How Many MLCs : తమ్ముళ్లూ..ఎమ్మెల్సీ తీసుకోండి..

By KTV Telugu On 9 April, 2024
image

KTV TELUGU :-

ఏపీ ఎన్నికల్లో ప్రధాన  పార్టీలకు ఆశావహులు పెరిగిపోతున్నారు. వారికి టికెట్లు ఇచ్చేందుకు, కొందరికి సర్ది చెప్పేందుకు  పార్టీనేతలు నానా తంటాలు పడుతున్నారు. కుదరదు అని గట్టిగా చెప్పలేక నీళ్లు నములుతున్నారు. అలాంటి సందర్భంలో పార్టీ పెద్దలకు వచ్చే ఐడియా ఎమ్మెల్సీ అనే పదం. డోన్ట్ వరీ మై హూ నా… అధికారానికి రాగానే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే ఇస్తామంటూ నమ్మపలుకుతున్నారు. నమ్మినా నమ్మకపోయినా గత్యంతరం లేక కొందరు జీ హుజూర్ అంటుంటే.. మరి కొందరు మాత్రం ఆశచావక ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ ట్రెండ్ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సారి గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో ఎక్కువైంది….

టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో పర్యటించారు. అక్కడ పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే క్రోసూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. భారీగానే జనం వచ్చారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు ఆయన్ను  స్టేజీ మీద మాత్రం  నిలబెట్టారు. ఈ సారి  భాష్యం ప్రవీణ్ కు పార్టీ టికెట్ ప్రకటించడంతో శ్రీధర్ కు అవకాశం రాలేదు.  2014 నుంచి 2019 వరకు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్.. ఓడిపోయిన తర్వాత కూడా జనంలో తిరిగారు.  బాగానే ఖర్చు పెట్టారు. సమస్యలపై పోరాడారు. ఐనా ఎందుకో చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. స్టేజీ మీద మాత్రం శ్రీధర్ ను  తెగ పొడిగేశారు. పార్టీ అధికారంలోకి  రాగానే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని ప్రకటించేశారు. ఒక  నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా చేసిన ప్రకటనల్లో ఇదీ ఒకటి. మరో పక్క  పిలిచి  మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమా  మహేశ్వరరావుకు టికెట్ ఇవ్వలేకపోయారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు టికెటిచ్చి ఉమకు మొండిచేయి చూపించారు. ఆయనకు పెనమలూరు టికెట్ ఇస్తారనుకుంటే బోడె ప్రసాద్ పట్టుబట్టి టికెట్ ఎగరేసుకుపోయారు. దానితో ఉమ పరిస్థితి న ఘర్ కా న ఘాట్ కా అన్నట్లుగా తయారైన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కట్టబెడతామని చంద్రబాబు  చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది…

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 58 మంది సభ్యులంటారు. అందులో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులు. మిగతా యాభై స్థానాలు దశలవారిగా నింపాల్సి ఉంటుంది.  విపక్షం బలంగా ఉంటే వారికి కొన్ని స్థానాలుపోతాయి. దానితో ఎమ్మెల్సీ పొందడం కూడా అంత సులభమేమీ కాదు. ఎన్నికల్లో ఎవరూ కోవర్టు చర్యలకు దిగకుండా చంద్రబాబు గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని పార్టీలోనే కొందరు చర్చించుకుంటున్నారు…

అనంతపురం అర్బన్ టికెట్ దక్కక పోవడంతో ప్రభాకర్ చౌదరి వర్గం తీవ్ర నిరాశకు లోనయ్యింది. ఆయన అనుచరులు పార్టీ జిల్లా కార్యాలయంలో కుర్చీలు  పగులగొట్టారు. బ్యానర్లు  తగులబెట్టారు. ప్రభాకర్ చౌదరి అసంతృప్తిని చల్లార్చడానికి ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీలోకి వచ్చిన  రఘురామరాజుకు ఉండీ నియోజకవర్గం  టికెట్ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ముందే ప్రకటించిన రామరాజును , రఘురాజును ఒక చోట కూర్చోబెట్టి చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో రఘురాజును ఉండీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ప్రకటించి… రామరాజుకు ఎమ్మెల్సీ ఇచ్చే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును  తగులబెట్టిన రఘురాజుకు టికెట్ ఎలా ఇస్తారని రామరాజు అనుచరులు బహిరంగంగానే చంద్రబాబును నిలదీశారు. అయితే  ఎమ్మెల్సీ టికెట్ హామీలు  మాత్రం  ఆగడం  లేదు. అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దొన్ను దొరకు ఈ విధంగానే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను దాన్ని నమ్మలేనని ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆయన పట్టుబట్టడం విశేషం.శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశలు పెంచుకున్న మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులకు షాక్ ఇచ్చేశారు. అయితే మాజీ మంత్రి మాత్రం ఎమ్మెల్సీ ఇస్తామన్నా తమకు అక్కరలేదని చెప్పడం విశేషం. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ ఎప్పుడు గెలుస్తుందా ఎప్పుడు ఎమ్మెల్సీ అయిపోదామా అని ఎదురుచూసే  వారి సంఖ్య 70 వరకు ఉంటుందని ఒక అంచనా….

ఆలూ లేదు చూలు  లేదు అల్లుడిపేరు సోమలింగం అని అంటారు. గెలవకముందే ఎమ్మెల్సీల పందేరం కూడా అలాంటిదేనని చెప్పాలి. అందుకే చాలా మంది తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ  అంటే వద్దు బాబూ అంటున్నారు. కావాలంటే ఎంత డబ్బయినా ఖర్చుపెట్టుకుంటాము… ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి చాలు అని వేడుకుంటున్నారు. ఎందుకంటే రేపటి నాడు రాజు ఎవడో రెడ్డి ఎవడో….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి