సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By KTV Telugu On 20 January, 2023
image

ఆంధ‌్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన సలహాదారుల నియామకంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ తన అనుయాయులను వివిధ శాఖలకు సలహాదారులుగా నియమించారు. వారిలో కొందరికి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. ఈ సలహాదారుల నియామకాల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరిగింది.
దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకంతో పాటు ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని హైకోర్టు సూచించింది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని హెచ్చరించింది.

అయితే నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని తెలిపారు. కాబట్టి వారి నియామకం విషయంలో మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు వెల్లడించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అని ప్రశ్నించింది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని కీలక వ్యాఖ్యలు చేసింది.

గతంలో ఇదే కేసుపై విచారణ జరుపుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది హైకోర్టు. ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు ఉండగా వివిధ శాఖలకు మళ్ళీ సలహాదారులు ఎందుకని ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి సంబంధించిన రాజ్యాంగబద్ధత ఎంతవరకు ఉందో తేలుస్తామని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సలహాదారుల పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది