చిరంజీవి ఇంపాక్ట్ ఎంత‌?

By KTV Telugu On 25 April, 2024
image

KTV TELUGU :-

ఏపీ రాజ‌కీయాల్లో  కొత్త ట్విస్ట్. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి హ‌ఠాత్తుగా  టిడిపి-బిజెపి-జ‌న‌సేన కూట‌మి ఏర్పాటును స్వాగ‌తించారు. అంతే కాదు బిజెపి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తోన్న సిఎం ర‌మేష్, జ‌న‌సేన అభ్య‌ర్ధి పంచ‌క‌ర్ల ర‌మేష్ ల‌ను ఆశీర్వ‌దించాల్సిందిగా మెగాస్టార్  ప్ర‌జ‌ల‌ను కోరారు.రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న చిరంజీవి  ఉన్న‌ట్లుండి రాజ‌కీయాలు మాట్లాడ్డంపై  పాల‌క వైసీపీ నేత‌లు త‌ప్పు బ‌డుతున్నారు.  అటు రాజ‌కీయ విమ‌ర్శ‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న  త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశారు.క‌మ‌ల్ హాస‌న్ వంటి న‌టులు క‌నిపించిన‌పుడు కూడా రాజ‌కీయాలు మ‌న‌కి ప‌డ‌వు వ‌ద్దు అని స‌ల‌హాలు కూడా చెప్పారు చిరంజీవి. నిజంగానే  ముక్కుసూటిగా ఉంటూ కుట్ర‌లు కుతంత్రాలు తెలియ‌ని చిరంజీవి వంటి వ్య‌క్తిత్వం ఉన్న వారు రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేర‌న్న‌ది వాస్త‌వం. 2019 ఎన్నిక‌ల్లో త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత పార్టీ జ‌న‌సేన తో బ‌రిలో దిగిన‌పుడు కూడా చిరంజీవి  మ‌ద్ద‌తుగా ఒక్క‌మాట అన‌లేదు. ప్ర‌చారమూ చేయ‌లేదు.  రాజ‌కీయాల‌కు  పూర్తిగా దూరం పాటించారు.

ఎన్టీయార్ త‌ర్వాత అంత‌టి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న  హీరో చిరంజీవే.  అందుకే  ఆయ‌న ఎన్టీయార్  అడుగు జాడ‌ల్లోనే  సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి  వ‌చ్చారు. ఆయన్ని ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని ఆయ‌న అభిమానులు, ఆయ‌న సామాజిక వ‌ర్గం వారు ఆశించారు. బంధుమిత్రులు కూడా ప్రోత్స‌హించ‌డంతో 2009 ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టారు. రాష్ట్ర‌మంత‌టా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఎక్క‌డికెళ్లినా చిరుకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అయితే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న పార్టీకి 18 స్థానాలే ద‌క్కాయి. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు.

ఎన్నిక‌ల త‌ర్వాత కొంత‌కాలానికి పార్టీని న‌డ‌ప‌డం ఆర్ధికంగా క‌ష్ట‌మ‌ని తేల్చుకున్నారు.  దాంతో మిత్రుల స‌ల‌హాల మేర‌కు కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఆహ్వానం మేర‌కు ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌విని అందుకున్నారు. అయితే 2014లో రాష్ట్ర విభ‌జ‌న  త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్  భూస్థాపితం అయిపోయింది. చిరంజీవి కూడా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసి ఖైదీ నెంబ‌ర్ 150 తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టినుంచి సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ ప‌దేళ్ల‌లో ఆయ‌న ఎప్పుడూ ఎక్క‌డా రాజ‌కీయాల గురించి మాట్లాడ‌లేదు.

2014లో త‌మ్ముడు ప‌వ‌న్  క‌ల్యాణ్ జ‌న‌సేన‌పార్టీ పెట్టారు. మొద‌టి ఎన్నిక‌ల్లో టిడిపి బిజెపిల‌కు మ‌ద్ద‌తు నిచ్చారే త‌ప్ప ఆయ‌న పోటీ చేయ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీలు, బిఎస్పీల‌తో క‌లిసి పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. అయితే ఆయ‌న పార్టీకి ఒకే ఒక్క  అసెంబ్లీ సీటు ద‌క్కింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయిదేళ్ల త‌ర్వాత ఇపుడు తిరిగి టిడిపి-బిజెపిల‌తో జ‌ట్టు క‌ట్టారు. మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్న‌ప్పుడు కూడా చిరంజీవి ఏం మాట్లాడ‌లేదు. కానీ ఇపుడు హ‌ఠాత్తుగా సిఎం ర‌మేష్, పంచ‌క‌ర్ల ర‌మేష్ లు త‌న ఇంటికి వ‌చ్చి ఆశీస్సులు కోర‌డంతో కూట‌మికి మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు.

పంచ‌క‌ర్ల ర‌మేష్ గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ లో ఉన్నారు. ఆ ప‌రిచ‌యంతోనే చిరంజీవి ఆయ‌న్న‌కు ఆశీర్వ‌దించి ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  బిజెపి అభ్య‌ర్ధి సిఎం ర‌మేష్  విష‌యంలో అయితే చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు సిఎం ర‌మేష్ కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఢిల్లీలో వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉండి ఉండ‌చ్చంటున్నారు. అదే నిజ‌మా లేక చిరంజీవి మ‌ద్ద‌తు త‌మ కూట‌మికి ఉంద‌ని చంద్ర‌బాబు నాయుడు చ‌క్రం తిప్పారా అన్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇప్పుడు కూడా చిరంజీవి ప్ర‌చారం చేసే అవ‌కాశాలు ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఆయ‌న కూట‌మిని స్వాగ‌తిస్తున్నాన‌న్న వ్యాఖ్య ఎన్నిక‌ల‌పై ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది చూడాలంటున్నారు రాజ‌కీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి