ఇచ్చాపురంలో టీడీపీ దూకుడు – ప్లాన్ లేని వైసీపీ !

By KTV Telugu On 8 January, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  మొదటిది ఇచ్చాపురం. టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క సారే గెలిచింది.  గెలవడానికి వైసీపీ … కాంగ్రెస్ బలాన్నంతా పోగేసుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు.  ఎన్ని ప్రయోగాలు చేసినా టీడీపీని మరోసారి ఓడించలేకపోతున్నారు.  సీఎం జగన్ ఈ సారి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.  మరి ఆయన ప్రయోగం ఫలిస్తుందా ?

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు చివరలో ఒడిషా సరిహద్దుల్లో ఉంటుంది.   టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప తేడా గెలిచింది. మరోసారి గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత రెండు సార్లు టీడీపీ తరపున బెందాళం అశోక్ పోటీ చేసి గెలిచారు.

2014లో బెందాళం 20వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు.  గత ఎన్నికల్లో ఆ మెజార్టీ ఎనిమిది వేలకు పడిపోయింది. కానీ జనసేన పార్టీ అభ్యర్థి  పన్నెండు వేల ఓట్లకుపైగా పొందారు. ఈ సారి జనసేన మద్దతు టీడీపీకి ఉంటుంది. అందుకే టీడీపీ మరింత  ధీమాగా ఉంది.

ఇచ్చాపురం సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకనుగుణంగా మాజీ ఎమ్మెల్యే, కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించి గత ఎన్నికల్లో పోటీకి చాన్స్ ఇచ్చింది.   గతంలో టీడీపీతరపున గెలిచిన సాయిరాజ్ వైసీపీ తరపున గెలవలేకపోయారు.   ఈ సారి వైసీపీ టిక్కెట్ విషయంలో గందరగోళం నెలకొంది.   శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ బీసీలతో అధిపత్యం .జనాభాలో అత్యధికంగా ఉన్న తూర్పుకాపు, పోలినాటి వెలమ, కాళింగ సామాజిక నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇచ్చాపురంలో అయితే కాళింగులతోపాటు రెడ్డిక, యాదవ సామాజిక వర్గాలు పోటీ పడుతుంటారు.

సామాజిక సమీకరణాలను, ఇతర బలాబలాలను బేరీజు వేసుకొని  అభ్యర్థిని ఖరారు చేయాలనుకుంటున్నారు సీఎం జగన్.    నియోజకవర్గంలో ప్రభావం చూపే యాదవ సామాజిక వర్గంలో పట్టు తప్పిపోకుండా నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో ఆయనకు టిక్కెట్ ఇచ్చినా భారీ తేడాతో ఓడిపోయారు.  పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆయన కూడా ఉన్నారు. ముందుగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుంచి తప్పించింది అధినాయకత్వం. ఇప్పుడు మిగిలిన రెండు సామాజిక వర్గాలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి కాళింగ రెండో రెడ్డిక సామాజిక వర్గం.  ఇన్ని రోజులు వేరే సామాజిక వర్గాలకు ఛాన్స్‌ ఇచ్చారని ఈసారి తమకు అవకాశం కల్పించాలని రెడ్డిక సామాజిక వర్గం ఎప్పటి నుంచో విన్నపాలు చేస్తోంది. అధినాయకత్వం దృష్టిలో పడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు.

ఇచ్చాపురం నియోజకవర్గానికి పిరియా సాయిరాజ్ లేదా ఆయన భార్య ప్రస్తుతం జెడ్పీ ఛైర్పర్సన్ విజయకు టికెట్‌ ఇస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.   వారిద్దరిలో ఒకరికి బి.ఫారం ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయించందని కూడా ప్రచారం నడుస్తోంది. దీంతో రెడ్డిక సామాజికవర్గం నేతలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  సాయిరాజ్ కు లేదా ఆయన భార్యకు టిక్కెట్ ఇస్తే  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడబోమంటున్నారు. ఇక్కడ టీడీపీకి కంచుకోటగా ఉన్న కాళింగ ఓటు బ్యాంకును చీల్చేందుకు వైసీపీ పిరియా సాయిరాజ్ భార్య పిరియా విజయకి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు అప్పగించారు. అయినా మార్పు రాలేదంటున్నారు రెడ్డిక సామాజిక వర్గ నేతలు. అలాంటప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్‌ ఇచ్చే సాహసం చేయదని అంటున్నారు.

అత్యధిక సంఖ్యాబలం కలిగిన రెడ్డిక సామాజిక వర్గానికి ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తామంటు సంకేతాలు పంపుతున్నారు. ఏపీ సీడ్ ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, నర్తు నరేంద్ర యాదవ్‌, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి బి.ఫారం కావాలని కోరుకునే జాబితాలో ఉన్నారు.  టీడీపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.  జనసేన పార్టీ ఓటు బ్యాంక్ పదిహేను వేల వరకూ ఉడంటంతో అది టీడీపీకి కలసి వస్తుంది. సామాజికవర్గాలకు అతీతంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీకి జనం ఆదరణ ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరు అన్నది కాకుండా.. గుర్తునే ప్రధానంగా చూసుకుంటారు. రాజకీయాలు ఎలా మారుతున్నా.. అక్కడి ప్రజలు ఈ ఆదరణ చూపిస్తూనే ఉన్నారు.  వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని.. జనసేన మద్దతులో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు.  వైసీపీ మాత్రం.. అభ్యర్థి విషయంలో కిందా మీదా పడుతోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి