బ్యారేజీల భద్రతపై తీరని అనుమానాలు

By KTV Telugu On 3 September, 2024
image

KTV TELUGU :-

తట్టుకోలేని వరద, భరించలేని జల ప్రవాహంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎటు చూసినా జలసంద్రమే కనిపిస్తూ సామాన్య జనాన్ని శోకకడలిలో ముంచేసింది. చాలా చోట్ల వరద పోటేత్తి నిలువెత్తు కంటే ఎక్కువగా నీళ్లు కనిపిస్తున్నాయి. సామర్థ్యాన్ని దాటి రిజర్వాయర్లలో నీళ్లు నిండిపోవడంతో అనివార్యంగా భారీ స్థాయిలో కిందకు వదిలేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలమైనా, నాగార్జునసాగరైనా చివరకు ప్రకాశం బ్యారేజీ అయినా అదే పరిస్థితి. అదనపు జలాలు సముద్రంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న ఆఖరి వారధి ప్రకాశం బ్యారేజీ కూడా పూర్తిగా నిండిపోయి..బెజవాడ జనాన్ని భయపెట్టింది. ఒక దశలో పదకొండు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలెయ్యాల్సి వచ్చింది. ఏకంగా 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేశారంటే ప్రవహం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది.

కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. కృష్ణా నదికి సోమవారం రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది.దీనితో విజయవాడ వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తమ నగరానికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. డ్యామ్ సేఫ్టీ పైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయిన ఘటనలను జనం గుర్తు చేసుకుంటూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఇదీ నిజంగా పెద్ద సమస్యేనని నీటి పారుదల రంగ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ లోపు శ్రీశైలంలో కూడా చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని తెలియడంతో భయం మరికాస్త పెరిగింది. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, దిద్దుబాటు చర్యలకు దిగాలని ప్రభుత్వానికి సూచించారు.

దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానారాయుడు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, డ్యామ్‌ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. జలవనరుల శాఖ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని ప్రభుత్వం పిలిపించింది. ఆయన రాత్రికల్లా హుటాహుటిన బ్యారేజీకి వచ్చి పరిశీలించారు. ఈ రెండు చోట్ల గేట్లకు నష్టంలేదని నిర్ధారించారు. కౌంటర్‌ వెయిట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. జలవనరుల శాఖ వర్క్‌షాపులో కొత్త కౌంటర్‌ వెయిట్లను తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చుతారన్నారు. దీనికి సంబంధించిన డిజైన్‌ను తత్వరలో ఖరారు చేస్తామన్నారు. ప్రస్తుతం గేటు కిందికి దిగడానికి ఇబ్బంది లేదని చెప్పారు. ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గాక ఇరుక్కుపోయిన బోటును తీసేసి.. తర్వాత కౌంటర్‌ వెయిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అయితే సమస్య ఇంకా సమసిపోలేదన్నది మాత్రం నిజం. ఎందుకంటే ప్రతీ ఖానా నుంచి సెకనుకు ఆరు మీటర్ల వేగంతో నీరు ప్రవహిస్తోంది. ఒక్కో ఖానా నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఈ పరిస్థితి ఇప్పట్లో తగ్గుతుందని కూడా చెప్పలేం. ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కుల దిగువకు ఎప్పుడు వస్తుందో చూడాలి. అంతవరకు భయం తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి