బీజేపీకి టీడీపీ, జనసేన లొంగిపోయాయా ? – Have TDP and Janasena surrendered to BJP

By KTV Telugu On 13 March, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు ప్రకటన చూసిన ఎవరికైనా బీజేపీ ప్రాంతీయ పార్టీల్ని ఎలా బ్లాక్ మెయిలింగ్ చేస్తుందో అర్థమైపోతుంది.  ఒక్క శాతం కూడా లేని.. నోటా కూడా దాటే చాన్స్ లేని బీజేపీ ఏకంగా  ఆరు లోక్ సభ స్థానాల్లో అదీ కూడా ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలను తీసుకుంది.  పది అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేస్తోంది.  ఎందుకిలా… తమ పార్టీలను కాపాడుకోవడానికా.. లేకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికా ?

ఏపీలో రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి అయింది.  బీజేపీకి ఏకంగా ఆరు పార్లమెంట్ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. బీజేపీకి ఉన్న బలంతో పోలిస్తే.. ఇది వంద శాతం ఎక్కువ స్థానాలు. అందులో డౌటే లేదు. ఎందుకు టీడీపీ, జనసేన రిస్క్ తీసుకుంటున్నాయన్నది రాజకీయ వర్గాలకూ అంతు  బట్టని విషయం.  అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం బీజేపీ బలాన్ని పూర్తి   ఓట్ల షేర్ తోనే కొలవడంలేదు.  సీట్ల పంపకాల దగ్గరకు వచ్చే సరికి బీజేపీ బలం గురించి ఎక్కువ మంది చర్చిస్తున్నారు.  ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉన్నాయని.. అందువల్ల ఆ పార్టీకి పది అసెంబ్లీ.. ఆరు పార్లమెంట్ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మిగతా రెండు పార్టీలు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాయని అంటున్నారు. నిజానికి ఓట్ల షేర్ ప్రకారం చూస్తే ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ పార్టీ బలాన్ని కేవలం ఓట్ల షేర్ ద్వారా అంచనా వేయడం అంటే.. తప్పులో కాలేసినట్లేనని టీడీపీ, జనసేన అభిప్రాయం.

బీజేపీకి ఉన్న బలం .. ఏపీలో ఓట్ల ప్రకారం తక్కువే కావొచ్చు కానీ.. ఏపీని గట్టెక్కించే బలం.. అధికారం ఆ పార్టీకి ఉన్నాయనేది వంద శాతం నిజం. ప్రజాస్వామ్యంలో తర్వాత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం కానీ  ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  అలాంటి సమయంలో చాయిస్ తీసుకోవడమే రాజకీయం. బీజేపీకి ఉన్న ఓట్ షేర్ వల్ల ఒకటి, రెండు  పార్లమెంట్ అసెంబ్లీ సీట్లలో  చాన్సిచ్చి.. గెలిపించుకుంటే… పోయేదేమీ లేదు.  కానీ భారతీయ జనతా పార్టీ ఆ కొద్ది సీట్లతో రాష్ట్రం కోసం కమిట్ మెంట్‌తో పని చేస్తుందా ?. అసాధ్యం.  ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ.. తమకు ఉన్న ఒకటి, అరా సీట్ల కోసం తాము  ఏపీకి ఏదో చేయాలని అనుకోదు.  పార్టీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి చేయరు. అందు వల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకుండా చేసి కూటమిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడే టీడీపీ, జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. బీజేపీకి కూడా బాధ్యత ఉందనేలా సీట్లను కేటాయించామని వారు వాదిస్తున్నారు.

ఏపీలో  గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు.  పోలవరం ఆపేశారు. రాజధానిని పడుకోబెట్టేశారు. కనీసం రోడ్ల మరమ్మతులు చేయలేదు. కానీ ఐదు వందల కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం.  ఉత్తినే కూటమిలో ఉండి సాయం చేయమంటే బీజేపీ కూడా చేసే అవకాశం ఉండదు.  ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలను..  ఇచ్చి గెలిపించి మరీ … పంపిస్తే…  ఏపీకి ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంటుందని అంటున్నారు.  రాజకీయాలంటే.. ఓట్ల లెక్కలు మాత్రమే కాదు. రాజకీయాలు చేసేది రాష్ట్రం కోసమే.  ముఖ్యంగా టీడీపీ, జనసేన మొదటి నుంచి చెబుతోంది.. రాష్ట్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడటానికేనని చెబుతున్నాయి. మా  బలం ఇంతా….అని టీడీపీ పట్టుదలకు పోతే.. అసలు పొత్తులే ఉండేవి కావు. జనసేన పార్టీ అధినేతపై ఉండే ఒత్తిడి గురించి చెప్పాల్సిన పని లేదు. అంత త్యాగం చేసి బీజేపీకి సీట్లివ్వడం వెనుక..  రాష్ట్రం కోసం అనే వ్యూహమే ఉందని ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు.

అయితే   బీజేపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వారికి రాష్ట్రం కన్నా.. తమ పార్టీలను  కాపాడుకోవడమే ముఖ్యమన్న అంచనాకు వచ్చి బీజేపీ బ్లాక్ మెయిలింగ్ కు లొంగిపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని ఆ రెండు పార్టీలు అంగీకరించకపోవచ్చు. కానీ రాజకీయం అంటే అదే.  మోదీని ఇప్పటికిప్పుడు ఎరూ వ్యతిరేకించే పరిస్థితి లేదు. సామంతులుగా ఉంటే.. సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండవచ్చు లేకపోతే ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి