బిజెపిలో చంద్రబాబు కోవర్టులు.. పొత్తను వ్యతిరేకించినందుకే వీర్రాజుపై స్కెచ్

By KTV Telugu On 2 March, 2023
image

రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధి పార్టీల్లోనూ తమ మనుషులను కోవర్టులుగా పంపిస్తూ ఉంటారు.ఆ పార్టీల్లో ఏంజరుగుతోందో ఆ కోవర్టులు తమ ఒరిజినల్ పార్టీ బాసులకు ఉప్పందిస్తూ ఉంటారు. ఇటువంటి ఆపరేషన్లలో దేశంలోనే అపర చాణక్యుడిగా చంద్రబాబు నాయుడికి పేరుంది. ప్రతీ పార్టీలోనూ చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటులాంటి నేతలు ఉంటారు. చివరకు కమ్యూనిస్టు పార్టీల్లోనూ బాబు వందిమాగధులు ఉన్నారంటే బాబు నెట్ వర్క్ ఎంత బలంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఏపీ బిజెపిలో కొంతకాలంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు చాలా చిత్రంగా అనుమానస్పదంగా ఉంటున్నాయి. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పదవికి రాజీనామా చేసి అమాంతం టిడిపిలో చేరిపోయారు. అంటే టిడిపిలో చేరాలని చాలా కాలం క్రితమే డిసైడ్ అయ్యి ఆ తర్వాతనే రాజీనామా చేశారని అనుకోవాలి.

అయితే టిడిపి వర్గాల కథనం ప్రకారం అసలు కన్నా బిజెపిలో చేరేటపుడే చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగా వెళ్లి ఉండచ్చంటున్నారు. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కన్నా బిజెపికి బై చెప్పి టిడిపిలో చేరిన రోజున పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఒంటికాలిపై లేచి నిలబడ్డారు. సోము వీర్రాజు కారణంగానే పార్టీ నాశనమైపోతోందని తీవ్రమైన ఆరోపణ చేశారు. అందుకే తాను బిజెపిని వీడుతున్నానని కూడా ఆయన అన్నారు. ఆ తర్వాత సోము వీర్రాజు వ్యవహార శైలి ఏ మాత్రం బాగా లేదని ఆయన్ను ఆ పదవి నుండి తప్పించాల్సిందేనని ఏపీ బిజెపిలోని కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి బిజెపి నేత మురళీధరన్ ముందు మొర పెట్టుకున్నారు. ఇలా అందరూ సోము వీర్రాజునే టార్గెట్ చేయడానికి కారణాలేంటా అని ఆరాతీస్తే అసలు విషయం బట్టబయలైంది. 2024 ఎన్నికల నాటికి బిజెపితో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు తహతహ లాడుతున్నారు. అయితే బిజెపి హైకమాండ్ మాత్రం చంద్రబాబుతో పొత్తుకు ససేమిరా అంటోంది.

హైకమాండ్ చంద్రబాబుతో పొత్తుకు విముఖంగా ఉండడానికి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజే కారణమని బిజెపిలోని టిడిపి నేతలు చంద్రబాబుకు ఉప్పందించారట. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు నాయుడు దగ్గరుండి నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులకు ఫ్లైట్ టికెట్లు కొని వారిని ఢిల్లీ పంపి అర్జంట్ గా బిజెపిలో చేరిపొమ్మన్నారని హస్తిన కోళ్లు అప్పట్లో అదే పనిగా కొక్కొరొకో అన్నాయి. తమ ఎంపీలను బిజెపి ఎందుకు తీసుకుందని చంద్రబాబు మాట వరసకు కూడా నిలదీయకపోవడంతో కోళ్లు మనుషుల్లా అబద్దాలు కూయవులేనని తెలిసిందంటున్నారు కర్ణపిశాచుల కజిన్ బ్రదర్స్. అలా చంద్రబాబు నాయుడు పంపిన నలుగురు ఎంపీల్లో సుజనా చౌదరి సిఎం రమేష్ లు ఇద్దరూ మాత్రం ఇప్పటికీ టిడిపి వాయిస్ నే వినిపిస్తారు. చంద్రబాబు అజెండానే కొనసాగిస్తున్నారు. అమరావతికి బాబు జై అంటే వీళ్లూ సై అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బాబు అనమంటే వీళ్లు తడుముకోకుండా అనేస్తున్నారు. అలాగే ఏపీ బిజెపిలో సోము వీర్రాజు వైసీపీ అధినేత కన్నాకూడా ఎక్కువగా చంద్రబాబును ద్వేషిస్తున్నారని ఈ నేతలే చంద్రబాబు చెవిలో వేసేసరికి బాబు తట్టుకోలేకపోయారట. అందుకే ఆపరేషన్ సోము వీర్రాజుకు తెరలేపారు.

కన్నా ఉండగానే సోముకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేయించారు. అది హై కమాండ్ దృష్టికి వెళ్లిన తర్వాతనే కన్నాకు ఉద్వాసన పలికి సోము వీర్రాజును అధ్యక్షుని చేసింది నాయకత్వం. అక్కడ తన ప్లాన్ బెడిసి కొట్టడంతోనే చంద్రబాబు రాజీనామా చేసిన వెంటనే కన్నా చేత సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. అలాగే తమ కనుసన్నల్లో పనిచేసే కొందరు బిజెపి నేతలను ఢిల్లీ పంపించి సోము వీర్రాజును పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయించారని ప్రచారం జరుగుతోంది. అసలు ప్లాన్ ఏంటంటే వీలైనంత తొందరగా ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుండి సోము ను తప్పించి చంద్రబాబు నాయుణ్ని అభిమానించే వ్యక్తిని ఎవరినైనా ఆ పదవిలో కూర్చోబెట్టాలన్నది వారి ప్లాన్. బాబును అభిమానించకపోయినా ఫర్వాలేదు కానీ టిడిపితో పొత్తును వ్యతిరేకించకుండా ఉంటే చాలునని వారు భావిస్తున్నారు.

ఆ జాబితాలో ఎన్టీయార్ కుటుంబ సభ్యురాలు అయిన పురంధేశ్వరికే పదవి వస్తే తమ పని తేలికవుతుందని వారు అంచనా వేసుకుంటున్నారు. ఆ మధ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు అమాంతం వెళ్లి తోడల్లుణ్ని పరామర్శించారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత దూరమైన ఈ ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత కలుసుకన్నది కూడా మొన్ననే. మరో రెండు మూడు సార్లు రెండు కుటుంబాల మధ్య గేదరింగ్స్ పెట్టుకుని పాత సంబంధాలు రెన్యువల్ చేసుకుంటే పురంధేశ్వరి కూడా తమకు అనుకూలంగానే ఉంటారని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారట. అయితే ఈ పరిణామాలపై అసలు బిజెపి అగ్రనాయకత్వానికి కొద్ది పాటి సమాచారం కానీ అవగాహన కానీ ఉన్నాయా లేవా అన్నది ప్రశ్న. ఒక వేళ ఉంటే దీన్ని ఎలా డీల్ చేస్తారన్నది మరో ప్రశ్న. కన్నా ద్వారా తలపెట్టిన ఆపరేషన్ ను బిజెపి నాయకత్వం తిప్పికొట్టింది. ఇపుడు రెండో ప్లాన్ ను కూడా కమలనాధులు ఫ్లాప్ చేస్తారా లేదా అన్నది చూడాలి.