ఏపీలో ఇప్పుడు అన్ని పార్టీలు కాపు జపం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక గుడివాడలో నయా రాజకీయం నడుస్తోంది. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం సమీపంలో రంగా వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లపై వైసీపీ నాయకులు అభ్యంతరం చెప్పడం ఘర్షణకు దారి తీయడం లాంటి పరిణామాలతో హై టెన్షన్ నెలకొంది. రంగా విషయంలో కొడాలి వర్సెస్ రావిగా పాలిటిక్స్ మారిపోయాయి. కొడాలి అనుచరుడు కాశీ రావికి ఫోన్ చేసి చంపేస్తానంటూ హెచ్చరించడం కలకలం రేపింది. రావి కార్యాలయంపై దాడులకు వైసీపీ శ్రేణులు తరలిరావడం టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వంగవీటి రాధా ఈ మధ్య గుడివాడలోనే వరుస పర్యటనలు చేస్తున్నారు. స్ధానిక కాపు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్యలో తన పాత స్నేహితుల్ని సైతం కలుస్తుండడంతో స్థానిక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలోనే రంగా వర్థంతి సందర్భంగా వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఒకే వేదిక పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ సమీపంలోని నున్నలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాధాతో పాటు కొడాలి వంశీలు హాజరయ్యారు. ఈ ముగ్గురు స్నేహితులు పార్టీలు వేరైనా సందర్భానుసారం ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రహస్య భేటీలు నిర్వహిస్తుంటారు రాధాతో ఉన్న స్నేహం కారణంగా గుడివాడలో కాపు సామాజికవర్గం కొడాలికి బాసటగా నిలుస్తోంది. అయితే రాధా ప్రస్తుతం టీడీపీలో ఉండడంతో ఎలాగైనా రాధా బలం, బలగాన్ని ఉపయోగించుకొని ఆ సామాజికవర్గానికి చేరువ కావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వంగవీటి రాధా అక్కడ కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. తన సొంత సామాజికవర్గం కాపుల్ని ఏకం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. అక్కడా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరికి వారు బహిరంగంగానే రాధా సొంత పార్టీ టీడీపీని తిడుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై టీడీపీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా కాపు సామాజికవర్గంలో ఎదుగుతున్న రాధాను ఇప్పటికిప్పుడు దూరం చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇలాంటి నేపథ్యంలో గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్న రావి వెంకటేశ్వరరావుతో వంగవీటి రాధా తాజా స్నేహం ఆసక్తి రేపుతోంది. తెరపైకి రాధా-రావి యూత్ వచ్చింది. నియోజకవర్గంలో రాధా-రావిల భేటీపై కొడాలి వర్గం గుర్రుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే బహిరంగంగా రాధాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కొడాలి తన అనుచరుడైన కాశీ సాయంతో రావికి హెచ్చరికలు పంపినట్లు చెబుతున్నారు
గుడివాడలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే కొడాలికి వ్యతిరేకంగా జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గుడివాడలో రంగా చిత్రపటానికి నివాళులర్పించిన కొడాలి టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. రంగా చావుకు కారణమైన వ్యక్తులే ఆయన బూట్లు నాకుతున్నారని మండిపడ్డారు. మరణించేవరకు రంగా ఆశయాలన కొనసాగిస్తామని కొడాలి అన్నారు. మరోవైపు రంగా స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతం చేస్తామంటూ కొడాలి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు టీడీపీ ఇంఛార్జ్ రావి.
మరోవైపు విజయవాడలో టీడీపీ, జనసేన నేతలతో కలిసి వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు వంగవీటి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వంగవీటి రంగా పేదల పెన్నిధి అని 34ఏళ్ళుగా రంగాను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన బిడ్డగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తానన్నారు. రంగా వర్థంతిని రాజకీయాలకు వేదికగా చేసుకోవద్దని రాధా హెచ్చరించారు. మొత్తంగా రంగా వర్థంతి సందర్భంగా మరోసారి ఏపీలో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. వంగవీటి రాధాను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ, టీడీపీ, జనసేనలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రంగాను పొట్టనబెట్టుకున్న పార్టీ టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తుండగా రాధాను తొమ్మిదేళ్లు రాజకీయంగా వాడుకొని టికెట్ ఇవ్వకుండా జగన్ మోసం చేశారని టీడీపీ, జనసేనలు విమర్శిస్తున్నాయి.