ఓ వైపు బీజేపీతో పొత్తుకు సిద్ధమంటూనే మరో వైపు ఆ పార్టీ నేతలకు గాలం వేస్తోంది టీడీపీ. కమలం పార్టీకి మరో షాక్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి సైకిల్ ఎక్కేశారు. ఇప్పుడు అదే దారిలో కృష్ణా జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ త్వరలో టీడీపీలో చేరనున్నారని అంటున్నారు. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరటంతో ఇప్పుడు అక్కడ మరో బలమైన నేత టీడీపీకి అవసరం పడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో కామినేనిని సైకిల్ ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కామినేనికి అటు జనసేనాని పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యంలోనూ కామినేని పని చేశారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ కైకలూరును బీజేపీకి కేటాయించింది. కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ చంద్రబాబు సమావేశాల నిర్వహణలో కామినేని కీలక భూమిక పోషించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయంలో ఏపీలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి బీజేపీలోనే కామినేని కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కమలానికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారట.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తు ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. అందుకే ఆ పార్టీ నేతల చేరికపైన నిర్ణయం తీసుకోలేదు. అయితే కమలనాథులు టీడీపీతో కలిసేది లేదని చెబుతుండడంతో బాబు ఆ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునే వ్యూహాలు రచిస్తున్నారు. కైకలూరు సీటు వచ్చే ఎన్నికల్లో కామినేనికి కేటాయించే ఉద్దేశంతోనే బాబు జయమంగళం వెంకటరమణకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదనే వాదన ఉంది. ఇప్పుడు వెంకట రమణ వైసీపీలో చేరటంతో అక్కడ కామినేనికి రూట్ క్లియర్ అయింది. బీజేపీ టార్గెట్గా బాబు చేస్తున్న ఈ రాజకీయం రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.