తాము ఒకటి తలిస్తే మరోకటి అయ్యిందని టీడీపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. వారికి కొంత కోపమూ ఉంది. జసనేనతో పొత్తు ఖాయమని ముందే తెలిసినా ఇప్పుడు ఎందుకనో వారికి ఆ కాంబినేషన్ నచ్చడం లేదు. జనసేన కార్యకర్తల తీరుపై వారికి బాగానే కోపమొస్తోంది. ఎవరిని ఎవరు శాసించాలి. ఎవరు శాసిస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు..
ఏపీలో వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ-జనసేనలు రెడీ అయ్యాయి. ఇప్పటికే పొత్తులకు సంబంధించిన ప్రక్రియను ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల నేపథ్యంలో కూడా సమన్వయం సాధించాల్సిన అవసరం ఉందని పార్టీ అగ్రనాయకులు గుర్తించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన పార్టీల మధ్య సఖ్యత అంతగా లేదనేది వాస్తవం. ఇప్పుడిప్పుడే లుకలుకలు కూడా బయట పడుతున్నాయి. జనసేన కార్యకర్తలు, కింది స్థాయి నేతలు తీరు టీడీపీ శ్రేణులకు అసలు నచ్చడం లేదు. చిన్న గ్రూపు, పెద్ద పార్టీని డామినేట్ చేసే ప్రయత్నంలో ఉందన్న ఫీలింగ్ వారిలో రోజురోజుకు పెరిగిపోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పవన్ కల్యాణ్ పొత్తులను ప్రకటించినప్పుడు ఎగిరి గంతేసిన టీడీపీ శ్రేణులు తర్వాత ఆలోచించుకుని దానిలో ఏదో తిరకాసు ఉందని గ్రహించారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన దాకా ఆగకుండా పవన్ ప్రకటన చేయడం వత్తిడి పెంచడమే అవుతుందని అర్థం చేసుకున్నారు. పొత్తు ప్రకటించినప్పటి నుంచి జనసైనికులు, వీర మహిళల తీరే మారిపోయిందని చెబుతున్నారు.
ఏ నియోజకవర్గంలో మీటింగ్ జరిగినా జనసేన డామినేట్ చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాము తొంభై మంది ఉంటే పది మంది కూడా లేని జనసైనికులు దూసుకురావడమేంటని టీడీపీ శ్రేణులు టెన్షన్ పడిపోతున్నాయి. పైగా టీడీపీ శ్రేణులను వెనక్కి నెట్టేసి జనసైనికులు ముందు నిల్చోవడం, కూర్చోవడం వారికి అసలు నచ్చడం లేదు. పొత్తు పేరుతో తమ హక్కులను జనసేన లాగేసుకుంటుందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. పట్టుమని పది శాతం ఓట్ షేర్ కూడా లేని పార్టీ ఇప్పుడు సింహభాగం స్థానాలు కోరితే ఏం చేయాలన్నది టీడీపీ మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. మరో పక్క జనసేన రావడం వల్ల టీడీపీలోని కాపు నాయకులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. కాపు సెగ్మెంట్ గా పార్టీలో తాము పూర్తి డామినేషన్ పొందామని, ఇప్పుడు కాపు పార్టీగా జనసేన వచ్చి చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని సత్తెనపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురు నేతలు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం లెక్కల్లో ఎక్కువ సీట్లు జనసేనకు పోతే, టీడీపీలో తమకు నామినేషన్లు దక్కవని టీడీపీ కాపులకు టెన్షన్ పెరుగుతోంది.
ఆరు నెలల్లో ఏపీ ఎన్నికలు జరుగుతున్న వేళ మారుతున్న ప్రతీ పరిణామం టీడీపీ శ్రేణులపై వత్తిడిని పెంచుతోంది. చంద్రబాబు అరెస్టుతో ఇబ్బందుల్లో ఉన్న పార్టీ శ్రేణులకు ఇప్పుడు పొత్తు పార్టీ రూపంలో కొత్త సమస్య వచ్చి పడిందని అంటున్నారు. అలాగని గట్టిగా మాట్లాడితే తమ అధినేతకు, అధిష్టానానికి కోపమొస్తుందన్న భయమూ వారిని వెంటాడుతోంది. ఐనా సరే సర్దుకుపోవాల్సిన అనివార్యత వారిపై ఉంది. ఎందుకంటే ఈ సారి గెలవాలి. గెలిచి తీరాలి. అప్పుడే వైసీపీ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్నే కాకుండా టీడీపీని కూడా బయట పడేయ్యొచ్చని వారికి తెలుసు. అందుకే వాళ్లు సర్దుకుపోతున్నారుకోవాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…