస్తుంటారు. ఆయనకు లౌక్యం తెలీదా.. లేక కావాలనే అలా మాట్లాడుతున్నారా అన్నది కూడా అర్థంకావడం లేదని జనసైనికులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావాల్సినది సంయమనమన్న సంగతి అందరికీ తెలుసు. అధికారం, అధికారంలో భాగస్వామ్యమన్నది ఎన్నికల తర్వాతే తేల్చుకోవాల్సిన అంశమని మరిచిపోకూడదు. ఆ దిశగానే పవన్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే.. జోగయ్య మాత్రం చెవిలో జోరీగలా ఏదేదో మాట్లాడేస్తున్నారు. జనసైనికులకు ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్న పరిస్థితి ఉండొచ్చు. ఏదోక రోజున బరస్ట్ కాక తప్పని పరిస్థితి వస్తుంది. జోగయ్య అక్కడి దాకా తెచ్చుకోకుండా ఉంటే మంచిది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…